- మూడో త్రైమాసికంలో 2.1 బిలియన్ డాలర్లు
- నాలుగు త్రైమాసికాల తర్వాత మళ్లీ విదేశీ సంస్థలదే ఆధిపత్యం
భారత రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2026 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ రంగంలోకి 2.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 12 శాతం, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం వృద్ధి నమోదైంది.
నాలుగు త్రైమాసికాలుగా దేశీయ సంస్థల ఆధిపత్యం కొనసాగగా.. తాజాగా విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ అగ్రస్థానానికి చేరారు. కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
మూడో త్రైమాసికంలో విదేశీ పెట్టుబడిదారులు 1.4 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టారు. మొత్తం పెట్టుబడుల్లో వీటి వాటా 68 శాతంగా ఉంది. గత త్రైమాసికంతో పోలిస్తే విదేశీ పెట్టుబడులు 64 శాతం, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 134 శాతం పెరిగాయి.
మరోవైపు దేశీయ సంస్థాగత పెట్టుబడులు 700 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఇవి 34 శాతం, వార్షిక ప్రాతిపదికన 39 శాతం తగ్గాయి. 2026 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు భారత రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన మొత్తం సంస్థాగత పెట్టుబడులు 5.5 బిలియన్ డాలర్లకు చేరాయి.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఈ తొమ్మిది నెలల కాలంలో దేశీయ పెట్టుబడిదారుల వాటా 52 శాతంగా ఉండగా, విదేశీ పెట్టుబడిదారుల వాటా 48 శాతంగా నమోదైంది. పెట్టుబడిదారులు సంప్రదాయ కార్యాలయ భవనాలతోపాటు డిజిటల్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తున్నారు.
మూడో త్రైమాసికంలో మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో 52 శాతం డేటా సెంటర్ల రంగానికి వెళ్లాయి. హాస్పిటాలిటీ రంగం 15 శాతం, కార్యాలయ భవనాల విభాగం 9 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి. కృత్రిమ మేధ (ఏఐ), డిజిటలీకరణ, డేటా నిల్వ అవసరాలు పెరుగుతుండటం డేటా సెంటర్లపై ఆసక్తికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: దుబాయ్‌లో చిన్న ఇళ్లకు భారీ డిమాండ్
ప్రైవేట్ ఈక్విటీ కీలక పాత్ర
పెట్టుబడుల మార్గాల్లో ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు 88 శాతం వాటాతో ముందున్నాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టుల (రీట్స్) వాటా 12 శాతంగా నమోదైంది. మొత్తం త్రైమాసిక పెట్టుబడి కార్యకలాపాల్లో బహుళ నగరాలకు సంబంధించిన లావాదేవీల వాటా 76 శాతంగా ఉంది.
ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా ముంబై 9 శాతం, ఢిల్లీ–ఎన్‌సీఆర్ 6 శాతం వాటాను దక్కించుకున్నాయి. కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ సోమీ థామస్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో సవాళ్లు ఉన్నప్పటికీ భారత రియల్ ఎస్టేట్ రంగంపై పెట్టుబడిదారుల ఆసక్తి కొనసాగుతోందని పేర్కొన్నారు.
దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు, విస్తృత స్థాయి ప్రాజెక్టులు ఉన్న విభాగాలవైపు పెట్టుబడులు మళ్లుతున్నాయని తెలిపారు.
ఇదీ చదవండి: దేశంలో రికార్డు స్థాయికి ఆఫీస్ లీజింగ్
