- ముంబై ఆలీబాగ్ లో భూమి విక్రయించిన మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్
మాజీ భారత క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ లావాదేవీ చేశారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా అలీబాగ్‌లో తనకున్న 8,050 చదరపు మీటర్ల (సుమారు రెండు ఎకరాలు) భూమిని రూ.22.40 కోట్లకు విక్రయించారు. ఈ భూమిని ఆన్‌లైన్ ఆటోమొబైల్ మార్కెట్‌ప్లేస్ సంస్థ కార్‌ట్రేడ్ టెక్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. అక్టోబర్ 27, 2026న ఈ లావాదేవీ రిజిస్ట్రేషన్ పూర్తయింది.
అలీబాగ్ తాలూకాలోని ధోకావడే గ్రామంలో ఈ భూమి ఉంది. భూమితో పాటు అందులో ఉన్న రెండు నివాస భవనాలను కూడా విక్రయించినట్లు రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. ఈ లావాదేవీపై రూ.1.344 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు.
కార్‌ట్రేడ్ టెక్ తరఫున సంస్థ అధీకృత ప్రతినిధి వినేష్ మహాబల్ కుకియాన్ ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. కాగా, కార్‌ట్రేడ్ టెక్ సంస్థ కార్‌వేల్, బైక్‌వేల్, ఓఎల్‌ఎక్స్ ఇండియా, శ్రీరామ్ ఆటోమాల్ వంటి వేదికల ద్వారా కొత్త, పాత వాహనాల కొనుగోలు, విక్రయాలు, వేలం సేవలను అందిస్తోంది. అయితే అలీబాగ్‌లో కొనుగోలు చేసిన భూమిని ఏ అవసరానికి వినియోగించనుందనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.
ముంబైకి సమీపంలోని తీర ప్రాంతం కావడంతో అలీబాగ్ రెండో నివాసాలు, విహార గృహాలు, విలాసవంతమైన విల్లాల నిర్మాణానికి ప్రముఖ గమ్యస్థానంగా మారుతోంది. ఇక్కడ అపార్ట్‌మెంట్ల ధరలు చదరపు అడుగుకు రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకు ఉన్నాయని స్థానిక బ్రోకర్లు చెబుతున్నారు. వ్యవసాయ భూములు ఎకరానికి రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లు, వ్యవసాయేతర భూములు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పలుకుతున్నాయి.
ఇటీవల పలువురు ప్రముఖులు కూడా అలీబాగ్‌లో భూములు కొనుగోలు చేశారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ ఈ ఏడాది జనవరిలో ఐదు ఎకరాలకు పైగా భూమిని రూ.37.86 కోట్లకు కొనుగోలు చేశారు.
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ తదితరులు కూడా ఇక్కడ స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టారు. దీంతో అలీబాగ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రముఖ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది.
ఇదీ చదవండి: రియల్ పెట్టుబడులకు కొత్త దిశ
