General

సిమెంట్, స్టీల్ ధరల సెగ..  నిర్మాణ రంగానికి కొత్త సవాల్

సిమెంట్, స్టీల్ ధరల సెగ..  నిర్మాణ రంగానికి కొత్త సవాల్

హైదరాబాద్ మహా నగర నిర్మాణరంగంపై ముడి సరుకుల ధరల పెరుగుదల ఒత్తిడి పెంచుతోంది. సిమెంట్, స్టీల్‌తో పాటు ఇసుక, బిటుమెన్‌, టైల్స్‌, శానిటరీ వస్తువుల ధరలు పెరగడం నిర్మాణ వ్యయాలను భారంగా మారుస్తోంది.

ఇప్పటికే ఇళ్ల అమ్మకాలు మందగించడం, కొనుగోలుదారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుండటంతో బిల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు నిర్మాణ ఖర్చులను నియంత్రించుకోవడం, మరోవైపు కొనుగోలుదారులను ఆకర్షించడం డెవలపర్లకు సవాలుగా మారింది.

చదరపు అడుగుకు రూ.150-300 అదనపు భారం

హైదరాబాద్‌ నిర్మాణరంగంపై సిమెంట్‌, స్టీల్‌, ఇతర నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలతో ప్రత్యక్ష నిర్మాణ వ్యయాలు సుమారు 8-10 శాతం పెరిగాయి. ప్రాజెక్టు పరిమాణం, భవనం ఎత్తు, డిజైన్‌, నిర్మాణ విధానాన్ని బట్టి చదరపు అడుగుకు రూ.150 నుంచి రూ.300 వరకు అదనపు వ్యయం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భారీ అపార్ట్‌మెంట్‌ సముదాయాలు, హైరైజ్‌ భవనాల నిర్మాణంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

నిర్మాణ వ్యయంలో కీలకమైన స్టీల్‌ ధరలు 10-15 శాతం పెరగడం ప్రాజెక్టుల బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. నిర్మాణానికి అవసరమయ్యే స్టీల్‌ పరిమాణం ఎక్కువగా ఉండటంతో ధరల్లో స్వల్ప మార్పు వచ్చినా మొత్తం వ్యయం గణనీయంగా పెరుగుతుంది. సిమెంట్‌ ధరల పెరుగుదల కూడా నిర్మాణదారులకు అదనపు భారంగా మారుతోంది.

ఇదీ చదవండి: రియల్‌ ఎస్టేట్‌ చట్టంలో సమూల మార్పులు చేయాలి

చిన్న బిల్డర్లకు తప్పని తిప్పలు

పెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు భారీ మొత్తంలో నిర్మాణ సామగ్రిని కొనుగోలు చేయడం ద్వారా ధరల విషయంలో కొంత వెసులుబాటు పొందగలుగుతున్నాయి. కానీ చిన్న బిల్డర్లు, వ్యక్తిగత కాంట్రాక్టర్లు స్థానిక డీలర్ల నుంచి అప్పటికప్పుడు సామగ్రి కొనుగోలు చేయాల్సి రావడంతో ధరల మార్పుల ప్రభావాన్ని నేరుగా ఎదుర్కొంటున్నారు.

ప్రాజెక్టు ప్రారంభించే సమయంలో వేసుకున్న అంచనా బడ్జెట్‌ కంటే ఖర్చులు పెరిగితే లాభాల మార్జిన్‌ తగ్గిపోతుంది. నిర్మాణ పనులు ఆలస్యమైతే కూలీల ఖర్చులు, రవాణా, ఇతర నిర్వహణ వ్యయాలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. దీంతో ప్రాజెక్టుల ఆర్థిక ప్రణాళికను ఎప్పటికప్పుడు సవరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ధరలు పెంచితే అమ్మకాలు తగ్గే భయం

నిర్మాణ ఖర్చులు పెరిగినంత మాత్రాన బిల్డర్లు వెంటనే ఫ్లాట్ల ధరలను పెంచలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఒప్పందాలు పూర్తయిన ఫ్లాట్లకు అంగీకరించిన ధరలను మార్చకుండా అదనపు వ్యయాన్ని భరించే సందర్భాలున్నాయి. అలా చేస్తే బిల్డర్ల లాభాలు తగ్గుతాయి.

మరోవైపు కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టుల్లో ధరలు పెంచితే కొనుగోలుదారులు వెనుకడుగు వేసే అవకాశం ఉంది. హైదరాబాద్‌ నివాస మార్కెట్‌లో ఈ పరిస్థితి మరింత కీలకంగా మారుతోంది. 2026 తొలి ఆరు నెలల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 26,068 ఇళ్లు అమ్ముడయ్యాయి.

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 13 శాతం తగ్గాయి. ఇదే సమయంలో కొత్తగా ప్రారంభించిన ఇళ్ల సంఖ్య 49,656కు చేరింది. అంటే కొత్త సరఫరా, అమ్మకాల మధ్య అంతరం పెరిగింది.

ఇదీ చదవండి: అక్రమ నిర్మాణాలపై అలహాబాద్‌ హైకోర్టు కొరడా

సామాన్యుడి సొంతింటి కలపై ప్రభావం

నిర్మాణ వ్యయాల పెరుగుదల ప్రభావం కేవలం బిల్డర్లకే పరిమితం కాదు. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ కూడా పెరిగే అవకాశం ఉంది. నిర్మాణం మధ్యలో సిమెంట్‌, స్టీల్‌, ఇతర సామగ్రి ధరలు మారితే అదనపు నిధులు సమకూర్చుకోవాల్సి వస్తుంది.

ఇప్పటికే గృహ రుణాలు, స్థలం ధరలు, రిజిస్ట్రేషన్‌ ఖర్చులతో సతమతమవుతున్న కుటుంబాలకు ఇది మరో సవాల్‌గా మారుతుంది.

నిర్మాణ సామగ్రి ధరలు – పెరుగుదల లెక్కలు

హైదరాబాద్‌లో 2025 తొలి అర్ధభాగంతో పోలిస్తే 2026 అక్టోబర్ నాటికి అందుబాటులో ఉన్న ధరల సుమారుగా..

సామగ్రి                                       గత ధర                           ప్రస్తుత ధర                            పెరుగుదల
సిమెంట్ (50 కేజీ బ్యాగ్)            రూ.290–420              రూ.320–470                           సుమారు రూ.30–50
స్టీల్ (టన్ను)                            రూ.52,000–63,000       రూ.60,000–72,000            రూ.8,000–9,000
నది ఇసుక (క్యూబిక్ ఫీట్)        రూ.50–88                    రూ.55–95                                 రూ.5–7

    • బిటుమెన్ (టన్ను) పాత ధరతో పోలిస్తే — 12–18% పెరుగుదల
    • టైల్స్‌, శానిటరీ వస్తువులు పాత ధరతో పోలిస్తే — 10–20% పెరుగుదల

    ఇదీ చదవండి: రియల్ పెట్టుబడులకు కొత్త దిశ