- పోచారంలో కొత్త డెవలప్‌మెంట్ సెంటర్
- 11 లక్షల చ.అ. ఐటీ బ్లాక్ ప్రారంభం
- 10 వేల ఉద్యోగులకు సీట్లు
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. పోచారం డెవలప్‌మెంట్ సెంటర్‌లో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన కొత్త సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌ను శుక్రవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.
450 ఎకరాల్లో విస్తరించిన పోచారం క్యాంపస్‌లో ఇప్పటికే ఏడు డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి. కొత్త భవనంతో అదనంగా 10 వేల ఉద్యోగుల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. హైబ్రిడ్ విధానంలో 13 వేల మందికి పైగా ఉద్యోగులు పని చేసేలా కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది.
ఈ కొత్త కేంద్రం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంజినీరింగ్, డిజిటల్ సేవల్లో ఇన్ఫోసిస్ సామర్థ్యం పెరగనుంది. అంతర్జాతీయ ఖాతాదారులకు మరిన్ని ఆధునిక సేవలు అందించేందుకు ఇది దోహదపడనుంది.
పర్యావరణహితంగా ఈ భవనాన్ని నిర్మించారు. విద్యుత్ ఆదా చేసే కూలింగ్ వ్యవస్థలు, స్మార్ట్ లైటింగ్, వర్షపు నీటి సంరక్షణ, వ్యర్థ జలాల పునర్వినియోగ సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ విస్తరణ తెలంగాణ సాంకేతిక రంగానికి మరో మైలురాయిగా నిలుస్తుందని భట్టి విక్రమార్క అన్నారు.
హైదరాబాద్‌తో ఇన్ఫోసిస్ అనుబంధం మరింత బలపడుతుందని సంస్థ సీఎఫ్‌వో జయేష్ సంఘ్రాజ్కా తెలిపారు. ఈ కేంద్రం ద్వారా రాష్ట్ర యువతకు ఆధునిక సాంకేతిక రంగాల్లో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఐటీ, రెసిడెన్షియల్.. గ్రోత్ ఇంజిన్.. గోపనపల్లి
