General

కోకాపేటలో కొత్త‌గా..  గ్రీన్‌ వాటర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌

కోకాపేటలో కొత్త‌గా..  గ్రీన్‌ వాటర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌

హైదరాబాద్‌ నగరంలో తాగునీటి వినియోగాన్ని తగ్గించి, శుద్ధి చేసిన మురుగునీటిని ఇతర అవసరాలకు మళ్లించేందుకు జలమండలి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కోకాపేటలో ప్రత్యేక గ్రీన్‌ వాటర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసే అవకాశాల్ని  పరిశీలిస్తోంది.

నిర్మాణాల, పరిశ్రమలు, రోడ్ల శుభ్రత, దుమ్ము నియంత్రణ, పార్కుల నిర్వహణ వంటి పనులకు ఈ నీటిని వినియోగించేలా వ్యవస్థను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. గ్రీన్‌ వాటర్‌ సరఫరాకు ముందు శుద్ధి చేసిన నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించనున్నారు.

ఇందుకోసం కోకాపేటలోని నీటి నాణ్యత పరీక్షల ప్రయోగశాలను పరిశీలించి, పరీక్షల విధానం, ప్రమాణాలు, ఫలితాల నమోదు ప్రక్రియపై అధికారులు సమీక్షించారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని, జలమండలి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

పరీక్షల వివరాలు ఆన్‌లైన్‌లో

నీటి నాణ్యత పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. జలమండలి ప్రధాన కార్యాలయం నుంచే ఈ వివరాలను పర్యవేక్షించేలా సాంకేతిక వ్యవస్థను రూపొందించనున్నారు. ఇందుకోసం ఐటీ విభాగం సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. పరీక్షల ఫలితాలు పారదర్శకంగా అందుబాటులో ఉండటంతో నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: మెట్రో ఫేజ్‌-2కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌?

ట్యాంకర్లకు సామర్థ్యం మేరకు నీరు

ప్రతిపాదిత ఫిల్లింగ్‌ స్టేషన్‌లో ట్యాంకర్ల సామర్థ్యానికి అనుగుణంగా నీటిని నింపేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రతి ట్యాంకర్‌కు సరఫరా చేసిన నీటి పరిమాణాన్ని నమోదు చేయడంతో పాటు, నిర్ణీత పరిమితికి మించి నీరు నింపకుండా నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అదనంగా మిగిలే నీటిని వృథా చేయకుండా సంబంధిత చెరువులకు మళ్లించే ఏర్పాట్లపైనా దృష్టి సారిస్తున్నారు.

నిర్మాణ రంగం, పరిశ్రమలు, రోడ్ల శుభ్రత, దుమ్ము నియంత్రణ, పార్కులు, తోటల నిర్వహణకు శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా ప్రోత్సహించనున్నారు. ప్రస్తుతం ఈ అవసరాల్లో తాగునీటిని ఉపయోగించే సందర్భాలను తగ్గించగలిగితే నగరంలోని తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుంది.

ముఖ్యంగా నీటి అవసరాలు పెరుగుతున్న హైదరాబాద్‌లో శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగం కీలకంగా మారనుంది.

కోకాపేటలో గ్రీన్‌ వాటర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుపై ప్రస్తుతం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే తాగునీటిని అవసరమైన పనులకు కేటాయించడంతో పాటు, ఇతర అవసరాలకు ప్రత్యామ్నాయ నీటి వనరును అందుబాటులోకి తీసుకురావచ్చు.

ఇదీ చదవండి: ఐటీ, రెసిడెన్షియ‌ల్..  గ్రోత్ ఇంజిన్‌.. గోప‌న‌ప‌ల్లి