మీరు మీ ఇంటి ముందున్న ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి.. మీరు వాడుతున్నది తాగునీరు అయితే జలమండలి నుంచి జరిమానా తప్పకపోవచ్చు! జూబ్లీహిల్స్‌లో ఇంటి ప్రాంగణాన్ని తాగునీటితో శుభ్రం చేసినందుకు ఓ ఇంటి యజమానికి ఏకంగా రూ.5,000 ఫైన్ పడింది.
స్థానికులు వాట్సాప్‌లో ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన అధికారులు తనిఖీలు చేసి జరిమానా విధించారు. మరి మీ ఇంటి దగ్గర కూడా ఇలాంటి నీటి వృథా జరుగుతోందా? జలమండలి ఏం చెబుతోంది?
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 57లో, ప్లాట్ నంబర్ 1152 వద్ద ఓ ఇంటి ప్రాంగణాన్ని తాగునీటితో శుభ్రం చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని హైదరాబాద్ వాటర్ బోర్డు వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన జలమండలి అధికారులు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు.
తాగునీటిని ఇంటి పరిసరాల శుభ్రత కోసం ఉపయోగిస్తున్నట్లు నిర్ధారించుకున్న అనంతరం రూ.5,000 జరిమానా విధించారు.
ఇక్కడ వినియోగదారులు ఏం గుర్తుంచుకోవాలంటే.. ఇంటిని శుభ్రం చేసుకోవడం, రోడ్లను కడగడం వంటి పనులకు శుద్ధి చేసిన తాగునీటిని వృథా చేయవద్దని వాటర్ బోర్డు హెచ్చరిస్తోంది. అవసరమైన చోట ప్రత్యామ్నాయ నీటి వనరులను ఉపయోగించడం ద్వారా తాగునీటిని ఆదా చేయవచ్చని సూచిస్తోంది.
ఇదీ చదవండి: ఎల్‌నినో ఎఫెక్ట్.. నీటి కష్టాలను ఎలా ఎదుర్కోవాలంటే..?
జలమండలి నంబర్లు
ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వ్యక్తిగత ఇళ్లలో నివసించే వారు నీటి వినియోగంపై అప్రమత్తంగా ఉండాలి. నీటిని అనవసరంగా వృథా చేస్తే నిబంధనల ప్రకారం జరిమానాలు విధించే అవకాశం ఉంది. మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా నీటిని వృథా చేస్తున్నట్లయితే మీరు వెంటనే ఈ కింది నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు.
వాట్సాప్ హెల్ప్‌లైన్: 99499 30003; కస్టమర్ కేర్ నంబర్: 155313
ఫిర్యాదు చేసేటప్పుడు నీటి వృథాకు సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలు, సంబంధిత వ్యక్తి లేదా సంస్థ వివరాలు, పూర్తి చిరునామా అందించాలని జలమండలి సూచించింది. అందిన ఫిర్యాదులను పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తామని, ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని కూడా హామీ ఇచ్చింది.
చివరిగా.. హైదరాబాద్‌లో నీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వినియోగించడం మనందరి బాధ్యత. తాగడానికి ఉపయోగించే నీటిని అనవసర పనులకు వృథా చేయకుండా, అవసరమైనంత మాత్రమే వినియోగిద్దాం.
మీ కాలనీలోనూ నీటి వృథా జరుగుతోందా? సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వండి. నీటిని ఆదా చేయడం ఒక్కరి బాధ్యత కాదు.. మనందరి బాధ్యత!
ఇదీ చదవండి: మైవాన్ టెక్నాలజీ.. నివసించడానికి ఎంత కంఫర్ట్?
