General

కోకాపేట్‌ భూములపై హెచ్‌ఎండీఏ మరో బిగ్‌ ప్లాన్‌..

కోకాపేట్‌ భూములపై హెచ్‌ఎండీఏ మరో బిగ్‌ ప్లాన్‌..
  • ఎకరా కనీస ధర రూ.120 కోట్లు
  • మూసాపేటలో రూ.99 కోట్లు

మూడేళ్ల నుంచి వెస్ట్ హైద‌రాబాద్ అభివృద్ధి ప‌ట్ల పెద్ద దృష్టి సారించని రాష్ట్ర ప్ర‌భుత్వం.. కేవ‌లం ఇక్క‌డి భూముల వేలం మీదే అధిక దృష్టి సారించింద‌ని చెప్పొచ్చు. ఈ రంగాన్ని ప్రోత్స‌హించేందుకు ఎలాంటి ప్ర‌త్య‌క్ష ప్ర‌క‌ట‌న‌ల్ని చేయ‌ని రేవంత్ స‌ర్కార్‌.. మ‌రోసారి కోకాపేట్ భూముల్ని వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది.

నెలక్రితం వేసిన కోకాపేట్‌లో ప్లాటు వేలానికి కేవ‌లం ఒక్క‌టంటే ఒక్క‌టే సంస్థ బిడ్ వేయ‌డంతో.. ఆ వేలాన్ని హెచ్ఎండీఏ ర‌ద్దు చేసింది. 

త‌ర్వాత, అదే ప్లాటుకు మళ్లీ వేలం వేసేందుకు ప్ర‌ణాళికల్ని ర‌చిస్తోంది. ఇప్ప‌టికే మార్కెట్ లేక అమ్మ‌కాలు కుదేల‌వుతున్న ప‌రిస్థితిలో.. కోకాపేట్‌లో భూమిని కొన‌డానికి ఎవ‌రూ ముందుకొస్తారో తెలియ‌ని ప‌రిస్థితి.

హైద‌రాబాద్ రియ‌ల్ రంగాన్ని ప్రోత్స‌హించ‌నంత వ‌ర‌కూ ఇక నుంచి భూముల్ని కొనేందుకు డెవ‌ల‌ప‌ర్లు పెద్ద‌గా ముందుకు రాక‌పోవ‌చ్చ‌నేది మార్కెట్ నిపుణుల అభిప్రాయం. మ‌రి, త్వ‌ర‌లో జ‌రిగే వేలం పాట‌ల్లో ఏయే సంస్థ‌లు పాల్గొంటాయో.. ఎంత ధ‌ర‌కు కొంటాయో తెలియాలంటే.. కొంత‌కాలం వేచి చూడాల్సిందే. 

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో మరోసారి భూముల వేలం సందడి మొదలు కానుంది. కోకాపేట నియోపొలిస్‌లో ఎకరా కనీస ధరను రూ.120 కోట్లుగా నిర్ణయించిన హెచ్‌ఎండీఏ.. మూసాపేటలో ఎకరాకు రూ.99 కోట్ల ధరను ఖరారు చేసింది.

గతంలో సింగిల్‌ బిడ్‌ రావడంతో విక్రయాన్ని నిలిపివేసిన కోకాపేట భూములను మరోసారి వేలానికి తీసుకొస్తోంది. నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో భూములు, ప్లాట్ల విక్రయానికి శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఇదీ చదవండి: కోకాపేటలో కొత్త‌గా..  గ్రీన్‌ వాటర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌

కోకాపేటలో మళ్లీ వేలం..

కోకాపేట నియోపొలిస్‌ లేఅవుట్‌లోని సర్వే నంబర్లు 239, 240లో ఉన్న 4.59 ఎకరాల భూమిని హెచ్‌ఎండీఏ విక్రయించనుంది. ఈ భూమికి ఎకరా కనీస ధర రూ.120 కోట్లుగా నిర్ణయించింది. గతంలో ఈ భూమిని వేలానికి పెట్టినప్పటికీ.. ఒకే బిడ్‌ రావడంతో విక్రయ ప్రక్రియను నిలిపివేసింది. ఇప్పుడు మరోసారి వేలానికి సిద్ధమైంది.

మూసాపేటలో 3.15 ఎకరాల భూమిని విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ ముందుకొచ్చింది. ఇక్కడ ఎకరా కనీస ధర రూ.99 కోట్లుగా నిర్ణయించింది. కోకాపేట, రాయదుర్గం నౌఖల్సా, కాప్రా, బాచుపల్లి, అమీన్‌పూర్‌ సహా తొమ్మిది ప్రాంతాల్లో భూములు, ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించనుంది.

ప్లాట్ల ధరలు ఇలా..

వివిధ ప్రాంతాల్లో 302 చదరపు గజాల నుంచి 8,591 చదరపు గజాల వరకు భూములు, ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి చదరపు గజానికి కనీస ధర రూ.30 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు నిర్ణయించారు.రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం ఇన్ముల్‌నర్వ హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో 45 ప్లాట్లను వేలానికి పెట్టింది. 185 నుంచి 300 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్లకు చదరపు గజానికి కనీస ధర రూ.15 వేలుగా నిర్ణయించింది. 

గతంలో నిర్వహించిన వేలంలో ఇక్కడ గరిష్ఠంగా చదరపు గజానికి రూ.20 వేల ధర పలికింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో 50 ప్లాట్లను విక్రయించనుంది. 266 నుంచి 499 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్లకు చదరపు గజానికి రూ.45 వేల కనీస ధర నిర్ణయించింది.

షేక్‌పేట మండలం హకీంపేటలో 8 ప్లాట్లను వేలానికి పెట్టింది. 1,084 నుంచి 1,437 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్లకు చదరపు గజానికి రూ.2 లక్షల కనీస ధరను ఖరారు చేసింది.

నవంబర్‌ 12 నుంచి

హెచ్‌ఎండీఏ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. నవంబర్‌ 12 నుంచి 27 వరకు భూములు, ప్లాట్ల ఈ-వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో రూ.1,180 రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

ప్రతి ప్లాటుకు నిర్ణయించిన ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ (ఈఎండీ) చెల్లించిన తర్వాతే వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. వేలంలో విజేతగా నిలిచిన వారు అమ్మకపు విలువలో 25 శాతం మొత్తాన్ని.. ఈఎండీ మినహాయించి.. ఏడు రోజుల్లో చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని ఈఎండీతో కలిపి 60 రోజుల్లో చెల్లించి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలి.

ఇదీ చదవండి: గచ్చిబౌలిలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌