General

బంగ్లా బుక్ చేశాక డిజైన్ ఏకపక్ష మార్పులు కుదరదు

బంగ్లా బుక్ చేశాక డిజైన్   ఏకపక్ష మార్పులు కుదరదు
  •      అలా మారిస్తే బిల్డర్ పూర్తి డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందే
  •      మహారెరా స్పష్టీకరణ

ఇల్లు లేదా బంగ్లా బుక్ చేసుకున్న తర్వాత, కొనుగోలుదారుల ప్రమేయం లేకుండా బిల్డర్లు లేదా డెవలపర్లు తమకు నచ్చినట్లు డిజైన్లను, లేఅవుట్లను మారిస్తే ఊరుకునేది లేదని మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికార సంస్థ  మహారెరా) స్పష్టం చేసింది. బుకింగ్ తర్వాత ప్రాజెక్ట్ ప్లాన్లలో అనధికారిక లేదా పెద్ద ఎత్తున మార్పులు చేయడం వల్ల కొనుగోలుదారుడికి, బిల్డర్‌కు మధ్య నమ్మకం దెబ్బతిని ఒప్పందం పూర్తిగా విచ్ఛిన్నమైతే, కస్టమర్ తన డబ్బును వడ్డీతో సహా పూర్తిగా వెనక్కి డిమాండ్ చేయవచ్చని మహారేరా తేల్చి చెప్పింది. 

ముంబైకి సమీపంలో రూ.2 కోట్లకు పైగా విలువైన ఒక లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసేందుకు కొందరు కస్టమర్లు జూలై 2021లో బుకింగ్ చేసుకున్నారు. డిసెంబర్ 2021లో రిజిస్టర్డ్ 'అగ్రిమెంట్ ఫర్ సేల్' పూర్తి చేసి, అడ్వాన్స్ కింద దాదాపు రూ.50 లక్షలు డెవలపర్‌కు చెల్లించారు. అయితే, రిజిస్ట్రేషన్‌కు కొద్ది రోజుల ముందు మాత్రమే బిల్డర్ ఆ బంగ్లా లేఅవుట్, పార్కింగ్ ప్లాన్లలో మార్పులు చేసినట్లు కస్టమర్ల దృష్టికి వచ్చింది.

బంగ్లా బిల్టప్ ఏరియా తగ్గడం, పారలల్ పార్కింగ్ సదుపాయాన్ని మార్చడంపై కస్టమర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, పార్కింగ్ సదుపాయాన్ని యథాతథంగా పునరుద్ధరిస్తామని, తగ్గిన ఏరియాకు నష్టపరిహారం ఇస్తామని బిల్డర్ ఇచ్చిన మౌఖిక హామీలతో వారు రిజిస్ట్రేషన్ ముందుకు తీసుకెళ్లారు. కానీ, ఆ తర్వాత కూడా బిల్డర్ ఆ సమస్యలను పరిష్కరించకపోవడంతో, విసిగిపోయిన కస్టమర్లు ఆగస్టు 2022లో సదరు లావాదేవీని రద్దు చేసుకుని, తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరారు.

బిల్డర్ కొత్త మెలికలు.. వేధింపులు

డెవలపర్ మొదట 90 రోజుల్లో మొత్తం సొమ్మును రిఫండ్ చేస్తానని అంగీకరించినప్పటికీ, ఆ తర్వాత మాట మార్చాడు. విడతల వారీగా ఇస్తామంటూ కాలయాపన చేస్తూ.. కస్టమర్లకు నోటీసులు జారీ చేయడం ప్రారంభించాడు. అంతేకాకుండా, తప్పుడు కారణాలు చూపిస్తూ కాన్సిలేషన్ డీడ్ పై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో బాధితులు న్యాయం కోసం మహారెరాను ఆశ్రయించారు. మరోవైపు బిల్డర్ కోర్టులో వాదిస్తూ.. కస్టమర్లు ఒప్పంద పత్రంపై సంతకం చేశారని, అందువల్ల ఇప్పుడు లేఅవుట్‌ను సవాల్ చేసే హక్కు వారికి లేదని, పైగా చట్టబద్ధమైన అధికారుల అనుమతుల ప్రకారమే మార్పులు చేశామని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. 

ఇరుపక్షాల వాదనలు విన్న మహారెరా.. బిల్డర్ చర్యలు చట్ట నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ప్లాన్ల మార్పు, పార్కింగ్ వివాదాల కారణంగా ఇరుపక్షాల మధ్య ఒప్పందం "తిరిగి పునరుద్ధరించలేనంతగా దెబ్బతిన్నది" అని పేర్కొంది. ఇష్టం లేని ఒప్పందాన్ని కొనసాగించమని ఏ ఒక్కరినీ బలవంతం చేయడం న్యాయం అనిపించుకోదని, అది రెరా చట్ట ఆశయాలకే విరుద్ధమని స్పష్టం చేసింది. రెరా చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం కస్టమర్లు పూర్తి రిఫండ్ పొందేందుకు అర్హులని తేల్చింది.

కస్టమర్ కట్టిన రూ.50 లక్షల మొత్తాన్ని వర్తించే వడ్డీతో సహా 60 రోజుల్లోగా వెనక్కి ఇచ్చేయాలని బిల్డర్‌ను ఆదేశించింది. అయితే, ప్రభుత్వానికి కట్టిన పన్నులు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల వంటి చట్టబద్ధమైన ఛార్జీలను మాత్రం ఈ రిఫండ్ నుండి మినహాయించారు. ప్రాజెక్ట్ ప్రారంభంలో ఒకలా చూపించి, బుకింగ్స్ అయిపోయాక ప్లాన్లు మార్చేసే చాలా మంది బిల్డర్ల ధోరణికి ఈ తీర్పు గట్టి చెక్ పెట్టినట్లయింది.