General

లోగో కాదు.. లైఫ్‌స్టైల్‌ ముఖ్యం

లోగో కాదు.. లైఫ్‌స్టైల్‌ ముఖ్యం

-      బ్రాండెడ్‌ రెసిడెన్సులకు పెరుగుతున్న డిమాండ్‌

-      జీవనశైలి, లభించే సేవలే ప్రాధాన్యం

దేశంలోని లగ్జరీ హౌసింగ్‌ మార్కెట్‌లో బ్రాండెడ్‌ రెసిడెన్సెస్‌ ప్రత్యేక విభాగంగా వేగంగా ఎదుగుతున్నాయి. గతంలో లగ్జరీ ఇల్లంటే ఖరీదైన మార్బుల్‌, ప్రీమియం ఫిట్టింగ్స్‌, విశాలమైన గదులు, విలాసవంతమైన సౌకర్యాలుగా భావించేవారు. ఇప్పుడు కొనుగోలుదారుల ఆలోచన మారుతోంది. ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత ఎలాంటి జీవనశైలి, సేవలు, అనుభవం, నిర్వహణ, దీర్ఘకాలిక విలువ లభిస్తాయి? అన్నదే కీలకంగా మారుతోంది.

బ్రాండెడ్‌ రెసిడెన్సెస్‌ అంటే కేవలం ఒక ప్రముఖ హోటల్‌, ఫ్యాషన్‌, లగ్జరీ లేదా లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ పేరును భవనానికి జోడించడం కాదని అంటున్నారు. హాస్పిటాలిటీ ప్రమాణాలను ఇంటి జీవనంలోకి తీసుకురావడం ఈ కాన్సెప్ట్‌లో ప్రధాన అంశమని పేర్కొంటున్నారు. అంటే నివాసితులకు హోటల్‌లో లభించే తరహాలో కన్సియర్జ్‌, హౌస్‌కీపింగ్‌, ప్రత్యేక సేవలు, ఆహారం, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన సౌకర్యాలు వంటి సేవలు అందించడం. అయితే వీటి కోసం ఎంత ఖర్చవుతుంది? నిర్వహణ ఎలా ఉంటుంది? సేవలు ఎప్పటికీ కొనసాగుతాయా? వంటి అంశాలను కొనుగోలుదారులు ఇప్పుడు ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారు.

మార్బుల్‌ నుంచి సేవల వరకు..

గతంలో లగ్జరీ ఇంటిని ఎంపిక చేసేటప్పుడు మార్బుల్‌, స్టోన్‌, ఫిట్టింగ్స్‌, ఇంటీరియర్స్‌ వంటి వాటి నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు వాటితో పాటు ఇంట్లో నివసించిన తర్వాత లభించే అనుభవాన్నీ కొనుగోలుదారులు పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టులోని సౌకర్యాలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయన్నదే కాకుండా వాటి నిర్వహణ ఎలా జరుగుతుంది? సిబ్బంది సేవల ప్రమాణం ఎలా ఉంటుంది? మరమ్మతులు, నిర్వహణకు ఎంత ఖర్చవుతుంది? వంటి ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. దీంతో ‘లగ్జరీ’ అనేది నిర్మాణంలో ఉపయోగించిన వస్తువుల విలువ కంటే, నివాస అనుభవం విలువగా మారుతోంది. బ్రాండెడ్‌ రెసిడెన్సెస్‌లో ముఖ్యమైన అంశం పునరావృత నిర్వహణ వ్యయం.

ప్రీమియం జీవనశైలికి సంబంధించిన సేవలను అందించాలంటే వాటి నిర్వహణకు కూడా నిరంతర ఖర్చు ఉంటుంది. క్యూరేటెడ్‌ ఫుడ్‌ మెనూలు, వ్యక్తిగత సేవలు, దీర్ఘకాలిక మరమ్మతుల ఏర్పాట్లు, సింకింగ్‌ ఫండ్‌ వంటి అంశాలు ఇప్పుడు ప్రాజెక్టు రూపకల్పనలోనే చర్చకు వస్తున్నాయి. అందువల్ల కొనుగోలుదారు ఇంటి ధరతో పాటు ఏటా లేదా నెలవారీగా చెల్లించాల్సిన నిర్వహణ వ్యయం ఎంత? అన్నదీ లెక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఆ ప్రాజెక్టుకు ప్రముఖ బ్రాండ్‌ పేరున్నంత మాత్రాన అది మంచి ప్రాజెక్టు అయిపోదని, నివాసితులకు వాస్తవంగా విలువనిచ్చేలా డిజైన్‌, నిర్మాణ నాణ్యత, సేవలు ఉండాలని ఎక్కువమంది కోరుకుంటున్నారు.

అంతర్జాతీయ బ్రాండ్లకు భారత మార్కెట్‌పై ఆసక్తి

ప్రపంచవ్యాప్తంగా బ్రాండెడ్‌ రెసిడెన్సెస్‌ మార్కెట్‌లో దుబాయ్‌, చైనా ముందంజలో ఉన్నాయి. భారత్‌ ఇంకా ఈ మార్కెట్‌లో ప్రారంభ దశలో ఉన్నప్పటికీ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, గురుగ్రామ్‌ వంటి సంపన్న ప్రాంతాలతో పాటు రెండో శ్రేణి నగరాల్లోనూ అధిక ఆదాయ వర్గాలు, ఆశావహ కొనుగోలుదారుల నుంచి డిమాండ్‌ పెరుగుతోందని నిపుణులు తెలిపారు. భారత్‌లో అంతర్జాతీయ హాస్పిటాలిటీ పేర్లతో పాటు స్థానిక డెవలపర్లకు కూడా అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక డెవలపర్లపై కొనుగోలుదారులకు ఎక్కువ నమ్మకం, పరిచయం ఉండటం ఇందుకు కారణం.

‘ఇంట్లో ఎలా జీవిస్తాం?’ అన్నదే కీలకం

ఈ విభాగంలో వస్తున్న ప్రధాన మార్పును నిపుణులు ఒక మాటలో వివరిస్తున్నారు. గతంలో కొనుగోలుదారులు “నేను ఏమి కొంటున్నాను?” అని అడిగేవారు. ఇప్పుడు “కొన్న తర్వాత నేను ఎలా జీవిస్తాను?” అని ఆలోచిస్తున్నారు. అందుకే రెండో ఇల్లు, మెంబర్‌షిప్‌ ఆధారిత జీవన విధానాలు, వెల్‌నెస్‌ కమ్యూనిటీలు, హాస్పిటాలిటీ ఆధారిత నివాసాలు వంటి కొత్త కాన్సెప్టులు పెరుగుతున్నాయి. ఇంటి విలువను కేవలం చదరపు అడుగుల విస్తీర్ణంతో కాకుండా అందించే అనుభవం, సౌకర్యం, సేవలు, సామాజిక వాతావరణం ఆధారంగా అంచనా వేయడం మొదలైంది.

అంతర్జాతీయ బ్రాండ్‌ ప్రమాణాలను యథాతథంగా భారత్‌లో అమలు చేయడం సరిపోదని నిపుణులు చెబుతున్నారు. భారతీయ కుటుంబాల జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. పెద్ద కుటుంబ సమావేశాలు, పండుగలు, వంటగది అవసరాలు, ఇంట్లో పనిచేసే సిబ్బంది, రోజువారీ కుటుంబ కార్యకలాపాలు వంటి అంశాలను కూడా డిజైన్‌లో పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ప్రపంచస్థాయి బ్రాండ్‌ ప్రమాణాలతో పాటు స్థానిక జీవనశైలికి అనుగుణమైన డిజైన్‌ కూడా అవసరం. ఈ సమతుల్యత సాధించిన ప్రాజెక్టులకే దీర్ఘకాలిక విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.