- ప్రాజెక్టు నిర్దేశిత ఖాతాలోనే చెల్లింపులు చేయాలి
- గృహ కొనుగోలుదారులకు యూపీ రెరా సూచన
ఇల్లు కొనుగోలు చేసేవారు బిల్డర్లకు చెల్లింపులు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఉత్తరప్రదేశ్ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ (యూపీ రెరా) సూచించింది. ఫ్లాట్ బుకింగ్ మొత్తం, నిర్మాణ దశలవారీ వాయిదాలు, ఇతర బకాయిలను సంబంధిత ప్రాజెక్టు కోసం నిర్దేశించిన కలెక్షన్ ఖాతాలోనే జమ చేయాలని స్పష్టం చేసింది. బిల్డర్ లేదా ప్రమోటర్ వేరే బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయాలని కోరితే ఆ విషయాన్ని వెంటనే రెరా దృష్టికి తీసుకురావాలని కోరింది.
ఈ మేరకు అక్టోబర్ 12న గృహ కొనుగోలుదారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇల్లు కొనుగోలు చేసేవారు డబ్బులు బదిలీ చేసే ముందు యూపీ రెరా అధికారిక వెబ్‌సైట్‌లో సంబంధిత ప్రాజెక్టు కలెక్షన్ ఖాతా వివరాలను పరిశీలించాలని సంస్థ సూచించింది. బిల్డర్ అందించిన బ్యాంకు ఖాతా వివరాలు, రెరా వెబ్‌సైట్‌లో నమోదైన వివరాలు సరిపోతున్నాయో లేదో నిర్ధారించుకున్న తర్వాతే చెల్లింపులు చేయాలని పేర్కొంది. ఈ జాగ్రత్త వల్ల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెరగడంతో పాటు, తప్పు ఖాతాలకు డబ్బులు బదిలీ చేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చని తెలిపింది.
వేరే ఖాతాలో డబ్బులు అడిగితే
ప్రాజెక్టుకు నిర్దేశించిన కలెక్షన్ ఖాతా కాకుండా మరో బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయాలని బిల్డర్ కోరితే కొనుగోలుదారులు ఆ విషయాన్ని యూపీ రెరాకు తెలియజేయవచ్చు. ఇందుకోసం సంస్థ తన అధికారిక పోర్టల్‌లో ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది. రెరా నిబంధనల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో నమోదైన ప్రాజెక్టులకు ప్రమోటర్లు ప్రత్యేక బ్యాంకు ఖాతాలను నిర్వహించాలి. కొనుగోలుదారుల నుంచి వచ్చే మొత్తాలను ముందుగా ప్రాజెక్టు నిర్దేశిత కలెక్షన్ ఖాతాలో స్వీకరించేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఈ ఖాతాలో జమయ్యే మొత్తంలో కనీసం 70 శాతాన్ని ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు ఆటోమేటిక్‌గా బదిలీ చేసే విధానం ఉంది. ఆ మొత్తాన్ని సంబంధిత ప్రాజెక్టు నిర్మాణం, అభివృద్ధి పనుల కోసమే వినియోగించాలి. మిగిలిన మొత్తాన్ని వర్తించే నిబంధనల ప్రకారం లావాదేవీల ఖాతాకు బదిలీ చేస్తారు. ఈ విధానం ద్వారా ఒక ప్రాజెక్టుకు చెందిన డబ్బును ఇతర అవసరాలకు మళ్లించే అవకాశాలను నియంత్రించడంతో పాటు, నిర్మాణ పనులకు నిధులు అందుబాటులో ఉండేలా చూడటం రెరా లక్ష్యం.
