- మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న గృహ డిమాండ్‌తో మారుతున్న మార్కెట్ ముఖచిత్రం
దేశంలోని ప్రధాన మెట్రో నగరాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ వృద్ధి ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తోంది. మెరుగవుతున్న రహదారులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు, మారుతున్న గృహ కొనుగోలుదారుల అభిరుచులు ఈ నగరాల్లో నివాస రియల్ ఎస్టేట్‌కు ఊతమిస్తున్నాయి.
క్రిసిల్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం, 2020–21 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాల మధ్య పది ప్రధాన ద్వితీయ శ్రేణి నగరాల్లో గృహ డిమాండ్ వార్షిక సగటు సమ్మిళిత వృద్ధి రేటు 14 శాతంగా నమోదైంది.
నాగ్‌పూర్, కోయంబత్తూరు, లక్నో నగరాల్లో ఈ వృద్ధి సుమారు 20 శాతానికి చేరింది. ఈ పరిణామం కేవలం ఇళ్ల విక్రయాల పెరుగుదలకే పరిమితం కావడం లేదు. డెవలపర్లు కొత్త ప్రాజెక్టుల కోసం ఈ నగరాల వైపు మొగ్గుచూపుతున్నారు.
పెద్ద స్థలాలు అందుబాటులో ఉండటం, మెట్రోలతో పోలిస్తే కొన్నిచోట్ల తక్కువ ప్రారంభ పెట్టుబడి అవసరం కావడం, ఆధునిక వసతులతో కూడిన గృహాలకు డిమాండ్ పెరుగుతుండటం ఇందుకు కారణాలుగా ఉన్నాయి.
మెట్రో నగరాల కంటే వేగంగా ధరల పెరుగుదల
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), నైట్ ఫ్రాంక్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన తాజా నివేదిక ప్రకారం, 11 అభివృద్ధి చెందుతున్న నగరాల్లో 2021–2026 మధ్య నివాస ఆస్తుల ధరలు 63 శాతం పెరిగాయి.
ఇదే సమయంలో దేశంలోని ఎనిమిది ప్రధాన మెట్రో మార్కెట్లలో ధరల పెరుగుదల 42 శాతంగా నమోదైంది. 2016–2026 మధ్య ఈ అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ధరల వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు 8 శాతంగా ఉండగా, ప్రధాన మెట్రో నగరాల్లో ఇది 4 శాతంగా ఉంది.
ఇదీ చదవండి: ఇళ్ల ధరల పెరుగుదలలో బెంగళూరు టాప్.. హైదరాబాద్ లాస్ట్
ఈ నివేదికలో గుర్తించిన 11 మార్కెట్లు:
- లక్నో
- జైపూర్
- ఇండోర్
- నాగ్‌పూర్
- కోయంబత్తూరు
- భువనేశ్వర్
- విశాఖపట్నం
- భోపాల్
- చండీగఢ్ ట్రైసిటీ
- గోవా
- కొచ్చి
ఈ నగరాల్లో గృహ నిర్మాణంతోపాటు వాణిజ్య స్థలాలు, రిటైల్ కేంద్రాలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ రంగాల్లోనూ వృద్ధికి అవకాశాలు కనిపిస్తున్నాయి.
మారుతున్న కొనుగోలుదారుల అభిరుచులు
గతంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో గృహ కొనుగోలుదారులు ప్రధానంగా అందుబాటు ధరలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం పెద్ద ఇళ్లు, మెరుగైన నిర్మాణ నాణ్యత, ఆధునిక సౌకర్యాలు, గేటెడ్ కమ్యూనిటీలు, పచ్చదనం, మెరుగైన రవాణా సదుపాయాలపై ఆసక్తి పెరుగుతోంది.
దీనికి అనుగుణంగా డెవలపర్లు కూడా తమ ప్రాజెక్టుల స్వరూపాన్ని మార్చుతున్నారు. కేవలం అపార్ట్‌మెంట్ల నిర్మాణానికే పరిమితం కాకుండా, పార్కులు, క్లబ్‌హౌస్‌లు, భద్రత, ఇతర సామాజిక వసతులతో కూడిన సమగ్ర నివాస సముదాయాలపై దృష్టి పెడుతున్నారు.
ఇదీ చదవండి: నియోపోలిస్ భూముల వేలంతో రూ.2,000 కోట్లపై హెచ్‌ఎండీఏ గురి
