- ఫ్లాట్ సైజు.. 7000-15000 ఎస్ఎఫ్‌టీ
- ఒక్కోఫ్లాట్ కనీస విలువ.. రూ. 28 కోట్లు
- గరిష్ఠ విలువ.. దాదాపు రూ.70 కోట్లు
- ఆధునిక లగ్జరీకి నయా చిరునామా
కింగ్ జాన్సన్ కొయ్యడ | 9030034591
లగ్జరీ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ ప్రాజెక్ట్ అందుబాటులోకి రాబోతోంది. దేశ రాజధాని ప్రాంతమైన గురుగ్రామ్‌లో పయనీర్ అర్బన్ సంస్థ రూ.3,500 కోట్లకు పైగా పెట్టుబడితో 'అలూరా' పేరుతో ఒక అల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించింది. 7 వేల నుంచి 15 వేల చదరపు అడుగుల వరకు ఉండే విశాలమైన ఇళ్లు, హోటల్ తరహా సేవలు, అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్చర్, వెల్‌నెస్ సదుపాయాలు ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు. మరి ఈ ప్రాజెక్ట్‌లో ఇంకెన్ని విశేషాలు ఉన్నాయో చూద్దాం.
గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ ఎక్స్‌టెన్షన్ రోడ్, సెక్టార్ 62లో పయనీర్ అర్బన్ ల్యాండ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ ‘అలూరా’ పేరుతో అల్ట్రా లగ్జరీ సర్వీస్డ్ రెసిడెన్సెస్ ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించింది. పయనీర్ డిస్ట్రిక్ట్‌లో 6.99 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రెండు భారీ టవర్లలో సుమారు 250 ప్రత్యేకమైన నివాసాలు ఉంటాయి.
ప్రాజెక్ట్‌పై రూ.3,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుండగా, అమ్మకాల ద్వారా రూ.9,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని సంస్థ అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో ఇళ్ల విస్తీర్ణం 7 వేల నుంచి 15 వేల చదరపు అడుగుల వరకు ఉంటుంది. సిగ్నేచర్ రెసిడెన్సెస్, డ్యూప్లెక్స్‌లు, పెంట్‌హౌస్‌లు అందుబాటులో ఉండనున్నాయి. కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా ఇంటి అంతర్గత లేఅవుట్‌ను మార్చుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి: దీపావళి తర్వాత టీ-స్క్వేర్‌కు గ్రీన్‌సిగ్నల్?
ఆర్కిటెక్చర్ ప్రత్యేకతలు
అలూరా ప్రాజెక్ట్‌కు ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ స్కిడ్‌మోర్, ఓవింగ్స్ అండ్ మెరిల్… అంటే SOM డిజైన్ అందిస్తోంది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, న్యూయార్క్‌లోని వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వంటి ప్రముఖ నిర్మాణాలతో ఈ సంస్థకు గుర్తింపు ఉంది. ఈ ప్రాజెక్ట్ డిజైన్, ఇంజినీరింగ్ పనుల్లో 40కి పైగా ప్రత్యేక కన్సల్టెన్సీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈస్ట్ టవర్ సుమారు 200 మీటర్ల ఎత్తు వరకు నిర్మించనున్నారు.
ఇళ్లలో ఫ్లోర్ నుంచి సీలింగ్ వరకు ఉండే హై-పెర్ఫార్మెన్స్ గ్లేజింగ్, సుమారు 13.5 అడుగుల ఫ్లోర్ హైట్, ప్రత్యేకమైన ప్రైవేట్ లిఫ్ట్ లాబీలు ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల సహజమైన వెలుతురు, విశాలమైన వ్యూ, మరింత ఓపెన్‌గా ఉండే ఇంటీరియర్స్ అందించాలన్నది సంస్థ ఉద్దేశం. కొన్ని ఇళ్లలో 10 అడుగుల లోతు, 300 అడుగులకు పైగా పొడవు ఉండే ర్యాప్‌అరౌండ్ బాల్కనీలు కూడా ఉంటాయి.
అంటే ఇంటి లోపలి ప్రదేశానికి అనుసంధానంగా పెద్ద అవుట్‌డోర్ స్పేస్‌ను కూడా అందించనున్నారు. ఇక ప్రాజెక్ట్‌లో గ్రౌండ్ లెవల్‌ను వాహన రాకపోకలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దనున్నారు. వాహనాల రాకపోకలు, పార్కింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను భూగర్భంలో ప్లాన్ చేశారు. దీంతో పైన ఉండే గ్రీన్ స్పేస్‌లు, వాకింగ్ ఏరియాలు, కుటుంబ సభ్యుల వినోదానికి ప్రత్యేక స్థలం అందుబాటులో ఉంటుంది.
హోటల్ తరహా సేవలు..
అలూరా ప్రాజెక్ట్‌లో మరో ప్రధాన ఆకర్షణ సర్వీస్డ్ రెసిడెన్స్ కాన్సెప్ట్. ఇక్కడ నివసించే వారికి కన్సియర్జ్ సేవలు, హౌస్‌కీపింగ్, లాండ్రీ, వాలెట్ పార్కింగ్, ఇంటి వద్దే వివిధ సేవలు అందించనున్నారు. అంతేకాదు, డైనింగ్, ప్రత్యేక విందులు, రోజువారీ అవసరాలకు సంబంధించిన సేవల్లోనూ సహాయం అందించనున్నారు. అంటే సొంత ఇంటి ప్రైవసీతో పాటు హోటల్ తరహా సౌకర్యాలు పొందేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు.
సుమారు 250 ఇళ్లున్న ఈ కమ్యూనిటీ కోసం 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెసిడెన్స్ క్లబ్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో రెస్టారెంట్లు, ప్రైవేట్ డైనింగ్ ఏరియాలు, ఇండోర్, అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్స్, జిమ్, స్పా, సెలూన్, స్పోర్ట్స్ సదుపాయాలు ఉంటాయి. వీటితో పాటు పిల్లల కోసం ప్రత్యేక ప్రదేశాలు, వేడుకల నిర్వహణకు వేదికలు, లైబ్రరీ, బిజినెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఇదీ చదవండి: పుప్పాలగూడలో రెండు భారీ ప్రాజెక్టులకు టీజీ రెరా ఊరట
వెల్‌నెస్.. సస్టైనబిలిటీ
ఆరోగ్యం, పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ అలూరా ప్రాజెక్ట్‌కు WELL సర్టిఫికేషన్‌తో పాటు IGBC ప్లాటినం ప్రీ-సర్టిఫికేషన్ లభించాయి. ఇండోర్ ప్రదేశాల్లో శుద్ధి చేసిన స్వచ్ఛమైన గాలిని అందించే వ్యవస్థ, ప్రతి ట్యాప్ వద్ద తాగునీటి సదుపాయం వంటి అంశాలను డిజైన్‌లో చేర్చారు. భవన నిర్మాణాన్ని సీస్మిక్ జోన్-5 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది.
నిర్మాణ పనులు.. పూర్తి గడువు
ప్రాజెక్ట్‌ను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం అలూరా ఎక్స్‌పీరియన్స్ సెంటర్, శాంపిల్ రెసిడెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇళ్ల లేఅవుట్లు, ఫినిషింగ్, డిజైన్, సేవలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం కల్పిస్తున్నారు.
ఇక నిర్మాణ పనుల్లో భాగంగా డయాఫ్రాగమ్ వాల్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ప్రధాన నిర్మాణ పనుల కోసం కాంట్రాక్టర్లతో చర్చలు తుది దశలో ఉన్నాయని సంస్థ తెలిపింది. 2031 రెండో త్రైమాసికానికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పయనీర్ డిస్ట్రిక్ట్
అలూరా ప్రాజెక్ట్ పయనీర్ డిస్ట్రిక్ట్‌లో భాగంగా ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో అరయా, ప్రెసిడియా, పయనీర్ పార్క్ వంటి నివాస ప్రాజెక్టులతో పాటు పయనీర్ స్క్వేర్, అర్బన్ స్క్వేర్ వంటి వాణిజ్య ప్రాంతాలు ఉన్నాయి. దీంతో నివాస, వాణిజ్య అవసరాలు కలిసిన ప్రాంతంలో అలూరా మరో లగ్జరీ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకోనుంది.
మొత్తంగా చూస్తే, భారీ విస్తీర్ణంలో ప్రత్యేకమైన నివాసాలు, అంతర్జాతీయ ఆర్కిటెక్చర్, హోటల్ తరహా సేవలు, వెల్‌నెస్ సదుపాయాలతో అలూరా గురుగ్రామ్‌లో అల్ట్రా లగ్జరీ హౌసింగ్‌కు కొత్త ప్రమాణాలను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పయనీర్ అర్బన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ పెరివాల్ మాట్లాడుతూ, నిర్మాణం పూర్తి చేసి ఇళ్లను అప్పగించడంతో తమ బాధ్యత ముగిసిపోదని, ఆ ఇళ్లలో నివసించే వారికి ఏళ్ల తరబడి మంచి అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఇదీ చదవండి: భారత రియల్ ఎస్టేట్‌లో విదేశీ పెట్టుబడుల జోరు
