- రియల్టర్‌కు వినియోగదారుల కమిషన్ ఆదేశం
ఇళ్ల కొనుగోలు కోసం భారీ మొత్తాలు చెల్లించినప్పటికీ, ఒప్పందం ప్రకారం ఫ్లాట్లను అప్పగించడంలో జాప్యం లేదా ఇతర లోపాలు ఎదురైతే బిల్డర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని మరోసారి స్పష్టమైంది. ఇద్దరు గృహ కొనుగోలుదారులకు కలిపి రూ.1.95 కోట్లను తిరిగి చెల్లించాలని ముంబై రియల్టీ సంస్థను మహారాష్ట్ర రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే..
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన ఇద్దరు కొనుగోలుదారులు ముంబైలోని దాదర్ ఈస్ట్‌లో ఉన్న ‘టూ ఐసీసీ’ ప్రాజెక్టులో 1,941 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి అదనంగా రెండు కార్ పార్కింగ్ స్థలాలను కూడా బుక్ చేసుకున్నారు.
ఫ్లాట్, పార్కింగ్ స్థలాల మొత్తం విలువ రూ.9.94 కోట్లుగా ఒప్పందం కుదిరింది. 2014 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కొనుగోలుదారులకు అలాట్‌మెంట్ లెటర్ జారీ చేశారు. 30:70 చెల్లింపుల విధానంలో భాగంగా వారు తొలుత రూ.25 లక్షలు బుకింగ్ మొత్తంగా చెల్లించారు.
ఆ తర్వాత విడతల వారీగా మొత్తం రూ.1.95 కోట్లు చెల్లించారు. అయితే, కొనుగోలుదారులు తమ వాయిదాలను సకాలంలో చెల్లించినప్పటికీ నిర్మాణ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాలేదని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏడాదికి పైగా జాప్యం జరిగిందని పేర్కొన్నారు.
నిర్మాణంలో జాప్యం నేపథ్యంలో చెల్లింపుల విధానాన్ని మార్చాలని కొనుగోలుదారులు కోరారు. తొలుత కుదిరిన 30:70 చెల్లింపుల పద్ధతికి బదులుగా నిర్మాణ పురోగతికి అనుగుణంగా వాయిదాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు.
ఈ విషయంపై చర్చలు జరుగుతున్న సమయంలోనూ పాత చెల్లింపుల విధానం ప్రకారమే డెవలపర్లు డబ్బులు చెల్లించాలని స్పష్టంచేశారు. ఈ క్రమంలో 2016 సెప్టెంబర్‌లో డెవలపర్లు ప్రీ-టెర్మినేషన్ నోటీసు జారీ చేశారు. బకాయిలు చెల్లించకపోతే ఫ్లాట్ కేటాయింపును రద్దు చేసి, అప్పటికే చెల్లించిన మొత్తాన్ని జప్తు చేస్తామని పేర్కొన్నారు.
దీంతో అదే ఏడాది అక్టోబర్‌లో ఫ్లాట్ బుకింగ్‌ను రద్దు చేసుకున్నారు. తాము చెల్లించిన రూ.1.95 కోట్లను తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే, డబ్బులు తిరిగి చెల్లించకుండా డెవలపర్లు మరిన్ని చెల్లింపుల కోసం డిమాండ్లు పంపడంతో కొనుగోలుదారులు న్యాయపోరాటానికి దిగారు.
ఇదీ చదవండి: తాత ఆస్తిలో మనవడికి జన్మహక్కు ఉండదు
వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయం
ఈ వివాదంపై కొనుగోలుదారులు తొలుత క్రిమినల్ చర్యలను ఆశ్రయించారు. అయితే, జార్ఖండ్ హైకోర్టు ఆ క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేసింది. అనంతరం సుప్రీంకోర్టులోనూ వారికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, డబ్బుల వసూలు కోసం సివిల్ న్యాయపరమైన పరిష్కారాలను ఆశ్రయించే హక్కు వారికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు మహారాష్ట్ర రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. 2016లోనే వివాదం మొదలైనందున, వినియోగదారుల ఫిర్యాదు దాఖలు చేయడానికి గడువు ముగిసిపోయిందని డెవలపర్లు వాదించారు.
అయితే, ఈ వాదనను వినియోగదారుల కమిషన్ అంగీకరించలేదు. 2022 జనవరిలోనూ డెవలపర్లు కొత్తగా చెల్లింపుల డిమాండ్ లేఖను జారీ చేశారని గుర్తుచేసింది. దీనివల్ల కొనుగోలుదారులతో లావాదేవీ కొనసాగుతున్నట్లు డెవలపర్లే అంగీకరించినట్లయిందని పేర్కొంది. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం ఫిర్యాదుపై విచారణ జరిపి వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
కొనుగోలుదారులు చెల్లించిన రూ.1.95 కోట్ల అసలు మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని, ప్రతి విడతగా డబ్బు చెల్లించిన తేదీ నుంచి తిరిగి చెల్లించే వరకు ఏడాదికి 9 శాతం వడ్డీ చెల్లించాలని, మానసిక వేదన, వేధింపులు, సేవల్లో లోపాలకు పరిహారంగా రూ.1 లక్ష చెల్లించాలని, న్యాయపరమైన ఖర్చుల కింద మరో రూ.50 వేలు చెల్లించాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: రూ.50 లక్షలు దాటిన ఆస్తుల కొనుగోలుపై టీడీఎస్ జాగ్రత్తలు
