2028 నాటికి 17-18 మిలియన్ చదరపు అడుగుల కొత్త స్పేస్
దేశంలోని కీలక మెట్రోల్లో భారీగా కొత్త కార్యాలయ స్పేస్ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రెస్టీజ్ లక్ష్యంగా పెట్టుకుంది. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి వార్షిక అద్దె రూ.3,200 కోట్ల లక్ష్యంగా రూ.12,000 కోట్ల కార్యాలయ విస్తరణను ప్లాన్ చేస్తోంది.
2027 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 17-18 మిలియన్ చదరపు అడుగుల కొత్త కార్యాలయ స్థలాన్ని కార్యాచరణలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తద్వారా మొత్తం పోర్టుఫోలియోను 2028 ఏప్రిల్ నాటికి 30 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని ప్రెస్టీజ్ ఆఫీస్ వెంచర్స్ సిఇఒ జగ్గీ మార్వాహా తెలిపారు. వార్షిక అద్దెలు 15 నుంచి 20 శాతం మేర పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. “ప్రస్తుతం 17 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలం నిర్మాణంలో ఉంది. ఒక్క ముంబైలోనే 7.5 మిలియన్ చదరపు అడుగులు ఉండగా.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో మరో 10 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ రాబోతోంది’ అని వివరించారు.
ఇప్పటికే ప్రెస్టీజ్ కు దేశవ్యాప్తంగా 12 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఉండగా.. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే 30 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుంది. కొత్త ఆఫీస్ స్పేస్ విస్తరణకు దాదాపు రూ.12వేల కోట్ల పెట్టుబడి అవసరం అని అంచనా. దీని ద్వారా ఏటా రూ.3,200 కోట్ల నికర ఆదాయం వస్తుందని సంస్థ భావిస్తోంది. దీంతోపాటు డెటా సెంటర్ విభాగంలోకి కూడా సంస్థ అడుగు పెడుతోంది.
బెంగళూరులో ఎన్ టీటీ కోసం 100 మెగావాట్ల డేటా సెంటర్ నిర్మించిన నేపథ్యంలో ఈ విభాగంలో కూడా విస్తరించాలని యోచిస్తోంది. ప్రపంచ అనిశ్చితి ఉన్నప్పటికీ, భారతదేశ కార్యాలయ మార్కెట్ దృక్పథం గురించి, ముఖ్యంగా బెంగళూరులో చాలా సానుకూల పరిస్థితులు ఉన్నాయని మార్వాహా పేర్కొన్నారు. బలమైన కార్యాలయ డిమాండ్ కారణంగా బెంగళూరులో అద్దెలు పెరుగుతున్నాయని.. ఏడాదిలో ఆఫీసు అద్దెలు 15-20 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్, గురుగ్రామ్ వంటి ఇతర నగరాల్లోని ప్రధాన కార్యాలయ మార్కెట్లలో కూడా ఇదే విధమైన ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు.
