- వాణిజ్య స్థిరాస్తులపై బాలీవుడ్ తారల పెట్టుబడులు.. నెలకు లక్షల్లో అద్దెలు
సినిమాల్లో సంపాదించిన ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు బాలీవుడ్ ప్రముఖులు వాణిజ్య స్థిరాస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్యాలయ భవనాలు, రిటైల్ యూనిట్ల కొనుగోలుతో పాటు వాటిని కంపెనీలకు దీర్ఘకాలిక ఒప్పందాలపై అద్దెకిస్తూ క్రమబద్ధమైన ఆదాయాన్ని పొందుతున్నారు.
నటులు సోనూ సూద్, హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, సారా అలీ ఖాన్, మాధురీ దీక్షిత్ వంటి వారి ఆస్తి లావాదేవీలు ఈ ధోరణిని స్పష్టం చేస్తున్నాయి. అద్దెల రూపంలో నిరంతర ఆదాయం పొందడంతో పాటు భవిష్యత్తులో ఆస్తి విలువ పెరగడం ద్వారా సంపదను సమకూర్చుకోవడమే ఈ పెట్టుబడుల వెనుక ప్రధాన ఉద్దేశం.
సోనూ సూద్.. ఐదేళ్లలో రూ.3.52 కోట్ల అద్దె ఆదాయం
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ముంబయిలోని అంధేరీ వెస్ట్ ప్రాంతం, వెర్సోవాలోని ఆరామ్ నగర్‌లో ఉన్న తన వాణిజ్య స్థలాన్ని ఓ కాఫీ సంస్థకు అద్దెకిచ్చారు. అక్టోబర్ 2026లో నమోదైన ఈ ఒప్పందం ద్వారా ఐదేళ్లలో మొత్తం రూ.3.52 కోట్ల అద్దె ఆదాయం లభించనుంది. సోనూ సూద్‌కు వాణిజ్య ఆస్తుల ద్వారా అద్దె ఆదాయం పొందడం ఇదే మొదటిసారి కాదు.
అంతకుముందు ముంబయిలోని బాంద్రా ఈస్ట్ బీకేసీ (బాంద్రా కుర్లా కాంప్లెక్స్)లో ఉన్న తన కార్యాలయ స్థలాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు అద్దెకిచ్చారు. 2,700 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ ఆస్తిని 2012లో రూ.24.25 కోట్లకు కొనుగోలు చేశారు.
ఇదీ చదవండి: రూ.3 కోట్లకు కొన్నారు.. రూ.6 కోట్లకు అమ్మారు
హృతిక్ రోషన్ కుటుంబం.. రూ.80 కోట్ల పెట్టుబడులు
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, ఆయన తండ్రి, దర్శకుడు రాకేశ్ రోషన్, తల్లి ప్రమీలా రోషన్, సోదరి సునైనా రోషన్ కలిసి 2025లో ముంబయిలో పలు కార్యాలయ స్థలాలను కొనుగోలు చేశారు. వ్యక్తిగతంగా, కుటుంబానికి సంబంధించిన సంస్థల ద్వారా జరిగిన ఈ లావాదేవీల విలువ సుమారు రూ.80 కోట్లు.
వాణిజ్య ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కేవలం ఆస్తి విలువ పెరుగుదలపైనే ఆధారపడకుండా, వాటిని అద్దెకిచ్చి ఆదాయం పొందే అవకాశాన్ని కూడా కల్పించుకోవచ్చనే వ్యూహం ఈ కొనుగోళ్లలో కనిపిస్తోంది.
సైఫ్ అలీ ఖాన్.. నెలకు రూ.22.76 లక్షల అద్దె
నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబయిలోని అంధేరీ-కుర్లా రోడ్డులో ఉన్న రెండు వాణిజ్య యూనిట్లను దుర్వా ఫిన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అద్దెకిచ్చారు. వీటి మొత్తం రెరా కార్పెట్ విస్తీర్ణం 5,692 చదరపు అడుగులు.
ఈ ఒప్పందం ద్వారా నెలకు రూ.22.76 లక్షల అద్దె లభించనుంది. కార్యాలయాన్ని తమ అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేసుకునేందుకు అద్దెదారుకు రెండు నెలల అద్దె రహిత గడువు ఇచ్చారు.
సైఫ్ అలీ ఖాన్ వాణిజ్య స్థిరాస్తుల కొనుగోలులోనూ పెట్టుబడులు పెట్టారు. 2025 నవంబరులో ముంబయి అంధేరీ ఈస్ట్‌లోని కనాకియా వాల్‌స్ట్రీట్ భవనంలో 5,681 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన రెండు కార్యాలయ యూనిట్లను రూ.30.75 కోట్లకు కొనుగోలు చేశారు.
సారా అలీ ఖాన్, అమృతా సింగ్.. ఏఐ సంస్థకు కార్యాలయం
నటి సారా అలీ ఖాన్, ఆమె తల్లి అమృతా సింగ్ కలిసి ముంబయిలోని అంధేరీ వెస్ట్, వీరా దేశాయ్ రోడ్డులోని సిగ్నేచర్ భవనంలో ఉన్న 2,545 చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని అప్‌సర్జ్ ల్యాబ్స్ ఎల్‌ఎల్‌పీ అనే ఏఐ స్టూడియో సంస్థకు ఐదేళ్లకు అద్దెకిచ్చారు. మొత్తం ఒప్పంద కాలానికి రూ.3.76 కోట్ల అద్దె ఆదాయం లభించనుంది.
ఇదీ చదవండి: ఐదేళ్లకు రూ.1.39 కోట్ల ఆదాయం
మాధురీ దీక్షిత్.. 18 ఏళ్లలో 824 శాతం విలువ పెరుగుదల
నటి మాధురీ దీక్షిత్ ముంబయిలోని అంధేరీ వెస్ట్‌లో ఉన్న వాణిజ్య కార్యాలయాన్ని 2026 జూన్ 23న రూ.4.85 కోట్లకు విక్రయించారు. 2008లో ఇదే ఆస్తిని రూ.52.5 లక్షలకు కొనుగోలు చేశారు. కొనుగోలు ధరతో పోలిస్తే విక్రయ ధర దాదాపు 9.2 రెట్లు పెరిగింది. అంటే సుమారు 824 శాతం విలువ వృద్ధి నమోదైంది.
దాదాపు 18 ఏళ్లపాటు ఆస్తిని ఉంచుకున్న తర్వాత వచ్చిన ఈ లాభం.. సరైన ప్రాంతంలో దీర్ఘకాలం పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలకు ఉదాహరణగా నిలుస్తోంది.
వాణిజ్య స్థిరాస్తులపై ఎందుకీ ఆసక్తి?
సినిమా రంగంలో ఆదాయం ప్రాజెక్టులు, పారితోషికాలు, బ్రాండ్ ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది. అయితే వాణిజ్య స్థిరాస్తులు మరో ఆదాయ మార్గాన్ని అందిస్తాయి. కార్యాలయాలు, దుకాణ సముదాయాలు, వ్యాపార సంస్థలకు అనువైన స్థలాలను కొనుగోలు చేసి అద్దెకివ్వడం ద్వారా నెలవారీ ఆదాయం పొందవచ్చు.
దీర్ఘకాలిక ఒప్పందాలు, ముందుగా నిర్ణయించిన అద్దె పెంపు నిబంధనలు ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి.
ఇదీ చదవండి: జూబ్లీహిల్స్‌లో బాలకృష్ణ కొత్త లగ్జరీ నివాసం
