- ప్రాజెక్టు ప్లాన్ మార్పులకు ఇంటి కొనుగోలుదారుల అంగీకారం తప్పనిసరి
- కనీసం మూడింట రెండొంతుల మంది సమ్మతి తప్పనిసరి
నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో కొనుగోలుదారులకు తెలియకుండా బిల్డర్లు ఇష్టానుసారం మార్పులు చేయడానికి ఇకపై వీలుండదు. ఇప్పటికే ఆమోదం పొందిన భవన నిర్మాణ ప్రణాళికల్లో కీలక మార్పులు చేయాలంటే కనీసం మూడింట రెండొంతుల మంది ఇంటి కొనుగోలుదారుల నుంచి లిఖితపూర్వక అంగీకారం తీసుకోవాల్సిందే.
అంతేకాకుండా ప్రతిపాదిత మార్పుల వల్ల తమ ఫ్లాట్ విస్తీర్ణం, ఉమ్మడి ప్రదేశాలు, ఇతర సదుపాయాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ముందుగానే వారికి వివరించాలి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ (యూపీ రెరా) నవంబర్ 12న కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటివరకు కొన్ని ప్రాజెక్టుల్లో బిల్డర్లు కొనుగోలుదారుల నుంచి సాధారణ అంగీకార పత్రాలు తీసుకుని, ఆ తర్వాత ఆమోదించిన నిర్మాణ ప్రణాళికల్లో మార్పులకు ప్రయత్నిస్తున్నట్లు యూపీ రెరా గుర్తించింది.
అసలు ఏయే మార్పులు చేయాలనుకుంటున్నారో వెల్లడించకుండానే సంతకాలు తీసుకోవడం వల్ల డెవలపర్లకు ఇష్టానుసారం మార్పులు చేసే అవకాశం ఏర్పడుతోందని అభిప్రాయపడింది. మరికొన్ని సందర్భాల్లో కొనుగోలుదారుల అంగీకారం తీసుకోకుండానే సంబంధిత అధికారుల నుంచి సవరించిన నిర్మాణ ప్రణాళికలకు అనుమతులు పొందేందుకు దరఖాస్తులు చేస్తున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో రెరా చట్టంలోని సెక్షన్ 14 నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని బిల్డర్లను ఆదేశించింది.
ఏయే వివరాలు వెల్లడించాలి?
ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికలో మార్పులు ప్రతిపాదించినప్పుడు వాటి పూర్తి వివరాలను బిల్డర్లు లిఖితపూర్వకంగా కొనుగోలుదారులకు అందించాలి. ముఖ్యంగా.. ప్రతిపాదిత మార్పుల వల్ల వ్యక్తిగత ఫ్లాట్ కార్పెట్ ఏరియాలో వచ్చే మార్పులు, లిఫ్టులు, కారిడార్లు, పార్కింగ్, క్లబ్‌హౌస్, ఇతర ఉమ్మడి ప్రదేశాల్లో చేసే మార్పులు, కొత్తగా చేర్చే నిర్మాణాలు, తొలగించే నిర్మాణాల వివరాలు, ఇప్పటికే ఆమోదించిన ప్లాన్‌తో పోలిస్తే సవరించిన ప్లాన్‌లో ఉన్న తేడాలను చెప్పాలి.
ఈ వివరాలను స్పష్టంగా తెలియజేసిన తర్వాతే కొనుగోలుదారుల నుంచి సమ్మతి తీసుకోవాలి. కేవలం ప్రాజెక్టు ప్లాన్ మార్పులకు అంగీకరిస్తున్నట్లు సాధారణంగా రాసిన పత్రాలపై సంతకాలు తీసుకోవడం సరిపోదు. ప్రతిపాదిత మార్పులపై పూర్తి అవగాహన కల్పించకుండా తీసుకున్న అంగీకారాలను ఆమోదించబోమని యూపీ రెరా స్పష్టం చేసింది.
రెరా చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం ప్రాజెక్టు ఆమోదిత ప్లాన్‌లో ప్రధానమైన మార్పులు చేయాలంటే కనీసం మూడింట రెండొంతుల మంది కేటాయింపుదారుల లిఖితపూర్వక సమ్మతి తప్పనిసరి.
ఇదీ చదవండి: ఇటుకలు, సిమెంట్ దాటి రియల్ పెట్టుబడులు
సెక్షన్ 14 ఏం చెబుతోంది?
రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం–2016లోని సెక్షన్ 14 ప్రకారం డెవలపర్లు సంబంధిత అధికారుల నుంచి ఆమోదం పొందిన నిర్మాణ ప్రణాళికలు, సదుపాయాల వివరాలకు అనుగుణంగానే ప్రాజెక్టును పూర్తి చేయాలి. కొనుగోలుదారులతో కుదుర్చుకున్న ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఇళ్లను అప్పగించాలి. ఒకసారి ఆమోదిత ప్లాన్, నిర్మాణ వివరాలను కొనుగోలుదారులకు వెల్లడించిన తర్వాత బిల్డర్లు ఏకపక్షంగా వాటిని మార్చడానికి వీల్లేదు.
ప్రాజెక్టులోని ప్రధానమైన మార్పులు, ఫ్లోర్ ప్లాన్‌లో మార్పులు చేయాలంటే కనీసం మూడింట రెండొంతుల మంది కేటాయింపుదారుల లిఖితపూర్వక అంగీకారం తీసుకోవాలి. సవరించిన ప్లాన్‌కు అనుమతి కోరే సమయంలో ఈ సమ్మతి పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించాలి. సంబంధిత స్థానిక సంస్థలు, అభివృద్ధి ప్రాధికార సంస్థలు కూడా సవరించిన ప్లాన్లకు అనుమతులు ఇచ్చేటప్పుడు రేరా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా కొనుగోలుదారులకు ప్రాధాన్యం
యూపీ రేరా తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రాజెక్టులకు సంబంధించినవే. అయితే ఈ ఆదేశాల వెనుక ఉన్న సెక్షన్ 14 నిబంధన రేరా చట్టం కింద దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో అపార్ట్‌మెంట్ ప్రాజెక్టుల్లో కొనుగోలుదారులకు తెలియకుండా పార్కింగ్, క్లబ్‌హౌస్, కామన్ ఏరియా, ఫ్లాట్ల విస్తీర్ణం, ఇతర సదుపాయాల్లో మార్పులు జరిగే సందర్భాలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొనుగోలుదారుల హక్కులను కాపాడేందుకు ఈ నిబంధనలు కీలకం.
ముఖ్యంగా నిర్మాణ సంస్థలు విక్రయాల సమయంలో చూపించిన ప్లాన్‌కు, తర్వాత నిర్మాణంలో అమలు చేస్తున్న ప్లాన్‌కు మధ్య తేడాలుంటే కొనుగోలుదారులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి చిన్న మార్పుకూ మూడింట రెండొంతుల మంది సమ్మతి అవసరమని భావించకూడదు. ఈ నిబంధన ప్రధానమైన మార్పులకు సంబంధించినది. అలాగే చట్టంలో పేర్కొన్న పరిమితులకు లోబడి మాత్రమే మార్పులకు అనుమతి ఉంటుంది.
ఇదీ చదవండి: ఇంటికి ఇన్సూరెన్స్ అవసరమా?
