General

నీటి వాడ‌కంలో 20 శాతం కోత పెడితే  100 ఎంజీడీల నీరు ఆదా..

నీటి వాడ‌కంలో 20 శాతం కోత పెడితే  100 ఎంజీడీల నీరు ఆదా..
  • భూగర్భ జలాల రీచార్జ్‌ను పెంచాలి..
  • ప్రభుత్వానికి బిల్డర్ల సూచన

హైదరాబాద్‌లో రానున్న ఐదు నుంచి ఆరు నెలల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంజీరా, సింగూరు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం, గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాల రీచార్జ్ తక్కువగా ఉండటం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తోంది.

ఇటీవల వచ్చిన తుపానులు కూడా జలాశయాలను నింపే స్థాయిలో వర్షాన్ని కురిపించలేదు. దీంతో ఉన్న నీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు నీటి వినియోగాన్ని నియంత్రించాలని జలమండలి ప్రజలు, బిల్డర్లు, పరిశ్రమలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లకు సూచిస్తోంది.

"నగరంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ఉన్న వనరులపైనే ఆధారపడలేం. ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించడంతో పాటు వినియోగాన్ని తగ్గించాలి. ప్రతి నీటి చుక్కను పొదుపు చేయాలి. భూగర్భ జలాల రీచార్జ్, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగం కూడా కీలకం. రానున్న ఐదు నుంచి ఆరు నెలల పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి” అని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఎండీ కె. అశోక్ రెడ్డి తెలిపారు. 

తెలంగాణ డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో నరెడ్కో తెలంగాణ, క్రెడాయ్ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహించిన ఎల్‌నినో ముందస్తు కార్యాచరణ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జలమండలి ఆరు వనరుల నుంచి రోజుకు 560–570 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) నీటిని సరఫరా చేస్తోందని వివరించారు. 2015లో గోదావరి ఫేజ్-1, కృష్ణా ఫేజ్-3 పూర్తయినప్పటి నుంచి నగరం విస్తరించినా, జనాభా పెరిగినా సరఫరా దాదాపు అదే స్థాయిలో ఉందన్నారు.

ఈ ఏడాది మంజీరా, సింగూరు జలాశయాలకు వరద ప్రవాహాలు దాదాపు లేకపోవడంతో అత్యవసర పంపింగ్ చేపడుతున్నామని తెలిపారు. అయినప్పటికీ ఈ వనరుల నుంచి మరో 50–55 రోజులకు సరిపడా నీరు మాత్రమే అందుబాటులో ఉండవచ్చని అంచనా వేశారు. తక్కువ వర్షపాతం, తగినంత రీచార్జ్ లేకపోవడంతో పశ్చిమ, తూర్పు, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయని పేర్కొన్నారు.

రోజుకు సుమారు 100 ఎంజీడీల నీటి కొరతను అధిగమించేందుకు పెండింగ్ పథకం ద్వారా గోదావరి నుంచి అదనంగా 40 ఎంజీడీల నీటిని సమకూర్చుకోవాలని జలమండలి భావిస్తోంది. మరో 50–60 ఎంజీడీలను ప్రత్యామ్నాయ వనరుల నుంచి పొందే అవకాశాలను పరిశీలిస్తోంది. అదే సమయంలో నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గిస్తే సుమారు 100 ఎంజీడీల నీటిని ఆదా చేయవచ్చని అశోక్ రెడ్డి తెలిపారు.

నగరంలోని 30 మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీలు) నుంచి శుద్ధి చేసిన నీటిని గ్రీన్ ట్యాంకర్ల ద్వారా గార్డెనింగ్, ఇతర అవసరాలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. రానున్న ఎనిమిది నెలల్లో నిర్మాణ పనులు, ల్యాండ్‌స్కేపింగ్‌కు శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. తాగునీరు మినహా ఇతర అవసరాలకు వర్షపు నీరు, శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించాలని నివాస సముదాయాలకు సూచించారు.

ఇదీ చదవండి: వంద ఫీట్ల రోడ్డు..  సెవెన్‌ హిల్స్‌, మిడోస్‌ వాసుల్లో ఆందోళన

భూగర్భ జలాల రీచార్జ్‌

నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు కె. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, పౌర సంస్థలు రియల్ ఎస్టేట్ రంగంతో కలిసి పనిచేయడం అభినందనీయమన్నారు. నీరు నిలిచే ప్రాంతాల్లో ఇంజెక్షన్ బోర్‌వెల్స్ ఏర్పాటు చేయాలని కోరారు.

ఇంజెక్షన్ బోర్‌వెల్స్ లేకుండా కేవలం రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేయడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. 

బంజారాహిల్స్ రోడ్ నంబర్-1, వెంగళరావు పార్కు సమీపంలో నీరు నిలిచే సమస్యను ప్రస్తావిస్తూ, పార్కు చెరువు చుట్టూ రీచార్జ్ నిర్మాణాలు చేపడితే భూగర్భ జలమట్టాలు పెరిగే అవకాశం ఉందన్నారు.

దీనిపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన స్పందిస్తూ.. కోయంబత్తూరులో అమలు చేస్తున్న నమూనా ఆధారంగా పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో మాడ్యులర్ రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలతో పాటు ఇంజెక్షన్ బోర్‌వెల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

ఈ విధానాన్ని మరిన్ని వార్డులకు విస్తరిస్తామన్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద అపార్ట్‌మెంట్ సముదాయాలు, కాలనీ సంక్షేమ సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. అవసరమైన చోట ప్రదర్శనలు, సబ్సిడీతో ఏర్పాట్లకు సహకరిస్తామని తెలిపారు.

ఒక బిల్డర్ తన వ్యవసాయ భూమిలో పెర్కొలేషన్ పిట్స్ ద్వారా వర్షపు నీటిని భూమిలోకి పంపించడంతో రెండేళ్ల తర్వాత మూడు బోర్‌వెల్స్‌లో నీటి లభ్యత పెరిగి తిరిగి పనిచేయడం ప్రారంభించాయని వివరించారు. ఈ విధానాన్ని ఇతర డెవలపర్లకు కూడా చూపించేందుకు సిద్ధమని తెలిపారు.

మరో బిల్డర్ మాట్లాడుతూ.. తెల్లాపూర్, నల్లగండ్లలో అక్రమ బోర్‌వెల్స్‌పై హైడ్రా చేపడుతున్న చర్యలను అభినందించారు. అయితే ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ అంశంపై దృష్టి సారించి అక్రమ భూగర్భ జలాల వెలికితీతపై చర్యలు పెంచాలని కోరారు. 

ఇదీ చదవండి: సిమెంట్, స్టీల్ ధరల సెగ..  నిర్మాణ రంగానికి కొత్త సవాల్

ఎస్టీపీలలో శుద్ధి చేసిన నీటి వినియోగం

ఆయా ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీలు వర్షపు నీటి సంరక్షణ, ఎస్టీపీ ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటున్నాయని, నిపుణులు వాటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. అనుసంధానమైన చెరువుల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించి రీచార్జ్‌ను మెరుగుపరచాలని సమావేశంలో పాల్గొన్నవారు సూచించారు.

నిర్మాణ ప్రాంతాలకు సమీపంలోని ఎస్టీపీల నుంచి నేరుగా శుద్ధి చేసిన నీటిని పైప్‌లైన్ల ద్వారా సరఫరా చేస్తే ట్యాంకర్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని మరో ప్రతిపాదన చేశారు. 

దీనిపై స్పందించిన అశోక్ రెడ్డి.. సమీపంలోని నిర్మాణ ప్రాజెక్టులు, వాటి నీటి అవసరాల వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలని బిల్డర్లను కోరారు. దూరం, వ్యయం అనుకూలంగా ఉంటే పైప్‌లైన్ కనెక్షన్లను పరిశీలిస్తామని తెలిపారు.

నరెడ్కో తెలంగాణ మాజీ అధ్యక్షుడు విజయ్ సాయి మేకా మాట్లాడుతూ.. అధిక విద్యుత్ ఛార్జీల కారణంగా అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు ఎస్టీపీల నిర్వహణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, విద్యుత్ టారిఫ్‌లను సవరించాలని కోరారు.

మరోవైపు, ప్రహ్లాద్ అనే ప్రతినిధి ఆర్వో వాటర్ ప్యూరిఫికేషన్ వ్యవస్థల్లో నీటి వృథాను ప్రస్తావించారు. ఒక లీటరు తాగునీటిని తయారు చేయడానికి దాదాపు రెండింతల నీరు వినియోగమవుతోందని తెలిపారు. డ్యూయల్ ఫ్లష్ టాయిలెట్లను ఉపయోగించాలని సూచించారు.

వీటిలో ఫ్లషింగ్‌కు అవసరాన్ని బట్టి సగం నీటిని మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో నీటి పొదుపు సాధ్యమవుతుందని వివరించారు.  

ఇదీ చదవండి: కొల్లూరులో ప్రెస్టీజ్ గోల్డ‌న్ గ్రోవ్‌..