కేబీఆర్ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన రహదారుల విస్తరణకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నివాస స్థలంలో కొంత భాగాన్ని ఇచ్చేందుకు అంగీకరించారని తెలిసింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 జంక్షన్ వద్ద ఉన్న ఆయన నివాసానికి చెందిన 862.77 చదరపు గజాల స్థలాన్ని రహదారి అభివృద్ధి కోసం ఇవ్వనున్నారు. నగదు పరిహారానికి బదులుగా ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) తీసుకునేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరిచే విస్తృత ప్రణాళికలో భాగంగా బాలకృష్ణతో పాటు శబ్దాలయ స్టూడియో, భవ్య కన్‌స్ట్రక్షన్స్ కూడా తమ ఆస్తుల్లో కొంత భాగాన్ని రహదారుల అభివృద్ధి కోసం ఇచ్చేందుకు అంగీకరించాయి.
జూబ్లీహిల్స్‌లో రూ.100 కోట్ల విలాసవంతమైన ఇల్లు?
ఇదిలా ఉండగా, బాలకృష్ణ జూబ్లీహిల్స్‌లో కొత్త లగ్జరీ నివాసాన్ని నిర్మిస్తున్నారన్న వార్తలు సినీ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సుమారు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తులుగా ఈ భవనం రూపుదిద్దుకుంటోంది. ప్రైవేట్ హోమ్ థియేటర్, ఆధునిక జిమ్, స్విమ్మింగ్ పూల్, ల్యాండ్‌స్కేప్ గార్డెన్, ప్రత్యేక పూజా మందిరం వంటి సదుపాయాలు ఇందులో ఉండనున్నట్లు సమాచారం. నిర్మాణ వ్యయం, ఇంటీరియర్స్, స్థలం ప్రస్తుత మార్కెట్ విలువను కలిపి ఈ భవనం విలువ రూ.100 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
