- పిత్రార్జిత ఆస్తి విభజనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- తండ్రి వాటాపై పూర్తి అధికారం ఆయనదే
తాత నుంచి తండ్రికి సంక్రమించిన ఆస్తిలో మనవడికి పుట్టుకతోనే హక్కు లభించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాత మరణించిన తర్వాత ఆయన ఆస్తి హిందూ వారసత్వ చట్టం-1956లోని సెక్షన్ 8 ప్రకారం మొదటి తరగతి వారసులకు సంక్రమించి, అనంతరం విభజన జరిగితే.. తండ్రికి వచ్చిన వాటా ఆయన వ్యక్తిగత ఆస్తిగా మారుతుందని తేల్చిచెప్పింది. అందులో తనకూ వాటా ఉందంటూ మనవడు హక్కు కోరలేడని స్పష్టం చేసింది.
జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సునీతా అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం నవంబరు 6న ఈ మేరకు తీర్పు వెలువరించింది. 29 ఏళ్లుగా కొనసాగుతున్న ఆస్తి వివాదానికి ముగింపు పలుకుతూ అప్పీల్‌ను కొట్టివేసింది.
అసలు వివాదం ఏమిటంటే..
చెన్నైకి చెందిన 1,811 చదరపు అడుగుల స్థలం విషయంలో ఈ వివాదం తలెత్తింది. ఆ ఆస్తి మొదట తాత ఎన్. రామకృష్ణన్‌కు చెందినది. ఆయన మరణం తర్వాత వారసుల మధ్య ఆస్తి పంపకాల కోసం 1993లో ఆయన కుమార్తె కోర్టును ఆశ్రయించారు. 1994 ఫిబ్రవరి 3న కుదిరిన రాజీ ఒప్పందం ప్రకారం తాత కుమారుడైన మనవడి తండ్రికి 1,811 చదరపు అడుగుల స్థలం దక్కింది. ఆ తర్వాత 1997లో ఆయన ఆ స్థలాన్ని ఇద్దరికి విక్రయించారు.
అయితే తన తండ్రికి వచ్చిన ఆస్తిలో సగం వాటా తనకూ ఉందంటూ మనవడు కోర్టును ఆశ్రయించాడు. తాత ఆస్తి కావడంతో పుట్టుకతోనే తనకు సహవారసత్వ హక్కు (కోపార్సెనరీ రైట్) సంక్రమించిందని వాదించాడు. అప్పటికి అతడు మైనర్ కావడంతో తల్లి సంరక్షకురాలిగా కేసు దాఖలు చేశారు. ఈ వివాదం వివిధ కోర్టుల మీదుగా సుప్రీంకోర్టుకు చేరింది.
ఇదీ చదవండి: 'రూ.1.95 కోట్లు తిరిగిచ్చేయండి'
సెక్షన్ 8 ఏం చెబుతోంది?
హిందూ వారసత్వ చట్టం ప్రకారం వీలునామా రాయకుండా ఒక హిందూ పురుషుడు మరణిస్తే, ఆయన ఆస్తి మొదట క్లాస్-1 వారసులకు సంక్రమిస్తుంది. ఇందులో భార్య, కుమారుడు, కుమార్తె, తల్లి తదితరులకు సమాన ప్రాధాన్యంతో వాటాలు లభిస్తాయి. తండ్రి బతికుండి వారసత్వంగా ఆస్తి పొందిన సందర్భంలో మనవడు తాతకు నేరుగా క్లాస్-1 వారసుడు కాడు. ఈ కేసులో తాత ఆస్తి వారసులకు విభజన కావడంతో ఉమ్మడి కుటుంబ ఆస్తి స్వరూపం ముగిసిందని సుప్రీంకోర్టు పేర్కొంది.
తండ్రికి వచ్చిన వాటా ఆయన వ్యక్తిగత ఆస్తిగా మారిందని, దానిపై కుమారుడికి జన్మహక్కు ఉండదని స్పష్టం చేసింది. తండ్రి ఆస్తిని విక్రయించినా, ఇతరులకు బదలాయించినా కుమారుడు కేవలం జన్మహక్కు ఆధారంగా అభ్యంతరం చెప్పలేడని తీర్పు సారాంశం.
ఆస్తుల పంపకాల్లో కీలకమైన తేడా
ఈ తీర్పు ప్రతి పిత్రార్జిత ఆస్తికీ వర్తిస్తుందని భావించకూడదు. చట్టబద్ధంగా ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిగా కొనసాగుతున్న కోపార్సెనరీ ఆస్తిలో కుమారుడు, కుమార్తెకు జన్మహక్కులు ఉండవచ్చు. అయితే వారసత్వ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం తండ్రికి వ్యక్తిగతంగా సంక్రమించి, విభజన ద్వారా ఆయనకు ప్రత్యేకంగా కేటాయించిన ఆస్తి విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది.
అందువల్ల ఆస్తి కొనుగోలు చేసేవారు, వారసత్వంగా ఆస్తులు పొందేవారు వాటి మూలం, విభజన పత్రాలు, వారసత్వ హక్కులు, రిజిస్ట్రేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆస్తి తాత నుంచి వచ్చిందన్న ఒక్క కారణంతోనే మనవడికి అందులో వాటా ఉంటుందని నిర్ధారించలేమని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి: బకాయిలు చెల్లించని బయ్యర్‌కి పరిహారం నిరాకరణ
