- 34 శాతం వృద్ధితో 42 మిలియన్ చ.అ.లకు చేరిన వినియోగం
- స్పేస్ ఆక్యుపెన్సీలో బెంగళూరు టాప్
దేశంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ అదరగొట్టింది. టారిఫ్‌లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఐటీ/ఐటీఈఎస్ రంగాలలో తొలగింపులు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ బలంగా ఉంది. 2025 మొదటి తొమ్మిది నెలల్లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ వినియోగ రేటు 42 మిలియన్ చదరపు అడుగులను అధిగమించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 34 శాతం అధికం అని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. ప్రధానంగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు), టెక్-ఆధారిత కంపెనీలు ఇందుకు దోహదపడ్డాయని తెలిపింది.
ఆఫీస్ స్పేస్ వినియోగంలో 9.95 మిలియన్ చదరపు అడుగులతో బెంగళూరు టాప్ లో ఉంది. తరువాత ఢిల్లీ-ఎన్ సీఆర్ (8.2 మిలియన్ చదరపు అడుగులు), ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (6.6 మిలియన్ చదరపు అడుగులు) ఉన్నాయి. మొత్తం లీజింగ్‌లో ఐటీ, అనుబంధ రంగాలు 27% వాటాతో ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కోవర్కింగ్ స్పేస్‌లు 23%, బీఎఫ్ఎస్ఐ 18% వాటాతో ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే, ఐటీ రంగం ఒక శాతం స్వల్ప తగ్గుదల నమోదు చేసిందని డేటా చూపించింది. జీసీసీలు కీలకమైన డిమాండ్ డ్రైవర్‌గా ఉద్భవించాయని.. 2025లో ఇప్పటివరకు స్థూల లీజింగ్ కార్యకలాపాలలో 40% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పూరి అన్నారు. బెంగళూరు, పూణే, చెన్నై ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయని పేర్కొన్నారు.
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కొత్త కార్యాలయ పూర్తిలు 15% పెరిగాయి. 2024 మొదటి తొమ్మిది నెలల్లో 34.07 మిలియన్ చదరపు అడుగులు ఉండగా.. 2025 మొదటి తొమ్మిది నెలల్లో 39.21 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. కొత్త సరఫరా పరంగా బెంగళూరు 10.41 మిలియన్ చదరపు అడుగులతో అగ్రస్థానంలో ఉండగా.. పూణే 9.2 మిలియన్ చదరపు అడుగులతో రెండవ స్థానంలో ఉంది. అయితే.. హైదరాబాద్, ముంబైలు కొత్త కార్యాలయ సరఫరాలో క్షీణత నమోదైంది. హైదరాబాద్ లో 39% తగ్గగా.. ముంబైలో 41% తగ్గింది. మరోవైపు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కార్యాలయ మార్కెట్లలో ఖాళీలు కూడా తగ్గుతూనే ఉన్నాయి. చెన్నై 8.9%తో అత్యల్ప ఖాళీ రేటును నమోదు చేయగా.. పూణే (11.3%) మరియు హైదరాబాద్ (13.2%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
General
అదరగొట్టిన ఆఫీస్ స్పేస్
