General

తగ్గిన భూముల కొనుగోళ్లు, జాయింట్ డెవలప్‌మెంట్‌పై ఆసక్తి

తగ్గిన భూముల కొనుగోళ్లు, జాయింట్ డెవలప్‌మెంట్‌పై ఆసక్తి

దేశంలో రియల్‌ ఎస్టేట్‌ భూముల కొనుగోళ్ల జోరు తగ్గుతోంది. భూముల ధరలు పెరగడం, ప్రాజెక్టుల ఆర్థిక సాధ్యాసాధ్యాలపై డెవలపర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతో నేరుగా భూములు కొనుగోలు చేయడం తగ్గిస్తున్నారు.

ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు దేశవ్యాప్తంగా 76 భూముల కొనుగోలు ఒప్పందాలు మాత్రమే నమోదయ్యాయి. వీటి ద్వారా సుమారు 1,445 ఎకరాల భూమి లావాదేవీలు జరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో 99 ఒప్పందాల ద్వారా 3,292 ఎకరాల భూమి చేతులు మారింది. ఈ వివరాలను అనరాక్‌ రీసెర్చ్‌ వెల్లడించింది.

జాయింట్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత

భూములు నేరుగా కొనుగోలు చేయడం కంటే యజమానులతో కలిసి అభివృద్ధి చేసేందుకు డెవలపర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో జరిగిన 76 లావాదేవీల్లో 19 జాయింట్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్లు (జేడీఏ) ఉన్నాయి. అంటే ప్రతి నాలుగు భూముల ఒప్పందాల్లో ఒకటి ఈ విధానంలోనే జరిగింది.

2022లో మొత్తం లావాదేవీల్లో జేడీఏల వాటా 12 శాతంగా ఉండగా.. 2025లో 24 శాతానికి, 2026 తొలి తొమ్మిది నెలల్లో 25 శాతానికి పెరిగింది. ఈ విధానంలో భూమి యజమాని తన స్థలాన్ని అభివృద్ధికి అందిస్తే, బిల్డర్‌ నిర్మాణ బాధ్యతలు చేపడతారు.

ఒప్పందం ప్రకారం ఇద్దరూ నిర్మించిన ప్రాజెక్టులో వాటా లేదా ఆదాయాన్ని పంచుకుంటారు. దీంతో బిల్డర్లపై భారీగా భూమి కొనుగోలు పెట్టుబడి భారం తగ్గుతుంది.

ఇదీ చదవండి: రూ.1.95 కోట్లు తిరిగిచ్చేయండి: వినియోగదారుల కమిషన్‌

భారీ భూసేకరణలోనూ తగ్గుదల

50 ఎకరాలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూముల కొనుగోళ్లు కూడా తగ్గాయి. గత ఏడాది తొలి తొమ్మిది నెలల్లో ఇలాంటి 12 ఒప్పందాలు జరగ్గా.. ఈ ఏడాది ఐదింటికే పరిమితమయ్యాయి. వీటి ద్వారా చేతులు మారిన భూమి 2,398 ఎకరాల నుంచి 588 ఎకరాలకు పడిపోయింది. భారీ భూవిస్తీర్ణాల కొనుగోళ్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.

2022 నుంచి సెప్టెంబర్‌ 2026 వరకు జరిగిన లావాదేవీల్లో ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ 2,798 ఎకరాలతో మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ 2,012 ఎకరాలు, బెంగళూరు 1,679 ఎకరాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ 600 ఎకరాల భారీ భూమి కొనుగోలు ఒప్పందం నమోదైంది.

కోయంబత్తూరులో 714 ఎకరాల లావాదేవీ జరిగింది. మొత్తంగా చూస్తే బిల్డర్లు విస్తరణకు ప్రాధాన్యమిస్తూనే పెట్టుబడి, భూమి ధరలు, ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని అడుగులు వేస్తున్నారని అనరాక్‌ నివేదిక స్పష్టం చేస్తోంది.

ఇదీ చదవండి: బకాయిలు చెల్లించని బయ్యర్‌కి పరిహారం నిరాకరణ