General

హైదరాబాద్ నగరాన్ని పోలిన 3డీ డిజిటల్ ట్విన్ సిటీ..

హైదరాబాద్ నగరాన్ని పోలిన 3డీ డిజిటల్ ట్విన్ సిటీ..

హైదరాబాద్‌ మహానగరాన్ని పోలిన మరో 3డీ డిజిటల్‌ ట్విన్‌ నగరానికి రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. దీంతో భారతీయ రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగంలో డిజిటల్ ట్విన్ సాంకేతికత ఒక ట్రెండ్ సెట్టర్ గా మారబోతుంది. ఇది కేవలం భవన నిర్మాణానికే పరిమితం కాకుండా, భవనాల నిర్వహణను కూడా పూర్తిగా మార్చివేస్తోందని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక భవనాన్ని పోలి ఉండే కృత్రిమ ప్రతిరూపాన్ని డిజిటల్ పద్ధతిలో సృష్టించడమే డిజిటల్ ట్విన్ టెక్నాలజీ. భవనంలోని లిఫ్టులు, ఏసీ సిస్టమ్స్, విద్యుత్ లైన్లు, నీటి సరఫరా పైపులకు అమర్చిన ఐఓటీ సెన్సార్ల ద్వారా రియల్ టైమ్ డేటాను ఈ డిజిటల్ మోడల్‌ కు అనుసంధానం చేస్తారు. దీనివల్ల భవనం ప్రస్తుత పరిస్థితిని కంప్యూటర్ లేదా మొబైల్ తెరపై లైవ్‌ లో చూడవచ్చు.

సాధారణంగా ఏదైనా యంత్రం పాడైపోయిన తర్వాతే మనం రిపేర్ చేస్తాం. కానీ డిజిటల్ ట్విన్ సాంకేతికతతో ఏదైనా పరికరం పాడైపోవడానికి ముందే దాన్ని గుర్తించే ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక లిఫ్ట్ మోటార్‌లో అసాధారణమైన కంపనం మొదలైతే, సెన్సార్లు ఆ సమాచారాన్ని వెంటనే డిజిటల్ ట్విన్‌ కు అందిస్తాయి. దీనివల్ల సమస్య పెద్దది కాకముందే అందుకు సంబంధించిన నిపుణులు దీనిని సరిచేయవచ్చు. తద్వారా భారీ మరమ్మతు ఖర్చులు తప్పడంతో పాటు ప్రమాదాలను నివారించవచ్చు. ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, వరదలు వచ్చే సమయంలో వేగంగా స్పందిస్తూ వాటిని నియంత్రించవచ్చు.

డిజిటల్ ట్విన్ సాంకేతికత వల్ల భవనాల నిర్వహణ ఖర్చు సుమారు 25 నుంచి 30 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. భవనంలో ఎక్కడ విద్యుత్ వృధా అవుతోంది, ఎక్కడ నీరు లీక్ అవుతోంది వంటి అంశాలను ఇది ఖచ్చితమైన లెక్కలతో సహా తెలియజేస్తుంది. ఫలితంగా కార్బన్ ఫుట్‌ ప్రింట్ తగ్గి, ఎతో ఫ్రెండ్లీ మెయింటెనెన్స్ సులభమవుతుంది. మరీ ముఖ్యంగా మల్టీ స్టోరీ అపార్ట్‌ మెంట్‌లు, ఐటీ పార్కులు, విమానాశ్రయాల వంటి భారీ నిర్మాణాలకు డిజిటల్ ట్విన్ సాంకేతికత ఒక వరంగా మార‌నున్న‌ది.

3డీ డిజిటల్‌ ట్విన్‌ టెక్నాలజీకి సంబంధించి సంస్థను ఎంపిక చేసేందుకు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్ కు హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధి వరకు మొత్తం 2053 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఈ 3డీ డిజిటల్‌ ట్విన్‌ను తయారు చేసేందుకు హెచ్‌ఎండీఏ ఇప్పటికే ప్రణాళికలు రెడీ చేసింది. ముందుగా అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు 3డీ స్కానర్‌ లు, డ్రోన్‌ ల ద్వారా మొత్తం షూట్‌ చేస్తారు. రెవెన్యూ, జలమండలి, విద్యుత్ తదితర శాఖల వివరాలన్నీ నమోదు చేస్తారు. అత్యాధునిక సాంకేతికతతో వీటిన్నింటిని క్రోడీకరించి ఒక డైరెక్ట్ షాంపుల్ సిటీని తయారుచేస్తారు. ట్రాఫిక్‌ జామ్‌ నుంచి వరద ముప్పు దాకా ఏ సమస్య వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ప్రత్యామ్నాయ మార్గాలేమిటి? వంటి ఊహత్మక వీడియోగా ఈ డిజిటల్‌ నగరంలో రూపొందిస్తారు.

కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రణాళికలో డిజిటల్ ట్విన్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. భారత్ లోని కోహిమా, కాన్పుర్, ముంబయి, కొచ్చి నగరాలు ఇప్పటికే వీటిని తయారుచేసే అవసరమైనప్పుడు వాడుకుంటున్నాయి. అదే జాబితాలోకి ఇప్పుడు హైదరాబాద్‌ మహానగరం చేరనుంది. 2026 నాటికి భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ లో సుమారు 20 శాతం ప్రధాన ప్రాజెక్టులు ఈ టెక్నాలజీని స్వీకరిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం స్మార్ట్ బిల్డింగ్స్ కోసమే కాకుండా, స్మార్ట్ సిటీల నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషిస్తోందని చెబుతున్నారు.