General

అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం

అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న అదనపు అంతస్తులపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు వీటి విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1538 అక్రమ నిర్మాణాలను గుర్తించిన జీహెచ్ఎంసీ.. 1517 షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 204 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతోపాటు 93 భవనాలను సీల్ చేసింది. అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మించడం, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం, ఆక్రమణలు, సెట్ బ్యాక్స్ వదలకపోవడం వంటివే ఉల్లంఘనల్లో ఎక్కువగా ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. చాలా ప్రాంతాల్లో యజమానులు రెండు లేదా మూడు అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు తెచ్చుకుని, ఏడు లేదా ఎనిమిది అంతస్తులు నిర్మిస్తున్నారని వివరించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, షేక్ పేట, కేపీహెచ్ బీ, మూసాపేట, మలక్ పేట వంటి ప్రాంతాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనల విషయంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినా జీహెచ్ఎంసీ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందంటూ ఈ ఏడాది ఏప్రిల్ 29న హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో అధికార యంత్రాంగం ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుని నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిన భవనాలను సీల్ చేస్తున్నారు. ప్లాన్ డీవియేషన్ వ్యవహారాల్లో జీహెచ్ఎంసీ, టీజీ బీపాస్ నిబంధనల మేరకు వ్యవహరిస్తున్నారు. చిన్న చిన్న ఉల్లంఘనలను నిర్దేశిత ఫీజు ద్వారా క్రమబద్దీకరిస్తున్నారు.