General

పార్కింగ్‌ వివాదంలో కొనుగోలుదారుడికి మహారెరా షాక్‌

పార్కింగ్‌ వివాదంలో కొనుగోలుదారుడికి మహారెరా షాక్‌
  • ఒప్పందంలో పార్కింగ్ వద్దనుకుంటే తర్వాత అడిగినా ప్రయోజనం ఉండదని స్పష్టీకరణ

ఫ్లాట్‌ కొనుగోలుదారులు పార్కింగ్‌ విషయంలో ఒప్పంద పత్రాలను ఎంత జాగ్రత్తగా పరిశీలించాలో మహారాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) ఇచ్చిన తాజా తీర్పు స్పష్టం చేస్తోంది. రిజిస్టర్‌ చేసిన విక్రయ ఒప్పందంలో పార్కింగ్‌ అవసరం లేదని పేర్కొన్నందున, అదనంగా రూ.1.50 లక్షలు చెల్లించి పార్కింగ్‌ కొనుగోలు చేశానన్న ఓ ఫ్లాట్‌ యజమాని వాదనను మహారేరా తిరస్కరించింది. 

పుణెలోని ధనోరిలో ఉన్న మంత్రా మోంటానా ఫేజ్‌-8 ప్రాజెక్టులో ఓ వ్యక్తి 2021 ఆగస్టు 8న ఫ్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. 2024 జూన్‌ 17న ఇంటి స్వాధీనం పొందారు. ఫ్లాట్‌ ధరకు అదనంగా రూ.1.50 లక్షలు పార్కింగ్‌ కోసం చెల్లించానని, స్వాధీనం సమయంలో 15 రోజుల్లో పార్కింగ్‌ కేటాయిస్తామని బిల్డర్‌ హామీ ఇచ్చారని ఆయన ఆరోపించారు. అయితే ఎన్నిసార్లు అడిగినా పార్కింగ్‌ కేటాయించలేదని పేర్కొంటూ మహారెరాను ఆశ్రయించారు. 

ఫ్లాట్‌ కొనుగోలుదారు చెల్లించిన మొత్తం రూ.23.37 లక్షలు మాత్రమేనని, అందులో పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా ఎలాంటి నగదు తీసుకోలేదని బిల్డర్‌ వాదించాడు. విక్రయ ఒప్పందంలోనూ పార్కింగ్‌ కేటాయింపునకు సంబంధించి ఎలాంటి నిబంధన లేదని తెలిపాడు. 2026 నవంబర్‌ 5న ఇచ్చిన ఉత్తర్వుల్లో మహారెరా కీలక అంశాలను ప్రస్తావించింది.

కొనుగోలుదారు పార్కింగ్‌ కోసం రూ.1.50 లక్షలు చెల్లించినట్లు నిరూపించే రశీదు, బ్యాంకు లావాదేవీల వివరాలు లేదా ఇతర ఆధారాలను సమర్పించలేకపోయారని పేర్కొంది. అంతేకాకుండా 2021 సెప్టెంబర్‌ 17న రిజిస్టర్‌ చేసిన విక్రయ ఒప్పందాన్ని పరిశీలించగా.. అందులోని క్లాజ్‌ 2(1)(ఎ)లో కొనుగోలుదారుకు కారు పార్కింగ్‌ అవసరం లేదని స్పష్టంగా ఉందని గుర్తించింది. ఒప్పందంలోని ఇండెక్స్‌-2లోనూ పార్కింగ్‌ కేటాయింపు ప్రస్తావన లేదని తెలిపింది.

తర్వాత పార్కింగ్‌ కేటాయిస్తామని బిల్డర్‌ రాతపూర్వకంగా అంగీకరించినట్లు ఎలాంటి ఆధారాలు కూడా లేవని స్పష్టం చేసింది. కేవలం మౌఖిక హామీల ఆధారంగా పార్కింగ్‌పై హక్కును కోరలేరని పేర్కొంటూ ఫిర్యాదును మహారేరా కొట్టివేసింది.

ఇంటి కొనుగోలు సమయంలో పార్కింగ్‌ సదుపాయం కూడా కావాలనుకుంటే, దానికి సంబంధించిన వివరాలు విక్రయ ఒప్పందంలో స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని ఈ తీర్పు నేపథ్యంలో నిపుణులు స్పష్టంచేస్తున్నారు. పార్కింగ్‌ కోసం అదనంగా చెల్లించే మొత్తానికి రశీదులు, బ్యాంకు లావాదేవీల ఆధారాలను భద్రపరచుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: పరిహారం తీసుకున్నాక మళ్లీ అదనపు డబ్బు అడగలేరు