- తొలిసారి ఇల్లు కొనేవారిపై దృష్టి పెట్టాలి
- అందుబాటు ధరల గృహాల నిర్వచనంలో మార్పులు అవసరం: రియల్ ఎస్టేట్ నిపుణులు
దేశ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి కొనసాగాలంటే సంపన్నులు కొనుగోలు చేసే విలాసవంతమైన ఇళ్లపైనే దృష్టి పెట్టకుండా.. తొలిసారి సొంతింటిని కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని పరిశ్రమ నిపుణులు సూచించారు.
అందుబాటు ధరల గృహాల నిర్వచనాన్ని సవరించడం, గృహ రుణాలు సులభంగా లభించేలా చూడటం, నిలిచిపోయిన నిర్మాణ ప్రాజెక్టులకు ముందస్తుగా ఆర్థిక సహాయం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయడం అవసరమని అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 28న ఢిల్లీలో జరిగిన 22వ సీఐఐ రియల్టీ 2026 సదస్సులో ఈ అంశాలపై చర్చించారు.
సదస్సులో బీసీడీ గ్రూప్ వైస్ ఛైర్మన్, సీఈఓ అశ్విందర్ ఆర్. సింగ్ మాట్లాడుతూ.. పట్టణ జనాభా పెరుగుతున్నప్పటికీ, పరిశ్రమ పరిమిత సంఖ్యలోని సంపన్న కొనుగోలుదారులపైనే ఆధారపడుతోందని అన్నారు. ఒకే వర్గం కొనుగోలుదారులకు మరిన్ని ఇళ్లు విక్రయించడం ద్వారా మార్కెట్‌ను రెట్టింపు చేయలేమని వివరించారు.
విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో గృహ నిర్మాణ రంగంలో అసమతౌల్యం కనిపిస్తోందని తెలిపారు. దేశంలో గృహ విక్రయాల్లో దాదాపు మూడో వంతు విలాసవంతమైన ఇళ్లదే కాగా.. తక్కువ ధరల గృహాల విక్రయాలు తగ్గుతున్నాయని సదస్సులో ప్రస్తావించారు. సంపన్నులు రెండో, మూడో లేదా ఐదో ఇళ్లుగా కొనుగోలు చేసే ప్రీమియం ఆస్తుల కంటే.. నిజంగా సొంతింటి అవసరం ఉన్న కుటుంబాల కోసం నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: రియల్ పెట్టుబడులకు కొత్త దిశ
రూ.45 లక్షల పరిమితిపై పునరాలోచన
ప్రస్తుతం అందుబాటు ధరల గృహాలుగా పరిగణించేందుకు ఉన్న రూ.45 లక్షల పరిమితి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేదని రుస్తోమ్ జీ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బోమన్ రుస్తోమ్ ఇరానీ అభిప్రాయపడ్డారు. ఈ పరిమితిని 2017లో నిర్ణయించారని, అప్పటి నుంచి ద్రవ్యోల్బణం కారణంగా ధరలు గణనీయంగా పెరిగాయని చెప్పారు.
ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ పరిమితి సుమారు రూ.88 లక్షలకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల ధరలతోపాటు కుటుంబ ఆదాయాలు, కొనుగోలు సామర్థ్యాన్ని కూడా అందుబాటు ధరల నిర్వచనంలో పరిగణించాల్సిన అవసరం ఉందని ఏఎస్ఎఫ్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ సరాఫ్ సూచించారు.
ఆదాయ వర్గాల ఆధారంగా గృహాల ధరల విభాగాలను రూపొందిస్తే.. ప్రభుత్వ పథకాలు మరింత ప్రభావవంతంగా ఉండటంతోపాటు, విస్తృత వర్గాలకు ఇళ్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
తొలిసారి కొనుగోలుదారులకు రుణాలపై వెసులుబాటు
మొదటిసారి ఇల్లు కొనేవారికి గృహ రుణాలపై మరిన్ని ప్రయోజనాలు కల్పించాలని, రుణ వడ్డీ భారం తగ్గించే చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. కొనుగోలుదారుల వర్గాలను బట్టి ప్రోత్సాహకాలు అందిస్తే సొంతింటి కలను సాకారం చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
అలాగే నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టులకు సుమారు రూ.55 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అవసరమని సరాఫ్ అంచనా వేశారు. ప్రాజెక్టులు దివాలా ప్రక్రియలోకి లేదా జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) పరిధిలోకి వెళ్లిన తర్వాత స్పందించడం కంటే.. ఆర్థిక ఇబ్బందులు మొదలైన దశలోనే జోక్యం చేసుకునే వ్యవస్థ ఉండాలని సూచించారు.
ఇలా ముందస్తు చర్యలు తీసుకుంటే ప్రాజెక్టులు నిలిచిపోవడాన్ని, గృహ కొనుగోలుదారులు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్ చట్టంలో సమూల మార్పులు చేయాలి
