- 9 నెలల్లో 2.58 లక్షల ఇళ్ల విక్రయాలు
- ముంబై టాప్.. ఢిల్లీలో 11% క్షీణత
దేశంలోని ప్రధాన నగరాల రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2026లో స్థిరమైన డిమాండ్‌ను కొనసాగిస్తోంది. జనవరి–సెప్టెంబర్ మధ్య దేశంలోని ఎనిమిది కీలక మార్కెట్లలో 2,58,238 ఇళ్లు విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మొత్తం అమ్మకాల్లో పెద్దగా మార్పు లేకపోయినా.. నగరాలు, ధరల విభాగాల వారీగా మార్కెట్ పరిస్థితుల్లో గణనీయమైన తేడాలు కనిపించాయి.
ఈ వివరాలను నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. జనవరి–సెప్టెంబర్ 2026లో 72,804 ఇళ్ల విక్రయాలతో ముంబై దేశంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ మార్కెట్‌గా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఇక్కడ అమ్మకాలు 1 శాతం పెరిగాయి. ఆ తర్వాత బెంగళూరు 43,140 ఇళ్లతో 5 శాతం వృద్ధిని నమోదు చేసింది.
పుణె 36,402 ఇళ్ల విక్రయాలతో దాదాపు స్థిరంగా ఉంది. హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా మార్కెట్లలోనూ ఇళ్ల విక్రయాలు 2–4 శాతం మేర పెరిగాయి. అంటే దేశంలోని ఎనిమిది ప్రధాన మార్కెట్లలో ఏడింటిలో డిమాండ్ కొనసాగుతుండగా.. ఢిల్లీ మాత్రం భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక్కడ 35,574 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11 శాతం తక్కువ. ముఖ్యంగా గురుగ్రామ్‌లో మందగమనం ఎక్కువగా కనిపించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అమ్ముడుకాని ఇళ్ల నిల్వలో గురుగ్రామ్ వాటా సుమారు 57 శాతంగా ఉంది. ఎన్‌సీఆర్‌లో అధిక ధరల ఇళ్ల విభాగంలోనూ డిమాండ్ కొంత తగ్గింది.
కొత్త ఇళ్ల సరఫరా పెరిగింది
ఇదే సమయంలో డెవలపర్లు కొత్త ప్రాజెక్టులపై దృష్టి కొనసాగించారు. 2026 తొలి తొమ్మిది నెలల్లో ఎనిమిది ప్రధాన మార్కెట్లలో 2,79,899 ఇళ్లను కొత్తగా ప్రారంభించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 4 శాతం అధికం. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలోనే 92,549 ఇళ్లు కొత్తగా ప్రారంభమయ్యాయి. ఇదే కాలంలో 86,767 ఇళ్లు అమ్ముడయ్యాయి.
దీంతో కొత్త ఇళ్ల ప్రారంభాలు అమ్మకాల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఇలా కొత్త సరఫరా అమ్మకాల కంటే అధికంగా ఉండటం వరుసగా 16వ త్రైమాసికం కావడం గమనార్హం. మరోవైపు దేశీయ హౌసింగ్ మార్కెట్‌లో కనిపిస్తున్న మరో ముఖ్యమైన మార్పు ప్రీమియం, లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న ఆదరణ. రూ. కోటి కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా 2018లో మొత్తం అమ్మకాల్లో కేవలం 16 శాతం ఉండగా.. 2026 జనవరి–సెప్టెంబర్‌లో అది 56 శాతానికి పెరిగింది.
మొత్తం మార్కెట్‌లో అమ్మకాలు స్థిరంగా ఉన్నప్పటికీ.. కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు కొనసాగుతుండటంతో ఇన్వెంటరీ క్రమంగా పెరుగుతోంది. అయితే నగరాల వారీగా పరిస్థితి ఒకేలా లేదు. ముంబయి, బెంగళూరు వంటి మార్కెట్లలో డిమాండ్ బలంగా ఉండగా.. ఎన్‌సీఆర్‌లో ముఖ్యంగా గురుగ్రామ్ మార్కెట్‌లో అమ్మకాల మందగమనం కనిపిస్తోంది.
