- క్యూ3లో బెంగళూరులో 14.5 శాతం వృద్ధి.. హైదరాబాద్‌లో 5.6 శాతమే
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు పెరుగుతున్నా.. ఆ వృద్ధి వేగంలో గణనీయమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. 2026 మూడో త్రైమాసికం (జులై–సెప్టెంబర్)లో బెంగళూరు గృహ ధరల పెరుగుదలలో అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అక్కడ ఇళ్ల ధరలు 14.5 శాతం పెరిగాయి.
మరోవైపు హైదరాబాద్‌లో ఈ వృద్ధి కేవలం 5.6 శాతానికే పరిమితమైంది. పుణెలోనూ ధరల పెరుగుదల 7.7 శాతంగా నమోదైంది. ఈ మేరకు నోబ్రోకర్ డాట్ కామ్ ఓ నివేదిక విడుదల చేసింది. ఇక ఢిల్లీలో ధరల పెరుగుదల 10.6 శాతం ఉండగా.. చెన్నైలో 10.2 శాతం, ముంబైలో 8.9 శాతం నమోదయ్యాయి. బెంగళూరులో వరుసగా మూడో త్రైమాసికంలోనూ దేశంలోని ప్రధాన నగరాలన్నింటికంటే అధిక ధరల వృద్ధి నమోదైంది.
2026 తొలి త్రైమాసికంలో 14.5 శాతంగా ఉన్న పెరుగుదల, రెండో త్రైమాసికంలో 16 శాతానికి చేరింది. మూడో త్రైమాసికంలో మళ్లీ 14.5 శాతంగా నమోదైంది. అక్కడ చదరపు అడుగు సగటు నివాస ధర రూ.9,863 నుంచి రూ.11,293కు పెరిగింది.
ఇదీ చదవండి: 2030 నాటికి భారత్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్
బెంగళూరులో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
బెంగళూరులో ఇళ్లకు డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 14 శాతం పెరిగింది. అదే సమయంలో కొత్త గృహ ప్రాజెక్టుల ప్రారంభాలు 12 శాతం తగ్గి 15,180 యూనిట్లకు చేరాయి. అంటే కొనుగోలుదారుల ఆసక్తి పెరిగినప్పటికీ, కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న ఇళ్ల సంఖ్య తగ్గింది.
ఈ పరిస్థితి ధరల పెరుగుదలకు దోహదపడిందని నోబ్రోకర్ నివేదిక విశ్లేషించింది. ఐటీ రంగం, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లలో ఉద్యోగావకాశాలు కూడా నగర గృహ మార్కెట్‌కు మద్దతునిస్తున్నాయి.
హైదరాబాద్‌లో ధరల పెరుగుదల నెమ్మదిగా..
హైదరాబాద్‌లో చదరపు అడుగు సగటు నివాస ధర రూ.8,732గా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ధరలు 5.6 శాతం పెరిగాయి. రెండో త్రైమాసికంలో నమోదైన 9 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తగ్గుదల.
అంతకుముందు తొలి త్రైమాసికంలో ధరల పెరుగుదల 5.1 శాతంగా ఉంది. నగరంలో పెద్ద గృహ ప్రాజెక్టుల నిర్మాణాలు, వాటి నుంచి రానున్న సరఫరా, డిమాండ్‌లో మితమైన వృద్ధి కారణంగా ధరల పెరుగుదల పరిమితంగా ఉందని నివేదిక పేర్కొంది.
ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న భారీ ప్రాజెక్టులను పూర్తి చేయడం, వాటిలోని ఇళ్లను విక్రయించడంపై డెవలపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభాల విషయంలోనూ వారు ఆచితూచి వ్యవహరించవచ్చని అంచనా.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ 50% వృద్ధి
కొనుగోలుదారులకు ఏం సూచిస్తోంది?
ఈ గణాంకాలు గమనిస్తే, ఇళ్ల ధరల పెరుగుదల అన్ని నగరాల్లో ఒకేలా లేదని స్పష్టమవుతోంది. బెంగళూరులో డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సరఫరా తగ్గడం ధరల పెరుగుదలకు దోహదపడగా, హైదరాబాద్, పుణెల్లో కొత్త ఇళ్ల లభ్యత, డిమాండ్ మధ్య సమతుల్యత ధరల వృద్ధిని నియంత్రిస్తున్నాయి.
అయితే హైదరాబాద్‌లో ధరల పెరుగుదల తక్కువగా ఉందని అన్ని ప్రాంతాల్లో ఇళ్లు చౌకగా ఉన్నాయని భావించకూడదు. నగరంలోని ప్రాంతం, ప్రాజెక్టు నాణ్యత, కనెక్టివిటీ, నిర్మాణ దశ, కొనుగోలుదారుల డిమాండ్‌ను బట్టి ధరలు మారుతాయి.
ఇల్లు కొనాలనుకునేవారు ప్రకటించిన ధరతో పాటు మొత్తం కొనుగోలు వ్యయం, రుణ వడ్డీ, తమ ఆదాయానికి సరిపోయే ఈఎంఐని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తంగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు పెరుగుతున్నప్పటికీ, బెంగళూరు వేగంగా దూసుకెళ్తుండగా హైదరాబాద్‌లో వృద్ధి నెమ్మదించింది.
రాబోయే త్రైమాసికాల్లో కొత్త ఇళ్ల సరఫరా, కొనుగోలుదారుల సామర్థ్యం, ఉద్యోగావకాశాలే ఈ మార్కెట్ల తదుపరి దిశను నిర్ణయించనున్నాయి.
ఇదీ చదవండి: ద్వితీయ శ్రేణి నగరాలే తదుపరి రియల్ ఎస్టేట్ కేంద్రాలు
