హైదరాబాద్లో ఆకాశహర్మ్యాల నిర్మాణం జోరు
2025లో దాదాపు 200 భారీ భవనాలకు అనుమతులు
2024లో 100.. 2025లో
197 ఆకాశహర్మ్యాలకు అనుమతులు
*
జీహెచ్ఎంసీ పరిధిలో
103 భవనాలకు అనుమతులు
హెచ్ఎండీఏ పరిధిలో మరో 94
భారీ భవనాలకు అనుమతులు
2025 జనవరి–సెప్టెంబర్‌లో
హెచ్ఎండీఏకు 3,677 కొత్త దరఖాస్తులు
*
హెచ్ఎండీఏ పరిధిలో 77 బహుళ అంతస్తుల
ప్రాజెక్టులకు అనుమతులు
ఉస్మాన్‌నగర్‌లో 70 అంతస్తుల
భవనానికి అనుమతి..
కోకాపేటలో 60 అంతస్తులకు
పైగా భారీ నిర్మాణాలు
*
భూముల ధరలు, ఐటీ విస్తరణతో
పెరుగుతున్న హై-రైజ్ నిర్మాణాలు
ఆకాశహర్మ్యాలతో పెరుగుతున్న
ట్రాఫిక్, నీటి సరఫరా సవాళ్లు
2030 నాటికి మరింత మారనున్న హైదరాబాద్ స్కైలైన్
ఒకప్పుడు విశాలమైన భవనాలకు కేరాఫ్‌గా ఉన్న భాగ్యనగరం.. ఇప్పుడు ఆకాశహర్మ్యాలతో సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. కోకాపేట నుంచి నియోపోలిస్ వరకు.. ఎటు చూసినా ఎత్తైన భవనాలే. 2025లో దాదాపు 200 భారీ భవనాలకు అనుమతులు లభించాయంటే.. హైదరాబాద్‌లో నిర్మాణ రంగం ఏ స్థాయిలో దూసుకెళ్తోందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ స్కైస్క్రాపర్ల వెనుక ఉన్న అసలు కథేంటి? ఫ్లాట్ల ధరలు ఎంత పెరిగాయి? సామాన్యులకు ఈ ఆకాశహర్మ్యాల్లో ఇల్లు కొనడం సాధ్యమేనా?
హైదరాబాద్ రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు తక్కువ అంతస్తుల భవనాలతో కనిపించిన నగరం.. ఇప్పుడు ఆకాశాన్ని తాకే నిర్మాణాలతో కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. కోకాపేట, నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడ, తెల్లాపూర్ ప్రాంతాల్లో భారీ నివాస సముదాయాలు వెలుస్తున్నాయి. 2025లో హైదరాబాద్ పరిధిలో దాదాపు 200 ఎత్తైన భవనాలకు అనుమతులు లభించాయి. 2024లో ఈ సంఖ్య సుమారు 100గా ఉండటం గమనార్హం.
భూముల ధరలు, ఐటీ రంగం విస్తరణ, లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్‌తో నగరం నిలువుగా విస్తరిస్తోంది. హైదరాబాద్‌లో ఎత్తైన భవనాల నిర్మాణానికి సంబంధించి 2025లో అనుమతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో 2025లో 103 ఎత్తైన భవనాలకు అనుమతులు లభించాయి. 2024లో ఈ సంఖ్య 64గా ఉంది. ఇక జీహెచ్ఎంసీ వెలుపల హెచ్ఎండీఏ పరిధిలో మరో 94 భారీ భవనాలకు అనుమతులు లభించాయి. రెండు పరిధుల్లో కలిపి 197 ఎత్తైన భవనాలకు అనుమతులు లభించినట్లు లెక్కలు చెబుతున్నాయి.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోనూ నిర్మాణ అనుమతుల జోరు పెరిగింది. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు హెచ్ఎండీఏకు 3,677 కొత్త దరఖాస్తులు అందాయి. వాటిలో 2,887 దరఖాస్తులకు అనుమతులు లభించినట్లు సమాచారం. ఇదే కాలంలో మొత్తం 6,079 దరఖాస్తులను పరిష్కరించారు. 2,904 భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేశారు. మరో కీలక అంశం ఏంటంటే.. బహుళ అంతస్తుల భవనాల విభాగంలో 77 ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. ఈ ప్రాజెక్టుల నిర్మిత విస్తీర్ణం 78.71 లక్షల చదరపు మీటర్లుగా నమోదైంది.
హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాల నిర్మాణం మరో స్థాయికి చేరుతోంది. 50 అంతస్తుల భవనాల నుంచి ఇప్పుడు 60, 70 అంతస్తుల భారీ నిర్మాణాల దిశగా అడుగులు పడుతున్నాయి. 2025లో అనుమతులు పొందిన ప్రాజెక్టుల్లో ఉస్మాన్‌నగర్‌లో 70 అంతస్తుల భవనం.. కోకాపేటలో 60 అంతస్తులకు పైగా ఉండే భవనాలు ఉన్నాయి. మరోవైపు కోకాపేటలోని సాస్ క్రౌన్ సుమారు 235 మీటర్ల ఎత్తు.. 58 అంతస్తులతో ప్రత్యేక గుర్తింపు పొందింది. పుప్పాలగూడలో క్యాండియర్ స్కైలైన్ వంటి భారీ ప్రాజెక్టులు కూడా నగర స్కైలైన్‌ను మార్చుతున్నాయి.
పశ్చిమ హైదరాబాద్‌లో భూముల ధరలు పెరుగుతుండటంతో నిర్మాణ సంస్థలు కొత్త వ్యూహాల్ని అనుసరిస్తున్నాయి. కోకాపేట, నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో భూములకు డిమాండ్ పెరగడంతో.. ఒకే స్థలంలో ఎక్కువ ఫ్లాట్లు నిర్మించేలా ఎత్తైన భవనాలపై దృష్టి సారిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు, ఉన్నత ఆదాయ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్‌తో ప్రీమియం ప్రాజెక్టులు పుట్టుకొస్తున్నాయి. క్లబ్‌హౌస్‌లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, కో-వర్కింగ్ స్పేస్‌లు.. ఇలా అత్యాధునిక సదుపాయాలతో కొత్త తరహా జీవనశైలిని అందిస్తున్నాయి. ఆకాశహర్మ్యాల్లో ఇల్లు కొనాలంటే సామాన్యులకు అంత సులభం కాదు.
పశ్చిమ హైదరాబాద్‌లోని ప్రీమియం ప్రాజెక్టుల్లో చదరపు అడుగుకు 10 వేలకుపైగా ధరలు పలుకుతున్నాయి. కొన్ని లగ్జరీ ప్రాజెక్టుల్లో ఈ ధర 15 వేల నుంచి 20 వేల వరకు ఉంటోంది. ఒక 2,000 చదరపు అడుగుల ఫ్లాట్ ధర చదరపు అడుగుకు 12 వేలు అనుకుంటే.. మొత్తం ధర 2 కోట్ల 40 లక్షలు. ఇక నిర్వహణ ఛార్జీలు కూడా అదనపు భారంగా మారుతున్నాయి. చదరపు అడుగుకు నెలకు 6 చొప్పున వసూలు చేస్తే.. 2,000 చదరపు అడుగుల ఫ్లాట్‌కు నెలకు 12 వేలు.. ఏడాదికి 1.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
