General

కమర్షియల్ స్పేస్ కొన్న సలీమ్ మర్చంట్

కమర్షియల్ స్పేస్ కొన్న సలీమ్ మర్చంట్
  • ముంబైలో రూ.12.85 కోట్లకు కొనుగోలు
  • నలుగురితో కలిసి కొన్న సంగీత దర్శకుడు

ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు, గాయకుడు సలీమ్‌ మర్చంట్‌ ముంబై రియల్‌ ఎస్టేట్‌ రంగంలో భారీ పెట్టుబడి పెట్టారు. ముంబైలోని శాంటాక్రూజ్‌ (వెస్ట్‌) ప్రాంతంలో రూ.12.85 కోట్ల విలువైన వాణిజ్య స్థలాన్ని మరో నలుగురితో కలిసి కొనుగోలు చేశారు.

ఈ ఆస్తిలో సలీమ్‌ మర్చంట్‌కు 50 శాతం వాటా ఉండగా, మిగిలిన నలుగురికి చెరో 12.5 శాతం వాటా ఉంది. అక్టోబర్‌ 7, 2026న ఈ లావాదేవీ రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. శాంటాక్రూజ్‌ వెస్ట్‌లోని డీఎల్‌హెచ్‌ మంగళ్‌ మూర్తి భవనంలో ఈ వాణిజ్య స్థలం ఉంది.

లింకింగ్‌ రోడ్‌, తాల్మాకీ రోడ్‌ కూడలి వద్ద ఈ భవనం ఉంది. మొత్తం 1,285 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియా కలిగిన ఈ ఆస్తిలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 575 చదరపు అడుగులు, మొదటి అంతస్తులో 710 చదరపు అడుగుల స్థలం ఉంది. వీటితో పాటు ఒక కార్‌ పార్కింగ్‌ స్థలం కూడా ఒప్పందంలో భాగంగా ఉంది.

శ్రీజా డెవ్‌కాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. మొత్తం రూ.12.85 కోట్ల ధర ప్రకారం చూస్తే చదరపు అడుగుకు సుమారు రూ.లక్ష చెల్లించినట్లవుతుంది. ఈ లావాదేవీపై కొనుగోలుదారులు రూ.77.10 లక్షల స్టాంప్‌ డ్యూటీ చెల్లించారు. ఇది ఒప్పంద విలువలో ఆరు శాతం.

వాణిజ్య స్థిరాస్తులపై సినీ ప్రముఖుల ఆసక్తి

బాలీవుడ్‌ ప్రముఖులు ముంబైలో వాణిజ్య స్థిరాస్తుల కొనుగోళ్లు, లీజులపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌ అంధేరీ వెస్ట్‌లో మూడు వాణిజ్య యూనిట్లను రూ.17 కోట్లకు కొనుగోలు చేశారు.

అంతకుముందు పలువురు సినీ ప్రముఖులు కూడా ముంబైలో వాణిజ్య ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టారు. కరిష్మా కపూర్‌, కరీనా కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

కాగా, సలీమ్‌ మర్చంట్‌ తన సోదరుడు సులేమాన్‌ మర్చంట్‌తో కలిసి సలీమ్‌-సులేమాన్‌ సంగీత ద్వయంగా గుర్తింపు పొందారు. 'హమ్‌ తుమ్‌', 'ముఝ్సే షాదీ కరోగీ', 'నో ఎంట్రీ', 'సలామ్‌ నమస్తే', 'ధూమ్‌ 2' వంటి చిత్రాలకు సంగీతం అందించారు. 'ఇష్క్‌ వాలా లవ్‌', 'శుక్రన్‌ అల్లా', 'ఆషాయేన్‌' వంటి పాటలతో గాయకుడిగానూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ఇదీ చదవండి: ఎనిమిదేళ్లలో ఇంటి విలువ రెట్టింపు