General

హైదరాబాద్ తరువాత రియాల్టీకి బెస్ట్ డెస్టినేషన్ వరంగల్

హైదరాబాద్ తరువాత రియాల్టీకి బెస్ట్ డెస్టినేషన్ వరంగల్

తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తరువాత ద్వితీయ శ్రేణి నగరాల్లో నిర్మాణ రంగం క్రమంగా ఊపందుకుంటోంది. ఈ క్రమంలో వరంగల్ నగరంలోని కాజీపేట శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కాజీపేట సమీపంలోని ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ భవిష్యత్తులో మరో హైటెక్ సిటీ అయ్యే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వరంగల్ పట్టణానికి మామునూరు విమానాశ్రయానికి తెలంగాణ ప్రభుత్వం పూణుకోవడంతో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి వస్తాయని చెబుతున్నారు. ప్రధానంగా హనుమకొండ-హైదరాబాద్ రహదారి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే అభివృద్ధి చెందగా.. ముందు ముందు మరింత వేగం పుంజుకోనుందని అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు వరంగల్ పట్టణం తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఒకటిగా పేరు సంపాదించుకోవడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని అంచనా వేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహా నగరం తరువాత వరంగల్ నగరం అతి పెద్దదని చెప్పవచ్చు. వరంగల్ నగరం మొత్తం మూడు పట్టణాల కలయికగా ఉంటుంది. కాజీపేట, హనుమకొండ, వరంగల్ మూడింటిని కలిపితే వరంగల్ మహానగరం అవుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్నటువంటి వరంగల్ నగరం హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా తెలంగాణలో పేరు సంపాదించుకుంది. వరంగల్ భారత దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నటువంటి నగరాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ముఖ్యంగా వరంగల్ నగరం అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం నాలుగు వైపులా భూములు పుష్కలంగా ఉండటమే కారణమని చెప్పవచ్చు. వరంగల్ కు అద్భుతమైన కనెక్టివిటీ ఉంది. ఇప్పటికే రాష్టంలోని అన్ని ప్రాంతాలతో రోడ్, రైల్ కనెక్టివిటీ ఉండటంతో పాటు.. త్వరలోనే మామునూరు ప్రాంతంలో ఎయిర్ పోర్టు నిర్మాణం కూడా జరుగుతోంది.

ఇక వరంగల్ పరిశ్రమలకు పెట్టింది పేరు. ఇక్కడ చాలా రంగాల్లో పరిశ్రమలు ఉన్నాయి. ప్రధానంగా వరంగల్ నగరంలో టెక్స్ టైల్ రంగం బాగా అభివృద్ధి చెందింది. వరంగల్ పట్టణంలో అనేక విద్యా సంస్థలు కూడా కొలువై ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దేశంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది. అలాగే వరంగల్ పట్టణంలో కాకతీయ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ వంటివాటితో పాటు అనేక ప్రైవేటు రంగ విద్యా సంస్థలు ఉండటంతో ఎడ్యుకేషనల్ హబ్ గా చెప్పవచ్చు. ఇక వరంగల్ నగరంలో ఐటీరంగం కూడా క్రమంగా విస్తరిస్తోంది. వరంగల్ నగరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటి ఇంకుబేషన్ సెంటర్ ప్రారంభించింది. ఇందులో భాగంగా సైయంట్ ఐటీ కంపెనీ ఇప్పటికే వరంగల్ లో తమ కార్యాలయం కూడా ప్రారంభించింది. అలాగే క్వాడ్రంట్ టెక్నాలజీస్ కంపెనీ కూడా తమ సంస్థ కార్యకలాపాలు వరంగల్ నగరంలో ప్రారంభించారు.

వరంగల్ నగరంలో ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 18 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు ఇంటి స్థలాల ధరలున్నాయి. ఇక వరంగల్ నగరంలో అపార్ట్ మెంట్ నిర్మాణం క్రమంగా పుంజుకుంటోంది. ఇక్కడ అపార్ట్ మెంట్ లో ప్రాంతం, ప్రాజెక్టును బట్టి చదరపు అడుగు 2500 నుంచి 4000 రూపాయల వరకు ధరలున్నాయి. ఇప్పుడిప్పుడే ఇక్కడ విల్లాల నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఇక వరంగల్ సమీప ప్రాంతాల్లో ఎకరం 1.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు భూముల ధరలున్నాయి. రానున్న రోజుల్లో భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.