- రెండు టవర్ల కూల్చివేతకు ఆదేశాలు
- బిల్డర్ పై కేసు నమోదు చేయాలని స్పష్టీకరణ
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అపార్ట్‌మెంట్లపై అలహాబాద్ హైకోర్టు కఠిన చర్యలకు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నగరం సాహిబాబాద్‌లో ఉన్న గుల్మోహర్ గ్రీన్స్ రెసిడెన్షియల్ సొసైటీలో అక్రమంగా నిర్మించిన రెండు టవర్లను కూల్చివేయాలని ఆదేశించింది.
మరో నాలుగు టవర్లలో అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన తొమ్మిది, పదో అంతస్తులను కూడా తొలగించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా నిర్మాణ సంస్థ ప్రమోటర్‌పై మోసం, ఉత్తరప్రదేశ్ అపార్ట్‌మెంట్ చట్టం-2010 ఉల్లంఘనలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.
ఈ వ్యవహారంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసిన ఘజియాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ (జీడీఏ) మాజీ వైస్ చైర్‌పర్సన్‌పై క్రమశిక్షణా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
జస్టిస్ సరళ్ శ్రీవాస్తవ, జస్టిస్ సుధాంశు చౌహాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. సొసైటీలోని 27, 28 నంబర్ల టవర్లను పూర్తిగా కూల్చివేయాలని ఆదేశించింది. ఈ రెండు టవర్లలో ఐదు అంతస్తులు ఉండగా, ఒక్కో అంతస్తులో ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి.
వీటితో పాటు 16, 17, 18, 19 నంబర్ల టవర్లలో తొమ్మిది, పదో అంతస్తులను కూడా తొలగించాలని పేర్కొంది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని జీడీఏను ఆదేశించింది. కూల్చివేతకు అయ్యే ఖర్చును నిర్మాణ సంస్థ నుంచి భూమి రెవెన్యూ బకాయిల తరహాలో వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: రెండెకరాలు.. రూ.22.4 కోట్లు
85 మందికి కామన్ ఏరియాల విక్రయం
ఈ సొసైటీలోని నివాసితుల ఉమ్మడి వినియోగానికి కేటాయించిన ప్రాంతాలను కూడా బిల్డర్ 85 మందికి విక్రయించినట్లు కోర్టు గుర్తించింది. ఈ ప్రాంతాలను గుర్తించేందుకు జీడీఏ వైస్ చైర్‌పర్సన్ మూడు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఉమ్మడి స్థలాల్లో ఎవరైనా నిర్మాణాలు చేపట్టి ఉంటే వాటిని తొలగించి, తిరిగి సొసైటీకి అప్పగించాలని స్పష్టం చేసింది. ఆ స్థలాలను కొనుగోలు చేసిన 85 మందికి బిల్డర్ విక్రయించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడంతో పాటు, వారు చేపట్టిన నిర్మాణాల ఖర్చును కూడా కమిటీ అంచనా వేసి చెల్లించాలని ఆదేశించింది.
చెల్లించిన తేదీ నుంచి 10 శాతం వడ్డీ కూడా ఇవ్వాలని పేర్కొంది. నివాసితులను ఇబ్బందులకు గురిచేసిన నిర్మాణ సంస్థపై కోర్టు రూ.25 లక్షల వ్యయాన్ని విధించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోగా గుల్మోహర్ గ్రీన్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యూఏ)కు చెల్లించాలని ఆదేశించింది.
అలాగే కోర్టును ఆశ్రయించిన ప్రతి పిటిషనర్‌కు జీడీఏ రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని పేర్కొంది. అభివృద్ధి సంస్థ అధికారుల నిర్లక్ష్యం, బిల్డర్‌తో కుమ్మక్కైనట్లు వచ్చిన ఆరోపణల కారణంగానే నివాసితులు న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మాజీ అధికారిపై విచారణ.. పోలీసులకు కీలక ఆదేశం
ఈ ప్రాజెక్టులో నిర్మాణ నిబంధనల ఉల్లంఘనలను క్రమబద్ధీకరించేందుకు 2024 డిసెంబర్ 18న జీడీఏ మూడోసారి ఇచ్చిన కాంపౌండింగ్ అనుమతిని హైకోర్టు చట్టవిరుద్ధంగా ప్రకటించింది. అప్పటి జీడీఏ వైస్ చైర్‌పర్సన్ ఈ అనుమతిని మంజూరు చేయడంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని పేర్కొంది.
నెల రోజుల్లోగా సంబంధిత అధికారిపై క్రమశిక్షణా విచారణ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే బిల్డర్‌పై రెండు వారాల్లోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. మోసం, తప్పుడు సమాచారం ఇవ్వడం, యూపీ అపార్ట్‌మెంట్ చట్టం ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: విలాసవంతమైన ఇళ్లకే పరిమితం కావొద్దు
