హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే నగరంలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, స్టీల్ బ్రిడ్జిల నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇప్పుడు మరో భారీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ నుంచి పశ్చిమ హైదరాబాద్‌లోని నివాస ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ఈ ప్రాజెక్టు ఊరటనివ్వనుంది.
లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో నాలుగు లైన్ల భారీ స్టీల్ రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు ప్రణాళికల్ని రూపొందించారు. గుల్మోహర్ జంక్షన్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జిని నిర్మిస్తారు. ఇందుకోసం దాదాపు రూ.308 కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు.
ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి నుంచి బీహెచ్‌ఈఎల్ వైపు వెళ్లే వారికి ప్రయాణం సులభమవుతుంది. తెల్లాపూర్, నల్లగండ్ల, లింగంపల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా నల్లగండ్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిపై.. ప్రస్తుతమున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు లింగంపల్లి అండర్‌పాస్ వద్ద వాహనాల రద్దీకి పరిష్కారం లభిస్తుంది.
ఇదీ చదవండి: టైర్-2 నగరాల్లో స్థిరాస్తి పెట్టుబడి.. ప్లాటా? ఇల్లా?
స్టీల్ నిర్మాణమే ఎందుకు?
ఈ ప్రాజెక్టులో అధికారులు స్టీల్ నిర్మాణ విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సాధారణ కాంక్రీట్ నిర్మాణాలతో పోలిస్తే స్టీల్ బ్రిడ్జి పనులను వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. నగరంలో ట్రాఫిక్‌కు ఎక్కువకాలం అంతరాయం కలగకుండా నిర్మాణాన్ని చేపట్టాలన్నది ప్రధాన ఉద్దేశం.
బీహెచ్ఈఎల్ ట్రాఫిక్‌కు చెక్
- బ్రిడ్జి నిర్మాణంతో పాటు పరిసర రోడ్ల అభివృద్ధిపైనా అధికారులు దృష్టి పెట్టారు.
- గుల్మోహర్ జంక్షన్ నుంచి రెండు లైన్ల అప్‌ర్యాంప్ నిర్మాణం.
- గచ్చిబౌలి నుంచి వచ్చే రెండు లైన్ల అప్‌ర్యాంప్‌ల పొడిగింపు.
- శేరిలింగంపల్లి ఆర్‌ఓబీ నుంచి బీహెచ్‌ఈఎల్ వైపు తారానగర్ వద్ద ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.
- ప్రస్తుతం 80 అడుగులుగా ఉన్న రోడ్లను 100 అడుగులకు విస్తరించే ప్రతిపాదన.
ఐటీ ఉద్యోగులకు ప్రయాణ కష్టాలు తగ్గేనా?
తెల్లాపూర్, నల్లగండ్ల, లింగంపల్లి ప్రాంతాలు ఇప్పుడు వేగంగా నివాస ప్రాంతాలుగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతాల్లో భారీగా నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్ వైపు వెళ్లే రోడ్లపై వాహనాల రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త స్టీల్ బ్రిడ్జి, రోడ్ల విస్తరణ పనులు పూర్తయితే పశ్చిమ హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు మరో భారీ ఇన్‌ఫ్రా పరిష్కారం సిద్ధమవుతోంది. గుల్మోహర్ జంక్షన్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు నిర్మించనున్న ఈ నాలుగు లైన్ల స్టీల్ బ్రిడ్జి ఎప్పుడు పట్టాలెక్కుతుంది? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: తగ్గిన భూముల కొనుగోళ్లు, జాయింట్ డెవలప్‌మెంట్‌పై ఆసక్తి
