హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో రానున్న ఐదేళ్లలో భారీగా కొత్త నివాస ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఈ మార్కెట్లో ఏ ఒక్క బిల్డర్ ఆధిపత్యం కనిపించడం లేదు. జాతీయ స్థాయి రియల్ ఎస్టేట్ సంస్థలు, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు, చిన్న బిల్డర్లు కలిసి నగర గృహ నిర్మాణ రంగంలో పోటీపడుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో హైదరాబాద్ మార్కెట్ మరింత పోటీగా మారనుంది.
రానున్న ఇళ్ల సరఫరాలో మై హోమ్ గ్రూప్ 5 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. రాజపుష్ప 4.9 శాతంతో రెండో స్థానంలో, అపర్ణ కన్స్ట్రక్షన్స్ 4.5 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. 2026 నుంచి 2031 మధ్య అందుబాటులోకి రానున్న మొత్తం గృహాల సరఫరాలో టాప్-10 నిర్మాణ సంస్థల వాటా కేవలం 29.2 శాతమే. మిగిలిన 70.8 శాతం వాటా ఇతర జాతీయ, ప్రాంతీయ నిర్మాణ సంస్థలు, చిన్న బిల్డర్ల మధ్య విస్తరించింది.
వాసవి 3.4 శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉండగా, బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ గ్రూప్ 3 శాతంతో ఐదో స్థానంలో నిలిచింది. టాప్-5లో హైదరాబాద్ వెలుపల ప్రధాన కార్యాలయం ఉన్న ఏకైక సంస్థ ప్రెస్టీజ్ గ్రూప్. రాఘవ కన్స్ట్రక్షన్స్ 2.2 శాతం, క్యాండియర్ 1.8 శాతం వాటా కలిగి ఉన్నాయి. హానర్ హోమ్స్, సైబర్‌సిటీ చెరో 1.5 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉండగా, సాస్ ఇన్ఫ్రా 1.4 శాతంతో టాప్-10లో నిలిచింది.
మై హోమ్, రాజపుష్ప, అపర్ణ సంస్థలు కలిపి మొత్తం గృహ సరఫరాలో 14.4 శాతం వాటా కలిగి ఉన్నాయి. మొదటి రెండు స్థానాల్లో ఉన్న మై హోమ్, రాజపుష్ప మధ్య వ్యత్యాసం కేవలం 0.1 శాతం పాయింట్లే. టాప్-5లో నాలుగు సంస్థలు హైదరాబాద్‌కు చెందినవే కావడం విశేషం.
సీఆర్ఈ మ్యాట్రిక్స్ గణాంకాల ప్రకారం, ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో గృహ నిర్మాణ మార్కెట్ అనేక సంస్థల మధ్య విస్తరించి ఉంది. కొన్ని నగరాల్లో కొద్ది పెద్ద సంస్థలే అధిక మార్కెట్ వాటాను కలిగి ఉండగా, హైదరాబాద్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.
ఇదీ చదవండి: 50 ఎకరాల్లో అన్విత పార్క్‌సైడ్!
జాతీయ స్థాయి సంస్థలు
టాప్-10 సంస్థలతో పాటు గోద్రెజ్ ప్రాపర్టీస్, బ్రిగేడ్ గ్రూప్, శోభా, సుమధుర ఇన్ఫ్రాకాన్ వంటి జాతీయ స్థాయి సంస్థలు కూడా హైదరాబాద్ మార్కెట్లో ఉన్నాయి. రాంకీ ఎస్టేట్స్, ఆరో రియాల్టీ, ఎన్సీసీ అర్బన్ సంస్థలు కూడా గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపడుతున్నాయి.
ప్రాంతీయ, మధ్యస్థాయి నిర్మాణ సంస్థల్లో ఎస్బీఎల్ (అశోకా బిల్డర్స్), లాన్సమ్ ప్రాపర్టీస్, వర్టెక్స్ హోమ్స్, అర్బన్‌రైజ్ (అలయన్స్ గ్రూప్), పౌలోమి ఎస్టేట్స్, జయభేరి గ్రూప్, హాల్‌మార్క్ బిల్డర్స్, ఇన్‌కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోదీ బిల్డర్స్, డీఎస్సార్ బిల్డర్స్ ప్రముఖంగా ఉన్నాయి.
వీటితో పాటు వందలాది చిన్న బిల్డర్లు కూడా సొంతంగా అపార్ట్మెంట్ ప్రాజెక్టులు చేపడుతున్నారు. ముఖ్యంగా నగరం విస్తరిస్తున్న కొద్దీ తెల్లాపూర్, కొల్లూరు, బాచుపల్లి, కొంపల్లి, ఉప్పల్ ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు పెరుగుతున్నాయి. పెద్ద సంస్థలు బహుళ అంతస్తుల భారీ గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తుండగా, చిన్న బిల్డర్లు విడివిడిగా అపార్ట్మెంట్ ప్రాజెక్టులు చేపడుతున్నారు.
ఇలా వివిధ స్థాయిలకు చెందిన బిల్డర్లు పోటీపడటంతో కొనుగోలుదారులకు ప్రాంతాలు, అపార్ట్మెంట్ విస్తీర్ణం, ధరల విషయంలో ఎక్కువ ఎంపికలు లభిస్తున్నాయి.
అదే సమయంలో నిర్మాణ సంస్థలకు పోటీ కూడా పెరుగుతోంది. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం, నిర్మాణ నాణ్యత, ఆర్థిక స్థిరత్వం కీలకంగా మారనున్నాయి. రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏ సంస్థలు తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయో ఈ అంశాలే నిర్ణయించనున్నాయి.
- 29.2% – హైదరాబాద్‌లో టాప్-10 బిల్డర్ల మొత్తం మార్కెట్ వాటా.
- 70.8% – మిగిలిన బిల్డర్ల వాటా.
- 5% – 5 శాతం వాటాతో మొదటి స్థానంలో మై హోమ్ గ్రూప్.
- 14.4% – మై హోమ్, రాజపుష్ప, అపర్ణ సంస్థల ఉమ్మడి వాటా.
- స్థానిక సంస్థల ఆధిపత్యం– టాప్-5లో నాలుగు హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సంస్థలే.
ఇదీ చదవండి: కొల్లూరులో లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ విల్లాలు
