- లొకేషన్ కంటే ప్రాపర్టీ నాణ్యతే కీలకం
- డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ పార్కుల వైపు పెట్టుబడిదారుల చూపు
- 2030 నాటికి భారత్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్లకు
భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు స్థిరాస్తి పెట్టుబడులంటే ప్రధానంగా ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు డిజిటల్ సేవలు, తయారీ రంగం, మారుతున్న సరఫరా వ్యవస్థల అవసరాలతో కొత్త తరహా ఆస్తులకు డిమాండ్ పెరుగుతోంది. డేటా సెంటర్లు, పారిశ్రామిక సముదాయాలు, లాజిస్టిక్స్ పార్కులు, అద్దె గృహాలు, సీనియర్ లివింగ్ ప్రాజెక్టులు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు కేవలం ప్రాంతం లేదా భవిష్యత్తులో ధరలు పెరుగుతాయనే అంచనాపైనే ఆధారపడకుండా.. ఆస్తి నాణ్యత, దానికి ఉన్న వాస్తవ డిమాండ్, దీర్ఘకాలిక ఆదాయ సామర్థ్యాన్ని పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
భారత్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. 2025లో ఈ మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లుగా ఉందని అక్టోబర్ 2026లో విడుదలైన అనరాక్–ఫిక్కీ నివేదిక పేర్కొంది. 2047 నాటికి ఈ రంగం 5.8 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ వృద్ధి నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
స్థిరాస్తి పెట్టుబడుల్లో మంచి ప్రాంతాన్ని ఎంచుకోవడం ఇప్పటికీ కీలకమే. అయితే మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో ఆ ప్రాంతం ఏ రకమైన వ్యాపార కార్యకలాపాలకు అనుకూలంగా ఉంది? అక్కడ ఏ తరహా ఆస్తులకు డిమాండ్ ఉంది? భవిష్యత్తులో ఆ డిమాండ్ ఎంతకాలం కొనసాగుతుంది? అనే అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
డిజిటల్ సేవల విస్తరణతో డేటా సెంటర్ల అవసరం పెరుగుతోంది. తయారీ రంగం వృద్ధి, సరఫరా వ్యవస్థల్లో మార్పులు పారిశ్రామిక, లాజిస్టిక్స్ ఆస్తులకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. అదే సమయంలో నివాస, కార్యాలయ స్థిరాస్తి మార్కెట్లు కూడా జీవనశైలి మార్పులు, వ్యాపార విస్తరణ, పట్టణాభివృద్ధికి అనుగుణంగా రూపాంతరం చెందుతున్నాయి. ఒకే
ప్రాంతంలో ఉన్న రెండు ఆస్తులు కూడా వాటి వినియోగం, నిర్వహణ సామర్థ్యం, అద్దెదారుల డిమాండ్ ఆధారంగా వేర్వేరు పెట్టుబడి ఫలితాలను ఇవ్వవచ్చు. అందుకే ప్రాంతం ఎంపికతో పాటు ఆస్తి ప్రాథమిక అంశాలను అంచనా వేయడం అవసరమని పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్ చట్టంలో సమూల మార్పులు చేయాలి
డేటా సెంటర్లలో భారీ పెట్టుబడులు
భారత్‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల స్వరూపం మారుతున్నట్లు సంస్థాగత పెట్టుబడుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2026 తొలి తొమ్మిది నెలల్లో దేశీయ స్థిరాస్తి రంగంలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు 6.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో డేటా సెంటర్ల వాటా గణనీయంగా ఉంది. అనరాక్–ఫిక్కీ నివేదిక ప్రకారం.. 2026 జనవరి నుంచి సెప్టెంబరు వరకు డేటా సెంటర్లలో 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది స్థిరాస్తి రంగంలో మొత్తం ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల్లో దాదాపు 40 శాతం.
డిజిటల్ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా నిల్వ అవసరాలు పెరుగుతుండటంతో ఈ విభాగంలో పెట్టుబడులపై ఆసక్తి అధికమవుతోంది. అయితే డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కేవలం భూమి ధరను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సరిపోదు. నిరంతర విద్యుత్ సరఫరా, డిజిటల్ మౌలిక సదుపాయాలు, నిర్వహణ సామర్థ్యం వంటి అంశాలు కీలకం. వీటిలో లోపాలుంటే ఆస్తి విలువ పెరిగినా ఆశించిన ఆదాయం రావడం కష్టమవుతుంది.
మరోవైపు తయారీ రంగం విస్తరణ, ఈ-కామర్స్ వ్యాపారాల పెరుగుదల, సరఫరా వ్యవస్థల్లో మార్పులు లాజిస్టిక్స్ రంగానికి కొత్త అవకాశాలను తెస్తున్నాయి.
వస్తువుల నిల్వ, రవాణా, పంపిణీ కోసం ఆధునిక గోదాములు, లాజిస్టిక్స్ పార్కుల అవసరం పెరుగుతోంది. మొత్తానికి భారత్ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. అయితే ప్రతి కొత్త విభాగంలోనూ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయని భావించడం సరికాదు. ఆస్తి ప్రాథమిక అంశాలు, దానికి ఉన్న డిమాండ్, నిర్వహణ సామర్థ్యం, రిస్క్ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలి.
ఇదీ చదవండి: విలాసవంతమైన ఇళ్లకే పరిమితం కావొద్దు
