General

వంద ఫీట్ల రోడ్డు..  సెవెన్‌ హిల్స్‌, మిడోస్‌ వాసుల్లో ఆందోళన

వంద ఫీట్ల రోడ్డు..  సెవెన్‌ హిల్స్‌, మిడోస్‌ వాసుల్లో ఆందోళన
  • కోకాపేటలో రోడ్డు అలైన్‌మెంట్‌ వివాదం.. 
  • ఇళ్ల భద్రతపై నివాసితుల ఆందోళన

హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేటలో 100 ఫీట్ల రోడ్డు వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు రహదారుల విస్తరణ అవసరమే అయినప్పటికీ.. ప్రతిపాదిత రోడ్డు అలైన్‌మెంట్‌ తమ నివాస సముదాయాలకు ఇబ్బందులు కలిగిస్తోందని సెవెన్‌ హిల్స్‌, వెస్ట్రన్‌ మిడోస్‌ కాలనీల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపాదిత రహదారి మార్గంలో మార్పుల కారణంగా తమ అపార్ట్‌మెంట్లు, ఇతర నిర్మాణాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని భవనాల వద్ద అధికారులు చేసిన రెడ్‌ మార్కింగ్‌లతో నివాసితుల్లో ఆందోళన పెరిగింది.

తమ ఇళ్లకు ముప్పు ఉందా? భవనాల్లో కొంత భాగాన్ని తొలగిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 1,553 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములుగా ఉన్న సెవెన్‌ హిల్స్‌ నివాస సముదాయంలోనూ ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జీవితకాల సంపాదనతో నిర్మించుకున్న ఇళ్లకు రోడ్డు అలైన్‌మెంట్‌ కారణంగా సమస్యలు వస్తే తమ పరిస్థితి ఏమిటని నివాసితులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి: పుప్పలగూడలో రెండు భారీ  ప్రాజెక్టులకు టీజీ రెరా ఊరట

పాత అలైన్‌మెంట్‌ మార్చి

ఈ రోడ్డు ప్రతిపాదనకు సంబంధించి గతంలోనూ వివాదం తలెత్తింది. 2013లో ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌పై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. 2018లో జీవో నంబర్‌ 181 ద్వారా మార్పులు చేసినట్లు బీఆర్ఎస్‌ నేతలు చెబుతున్నారు.

అప్పట్లో నివాస భవనాలు, హనుమాన్‌ ఆలయానికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని రూపొందించారని వారి వాదన. అయితే ఇప్పుడు మళ్లీ అలైన్‌మెంట్‌లో మార్పులు చేయడం వెనుక కారణాలేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ప్రైవేట్‌ నిర్మాణ సంస్థలకు ప్రయోజనం కలిగేలా మార్గాన్ని మార్చారన్న ఆరోపణలు కూడా రాజకీయంగా చర్చకు వస్తున్నాయి.

రోడ్డు కావాలి.. ఇళ్లు కూల్చొద్దు

తాము రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే తమ ఇళ్లకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని నివాసితులు కోరుతున్నారు. తాజా అలైన్‌మెంట్‌ను బహిరంగంగా ప్రకటించాలని, ప్రభావితమయ్యే భవనాలపై సాంకేతిక పరిశీలన జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అలాగే రెడ్‌ మార్కింగ్‌ల ఆధారంగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, స్థానికులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

స్పష్టత కోసం ఎదురుచూపు

కోకాపేట వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రహదారుల విస్తరణ అవసరమే. కానీ అభివృద్ధి పేరుతో ఇప్పటికే నివాసం ఉంటున్న కుటుంబాల్లో అభద్రతాభావం ఏర్పడకూడదన్నది స్థానికుల అభిప్రాయం.

100 ఫీట్ల రోడ్డు అలైన్‌మెంట్‌పై హెచ్‌ఎండీఏ అధికారులు స్పష్టత ఇవ్వాలని, ప్రత్యామ్నాయ మార్గాల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని నివాసితులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: నీటి వాడ‌కంలో 20 శాతం కోత పెడితే  100 ఎంజీడీల నీరు ఆదా