General

హైదరాబాద్‌లో పీఆర్‌టీఎస్ ఏర్పాటుకు ప్ర‌ణాళిక‌లు

హైదరాబాద్‌లో పీఆర్‌టీఎస్ ఏర్పాటుకు ప్ర‌ణాళిక‌లు

    హైదరాబాద్: జంటనగరాల్లో పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలు, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్టీఎస్‌) ఏర్పాటుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

    బుధ‌వారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీనియర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో హైదరాబాద్‌లో పీఆర్‌టీఎస్‌ అమలుకు సంబంధించిన ప్రతిపాదనలపై సి.ఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు.

    మొదటి దశలో కూకట్‌పల్లి, రాయదుర్గం, బయోడైవర్సిటీ  మీదుగా నాలెడ్జ్ సిటీ వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర 64 స్టేషన్లతో పీఆర్‌టీఎస్‌ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

    ప్రస్తుతం జంట నగరాల్లో ఉన్న ప్రజా రద్దీని దృష్టిలో పెట్టుకొని పీఆర్‌టీఎస్‌, జీఆర్టీఎస్ వంటి రవాణా వ్యవస్థల్ని ప్రారంభించేందుకు హెచ్ఎంఆర్ఎల్‌  అధ్యయనం చేసింది. 2030 నాటికి రోజుకు 3.94 లక్షలు, 2040 నాటికి 7.96 లక్షలు, 2050 నాటికి 10 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు ఉంటాయని హెచ్ఎంఆర్ఎల్‌ అంచనా వేసినట్లు తెలిపారు.

    ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, నగరంలోని అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలను గుర్తించి, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మార్గాలను ఎంపిక చేయాలని సూచించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న రవాణా మౌలిక సదుపాయాలను గరిష్టంగా వినియోగించుకుంటూ, కనీస వ్యయంతో ప్రాజెక్టును చేపట్టే అవకాశాలను పరిశీలించాలన్నారు.

    ప్రాజెక్టు రూపకల్పనలో అన్ని భాగస్వామ్య సంస్థల నుంచి అవసరమైన సూచనలు, సాంకేతిక అభిప్రాయాలను వీలైనంత త్వరగా సేకరించాలని హెచ్ఎంఆర్ఎల్‌ అధికారులను సి.ఎస్ ఆదేశించారు. 

    ఇదీ చదవండి: రాజేంద్రనగర్‌లో తక్కువ సాంద్రతతో లగ్జరీ విల్లా కమ్యూనిటీ

    సమగ్ర రవాణా వ్యవస్థ అభివృద్ధి

    పీఆర్‌టీఎస్‌తో పాటు జీఆర్‌టీ (గ్రూప్ ర్యాపిడ్ ట్రాన్సిట్‌), మెట్రో రైలు, ఆర్టీసీ తదితర ప్రస్తుత ప్రజా రవాణా వ్యవస్థలను సమన్వయం చేస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగరంలో సమగ్ర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు.

    ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర రూట్ మ్యాప్, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని, జీహెచ్ఎంసీ, సీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్లు, టీజీఎస్పీడీసీఎల్‌, హెచ్ఎండీఏ, పోలీస్ శాఖ, దక్షిణ మధ్య రైల్వే, జ‌ల‌మండ‌లి, ఆర్టీసీ, హైడ్రా తదితర సంబంధిత శాఖలు, సంస్థలను భాగస్వాములుగా ఉన్నందున దీనికి సంబంధించి తగు ప్రతిపాదనలను హెచ్ఎంఆర్ఎల్‌ సమర్పించాలని సిఎస్ ఆదేశించారు.

    హైదరాబాద్ నగర భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ రవాణా మార్గాల మధ్య అనుసంధానం, ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా, వ్యయ నియంత్రణకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు.

    హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, సలహాదారు (అర్బ‌న్ ట్రాన్స్‌పోర్ట్‌) ఎన్.వి.ఎస్. రెడ్డి, రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి ఇల్లంబర్తి, హెచ్‌ఎం‌ఆర్‌ఎల్ అదనపు ఎండీ అజిత్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, సీఎంసీ కమిషనర్ సృజన, టీజీఎస్ఆర్టీసీ వీసీ & ఎండీ అనిల్ కుమార్, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), హైదరాబాద్, జోయెల్ డేవిస్, దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొన్నారు.

    ఇదీ చదవండి: నీటి కొర‌త‌ ఏర్ప‌డే న‌గ‌రంలో పెట్టుబ‌డుల్ని పెట్టేదెవ‌రు?