హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు మరో ఆధునిక రవాణా వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. మెట్రో రైలు స్టేషన్లకు అనుసంధానంగా పాడ్ కార్లను నడిపేందుకు ప్రతిపాదించిన పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్‌టీఎస్)పై అధ్యయనం కొనసాగుతోంది.
ఈ ప్రాజెక్టు కోసం డిపోల ఏర్పాటుకు ఏకంగా 185 ఎకరాల భూమి అవసరమని అధ్యయన సంస్థ గుర్తించింది. కూకట్‌పల్లి నుంచి హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఐటీ కారిడార్‌లోనూ, మరోవైపు నగరంలోని కీలక ప్రాంతాల్లోనూ ఈ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు.
కూకట్‌పల్లిలో..
పీఆర్‌టీఎస్ కారిడార్-1లో భాగంగా కూకట్‌పల్లిలోనే 104.8 ఎకరాలు అవసరమని గుర్తించారు. హైటెక్‌సిటీలో రెండు ప్రాంతాల్లో కలిపి 32.5 ఎకరాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మూడు ప్రాంతాల్లో కలిపి 43.2 ఎకరాలు కావాలని ప్రతిపాదించారు. ఇక రెండో ప్రాంతంలో పీపుల్స్ ప్లాజా, బతుకమ్మ ఘాట్, సంజీవయ్య పార్క్, రాణిగంజ్ బస్ డిపో పరిసరాల్లోనూ పీఆర్‌టీఎస్ డిపోల కోసం స్థలాలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో అవసరమైన భూములను వివిధ ప్రభుత్వ సంస్థలు కలిగి ఉండటంతో, వాటి కేటాయింపుపై హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఆయా విభాగాలకు లేఖలు రాయనుంది.
ఐటీ కారిడార్ చుట్టూ నెట్‌వర్క్
పీఆర్‌టీఎస్ తొలి అధ్యయన ప్రాంతాన్ని మూడు జోన్లుగా విభజించారు.
- జోన్-1: కూకట్‌పల్లి నుంచి రాయదుర్గం వరకు 7.62 కిలోమీటర్లు
- జోన్-2: రాయదుర్గం, హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్లు, నాలెడ్జ్ సిటీ పరిసరాల్లో 12.83 కిలోమీటర్లు
- జోన్-3: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో 14.01 కిలోమీటర్లు
ఈ మూడు జోన్లలో మొత్తం పది టర్మినల్ స్టేషన్లను ప్రతిపాదించారు. కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ, దుర్గం చెరువు, రాయదుర్గం మెట్రో స్టేషన్లతో పాటు హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్‌కు అనుసంధానం కల్పించనున్నారు.
భవిష్యత్తులో మెట్రో విస్తరణను దృష్టిలో ఉంచుకుని నానక్‌రాంగూడ, విప్రో సర్కిల్, బయోడైవర్సిటీ, ఇందిరానగర్/రాడిసన్ జంక్షన్, యూఎస్ కాన్సులేట్ పరిసరాల్లోనూ స్టేషన్ల ఏర్పాటును పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: ఐటీ, రెసిడెన్షియల్.. గ్రోత్ ఇంజిన్.. గోపనపల్లి
సచివాలయం నుంచి సికింద్రాబాద్ దాకా
రెండో అధ్యయన ప్రాంతంలో సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, సికింద్రాబాద్ వెస్ట్, బేగంపేట మెట్రో స్టేషన్లతో పాటు ఇక్బాల్ మినార్ జంక్షన్, సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్ ఎంఎంటీఎస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ రెండు అధ్యయన ప్రాంతాలు సుమారు 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఐటీ ఉద్యోగులు, మెట్రో ప్రయాణికులు, కీలక వాణిజ్య ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.
1.14 లక్షల మంది ప్రయాణం
పీఆర్‌టీఎస్ నెట్‌వర్క్‌లో ప్రయాణికుల సంఖ్య భవిష్యత్తులో గణనీయంగా పెరుగుతుందని అధ్యయన సంస్థ అంచనా వేసింది.
- 2030 నాటికి: రోజుకు 75 వేల మంది
- 2040 నాటికి: రోజుకు 96 వేల మంది
- 2050 నాటికి: రోజుకు 1.14 లక్షల మంది
ఈ రెండు ప్రాంతాల్లో ప్రస్తుతం 10.86 లక్షల మంది నివసిస్తుండగా, 2050 నాటికి జనాభా 20.88 లక్షలకు చేరవచ్చని అంచనా. ప్రస్తుతం 8.37 లక్షల మంది ఉపాధి పొందుతున్న ఈ ప్రాంతాల్లో, 2050 నాటికి ఉద్యోగుల సంఖ్య 17.08 లక్షలకు పెరగవచ్చని అధ్యయనం పేర్కొంటోంది.
పెద్ద వాహనాలకూ అవకాశం
పీఆర్‌టీఎస్‌లో ఒక్కో పాడ్ కారులో నలుగురి నుంచి ఆరుగురు వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే భవిష్యత్తులో రద్దీ పెరిగితే ప్రయాణికులను ఎలా చేరవేయాలన్న ప్రశ్నకు కూడా అధ్యయన సంస్థ ప్రత్యామ్నాయాన్ని సూచించింది. అవసరాన్ని బట్టి 20 నుంచి 25 మంది ప్రయాణించగలిగే గ్రూప్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (జీఆర్‌టీఎస్)ను కూడా ప్రవేశపెట్టవచ్చని తెలిపింది. మొత్తంగా, హైదరాబాద్‌లో మెట్రోకు అనుబంధంగా పాడ్ కార్ల వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలో భూసేకరణ, డిపోల ఏర్పాటు కీలకంగా మారనున్నాయి.
ఇదీ చదవండి: మైవాన్ టెక్నాలజీ.. నిర్మాణం ఫాస్ట్! నివసించడానికి ఎంత కంఫర్ట్?
