జీసీసీలు, ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌లతో పెరిగిన డిమాండ్
ఆర్ఈజీ న్యూస్ | హైదరాబాద్
దేశవ్యాప్తంగా కార్యాలయ స్థలాల లీజింగ్ స్థిరంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో మాత్రం భారీ వృద్ధి నమోదైంది. 2026 జనవరి–సెప్టెంబర్ మధ్య నగరంలో 1.31 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది సుమారు 50 శాతం అధికం. దీంతో బెంగళూరు తర్వాత దేశంలో రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది.
నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్‌లో 56 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం లీజుకు వెళ్లింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 92 శాతం వృద్ధి. దేశవ్యాప్తంగా ఈ త్రైమాసికంలో జరిగిన మొత్తం లీజింగ్‌లో నగరం వాటా సుమారు 30 శాతంగా ఉంది.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీలు) విస్తరణ ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. తొలి తొమ్మిది నెలల్లో హైదరాబాద్‌లో జీసీసీలకు సంబంధించిన లీజింగ్ 62 లక్షల చదరపు అడుగులకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 70 శాతం పెరిగింది. ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ సంస్థలు కూడా 35 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. ఇదే సమయంలో నగరంలో 97 లక్షల చదరపు అడుగుల కొత్త కార్యాలయ స్థలం అందుబాటులోకి వచ్చింది. పెరుగుతున్న డిమాండ్ హైదరాబాద్ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఊతమిస్తున్నప్పటికీ, కొత్త సరఫరా, ఖాళీగా ఉన్న కార్యాలయ స్థలాల స్థాయిని కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
