General

భారత్ లో కమర్షియల్ మార్కెట్ జోరు

భారత్ లో కమర్షియల్ మార్కెట్ జోరు
  • కొత్త బిజినెస్‌ కారిడార్ల వైపు వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌

భారత్‌లో వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఇప్పటివరకు బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ వంటి సంప్రదాయ వాణిజ్య కేంద్రాలకే పరిమితమైన డిమాండ్‌.. ఇప్పుడు కొత్త బిజినెస్‌ కారిడార్లు, గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, రిటైల్‌, మౌలిక వసతుల అభివృద్ధి కారణంగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. 2026 ప్రథమార్థంలో దేశవ్యాప్తంగా ఆఫీస్‌ స్పేస్‌ శోషణ రికార్డు స్థాయిలో 45.5 మిలియన్‌ చదరపు అడుగులకు చేరినట్లు సీబీఆర్ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2026 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ సుమారు 24.6 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది.

త్రైమాసిక ప్రాతిపదికన ఇది 18 శాతం, ఏడాది ప్రాతిపదికన 14 శాతం వృద్ధి. ఇదే సమయంలో కొత్తగా 21 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ పూర్తయింది. జనవరి–జూన్‌ మధ్య మొత్తం కొత్త సరఫరా 32 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది. మరోవైపు కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ గణాంకాల ప్రకారం 2026 ప్రథమార్థంలో దేశవ్యాప్తంగా ఆఫీస్‌ లీజింగ్‌ సుమారు 43 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 5 శాతం వృద్ధి కనిపించింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కొత్త కారిడార్లు

కొత్త బిజినెస్‌ కారిడార్ల అభివృద్ధికి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ముఖ్య ఉదాహరణగా నిలుస్తోంది. గురుగ్రామ్‌, నోయిడా, గ్రేటర్‌ నోయిడా, యమునా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, జీసీసీలు, డేటా సెంటర్లు, కొత్త రవాణా మార్గాలు వాణిజ్య కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. 2026 తొలి త్రైమాసికంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 2.8 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ లీజింగ్‌ నమోదైంది. ఇందులో గురుగ్రామ్‌ 60 శాతం, నోయిడా 37 శాతం వాటా కలిగి ఉన్నాయి. నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే ప్రధాన మైక్రో-మార్కెట్‌గా నిలిచింది.

 అలాగే క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డిజిటల్‌ సేవల విస్తరణతో డేటా సెంటర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. కేవలం ఆఫీస్‌ స్పేస్‌కే పరిమితం కాకుండా రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌ కూడా వృద్ధి చెందుతోంది. సీబీఆర్ఈ ప్రకారం 2026 మొదటి ఆరునెలల్లో దేశవ్యాప్తంగా రిటైల్‌ లీజింగ్‌ 3.9 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది. ఇది ఏడాది ప్రాతిపదికన 20 శాతం వృద్ధి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, హైదరాబాద్‌, ముంబయి వంటి మార్కెట్లు రిటైల్‌ డిమాండ్‌లో ముందున్నాయి.

హైదరాబాద్‌కు కూడా ప్రాధాన్యం

దక్షిణ భారతదేశంలో బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై వంటి నగరాలు టెక్నాలజీ, జీసీసీ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో హైటెక్ సిటీ–గచ్చిబౌలి బెల్ట్‌తో పాటు కొత్త ప్రాంతాలకు వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. జాతీయ స్థాయిలో రిటైల్‌ లీజింగ్‌లోనూ హైదరాబాద్‌ ప్రధాన మార్కెట్లలో ఒకటిగా ఉంది. మొత్తంగా చూస్తే భారత వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఒక్కో నగరంలోని సంప్రదాయ ప్రాంతాల నుంచి కొత్త బిజినెస్‌ కారిడార్ల వైపు విస్తరిస్తోంది. అంటే.. భారత్‌లో కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ వృద్ధి ఇక పాత బిజినెస్‌ హబ్‌లకే పరిమితం కాకుండా, కొత్త మౌలిక వసతుల చుట్టూ ఏర్పడుతున్న బిజినెస్‌ కారిడార్లకు విస్తరిస్తోంది.