General

హైద‌రాబాద్ అభివృద్ధికి రూ.84,790 కోట్లు: నారెడ్కో తెలంగాణ ప్రాప‌ర్టీ షోలో డిప్యూటీ సీఎం

హైద‌రాబాద్ అభివృద్ధికి రూ.84,790 కోట్లు: నారెడ్కో తెలంగాణ ప్రాప‌ర్టీ షోలో డిప్యూటీ సీఎం

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌, 9030034591

హైద‌రాబాద్ అభివృద్ధి కోసం త‌మ ప్ర‌భుత్వం ఏకంగా 84,790 కోట్ల‌ను ఖ‌ర్చు పెడుతోంద‌ని రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క వెల్ల‌డించారు. శుక్రవారం హైటెక్స్‌లో నారెడ్కో తెలంగాణ 16వ ప్రాప‌ర్టీ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయ‌న మాట్లాడుతూ.. న‌గ‌రాభివృద్ధికి సంబంధించి ఇప్ప‌టికే 55 వేల కోట్ల‌కు సంబంధించిన ప‌నులు వివిధ ద‌శ‌లో ఉన్నాయ‌ని..ఇందులో  కొన్ని టెండ‌ర్లను ఖ‌రారు చేశామ‌ని తెలిపారు. 

ఏడాదిలోపు హైద‌రాబాద్ గ‌ణ‌నీయంగా అభివృద్ధి చెందుతుంద‌ని.. దేశంలో నుంచి ఇత‌ర న‌గ‌రాల నుంచి హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డేంత గొప్ప‌గా తీర్చిదిద్దేందుకు ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నామ‌న్నారు. న‌గ‌రానికి కావాల్సిన మంచినీరును కృష్ణా, గోదావ‌రి న‌దుల నుంచి తెప్పించి.. నీటి ఎద్ద‌డిని నివారించే దిశ‌గా ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నామ‌ని తెలిపారు. 

మూసీ న‌దిని పున‌రుజ్జీంప‌జేసే ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించిన‌ప్పుడు.. కొందరు అప‌హాస్యం చేశార‌న్నారు. సుమారు ఏడు వేల ఐదు వంద‌ల‌ కోట్ల అంచ‌నా వ్య‌యంతో ఇందుకు సంబంధించిన ప‌నుల్ని అతిత్వ‌ర‌లో ఆరంభిస్తామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌పంచంలో అభివృద్ధి చెందిన న‌గ‌రాల్లో న‌దుల్ని శుద్ధి చేసి.. వాటిని ఒక అసెట్‌గా మార్చుకున్నార‌ని గుర్తు చేశారు.

కానీ, మ‌న వ‌ద్ద మూసీ న‌దిని మంచినీటిని ప్ర‌వ‌హించే న‌దిగా మార్చుకుని.. న‌గ‌రానికే మ‌ణిహారంగా మారుతుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. 30 వేల ఎక‌రాల్లో సగం స్థ‌లాన్ని లంగ్ స్పేసెస్ కోసం వ‌దిలేసి..  భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామ‌ని చెప్పారు. న‌గ‌రాన్ని మోడ‌ల్ సిటీగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎడ‌తెగ‌క కృషి చేస్తున్నార‌ని గుర్తు చేశారు. 

ప్రస్తుతం 20 మురుగునీటి శుద్ధి కేంద్రాలు పని చేస్తున్నాయని, శుద్ధి చేసిన నీటి సరఫరాను పెంచి, మంచి నీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు మరో 38 ఎస్టీపీలను ఏర్పాటు చేసే ప్రణాళికల్ని ర‌చించామ‌న్నారు.

అలాగే మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల కోసం జీహెచ్ఎంసీకి రూ.4,000 కోట్లు, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.2,500 కోట్లు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.2,160 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: కోకాపేట్‌ భూములపై హెచ్‌ఎండీఏ మరో బిగ్‌ ప్లాన్‌..

జీఎస్టీ త‌గ్గించాలి

ఈ సంద‌ర్భంగా నారెడ్కో తెలంగాణ అధ్య‌క్షుడు శ్రీధ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ఆర్థికాభివృద్ధిలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. కేపీఎంజీ నివేదికను ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం దేశంలో నిర్మాణ రంగం సుమారు 7 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని, భవిష్యత్తులో ఈ సంఖ్య 10 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. 2025-26లో ఈ రంగం 10.7 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ప్రస్తుతం దాదాపు రెండంకెల వృద్ధితో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో పెరుగుతున్న కార్యాలయాల విస్తరణ కూడా గృహాల డిమాండ్‌ను పెంచుతోందని శ్రీధర్ రెడ్డి వివరించారు. నగరంలో 13.1 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కార్యకలాపాలు నమోదయ్యాయని, దేశంలో రెండో అతిపెద్ద ఆఫీస్ మార్కెట్‌గా హైదరాబాద్ నిలిచిందని చెప్పారు. ఇందులో 6.1 మిలియన్ చదరపు అడుగుల స్థలం గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCCs) నుంచి వచ్చిందన్నారు.

కొత్త కార్యాలయాలు ఏర్పాటవుతుండటంతో ఉద్యోగుల కోసం ఇళ్లకు కూడా డిమాండ్ పెరుగుతోందని తెలిపారు.

నిర్మాణ వ్యయాలు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని ప్రాజెక్టుల పూర్తి కావడానికి ఐదు నుంచి తొమ్మిదేళ్ల సమయం పడుతోందని, కేటగిరీ-2 విద్యుత్ అనుమతులు సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సీవరేజ్ ఛార్జీలు రూ.3 నుంచి రూ.8కు పెరిగాయని, వాటిని తగ్గించాలని కోరారు.

కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని వస్తువులు, సేవలపై చెల్లించిన జీఎస్టీకి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యను జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు. పెరుగుతున్న ఖర్చులను అధిగమించేందుకు నిర్మాణ రంగానికి ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అందుబాటు ధ‌ర‌లో ఇళ్లు..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో ఇళ్లు లభించేలా రియల్ ఎస్టేట్ రంగం దృష్టి పెట్టాలని సూచించారు. నివాస ప్రాజెక్టుల రూపకల్పనలో మధ్యతరగతి అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 

ఈ సంద‌ర్భంగా నారెడ్కో తెలంగాణ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆర్ వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ.. ఈ ప్రాప‌ర్టీ షోలో బిల్డ‌ర్లు, బ్యాంక‌ర్లు, రెరా అధికారులు ఒకే వేదిక‌లో అందుబాటులో ఉంటార‌ని.. కాబ‌ట్టి, ఔత్సాహిక కొనుగోలుదారులు షోకు విచ్చేసి కొంత స‌మ‌యాన్ని గ‌డిపితే చాలు.. సుల‌భంగా సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు.

ఇల్లు కొనాలనుకునేవారు, పెట్టుబడిదారులు వివిధ ప్రాజెక్టులను పరిశీలించి, ధరలు, సౌకర్యాలు, బ్యాంకు రుణాలు, చెల్లింపు విధానాలపై డెవలపర్లు, బ్యాంకు ప్రతినిధులతో నేరుగా చర్చించే అవకాశం ఉంద‌న్నారు.

ఈ ప్రాపర్టీ షో శనివారం, ఆదివారం కూడా కొనసాగుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ నిర్మాణ సంఘాల‌కు చెందిన ప్ర‌తినిధులు, నారెడ్కో తెలంగాణ స‌భ్యులు, పలువురు బిల్డ‌ర్లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ