- కొనుగోలుదారుకు అనుకూలంగా వచ్చిన తీర్పు సవరణకు రెరా నిరాకరణ
- అభ్యంతరాలుంటే అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాలని బిల్డర్ కు స్పష్టీకరణ
రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో ఇళ్ల పంపిణీ ఆలస్యమైతే బిల్డర్లు బాధ్యత వహించాల్సిందేనని, ఒకసారి గృహ కొనుగోలుదారులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులను పునఃసమీక్షించే అధికారం తమకు లేదని మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికార సంస్థ (మహారెరా) స్పష్టం చేసింది. తీర్పు నచ్చకపోతే చట్టప్రకారం అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లాలే తప్ప, రివ్యూ పిటిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ కొనుగోలుదారులను వేధించడం సరికాదని ఓ కేసు విచారణలో రేరా అథారిటీ తేల్చిచెప్పింది.
ముంబైలోని కంజుర్‌మార్గ్ ప్రాంతంలో రన్‌వాల్ రియల్టీ నిర్మిస్తున్న ‘రన్‌వాల్ బ్లిస్’ ప్రాజెక్ట్‌లో ఒక కస్టమర్ ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. బిల్డర్ ఒప్పందం ప్రకారం నిర్దేశిత సమయానికి ఫ్లాట్‌ను అప్పగించడంలో విఫలమయ్యాడు. దీంతో సదరు కొనుగోలుదారుడు న్యాయం కోసం మహారెరాను ఆశ్రయించారు. విచారణ జరిపిన అథారిటీ, ఇల్లు ఇవ్వడంలో ఆలస్యమైనందుకు గానూ కొనుగోలుదారుడికి వడ్డీతో కూడిన పరిహారం చెల్లించాలని గతంలో బిల్డర్‌ను ఆదేశించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ.. ఆ ఆర్డర్‌ను పునఃసమీక్షించాలని కోరుతూ రన్‌వాల్ రియల్టీ సంస్థ మహారెరా బోర్డు వద్దే మళ్లీ పిటిషన్ దాఖలు చేసింది.
తాము అప్పగించాల్సిన గడువు తేదీలను లెక్కించడంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని, పాత తీర్పును రద్దు చేయాలని బిల్డర్ వాదించారు. కానీ, కొనుగోలుదారుడి తరఫు న్యాయవాది దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. రెరా చట్టం ప్రకారం ఒకసారి అథారిటీ మెరిట్స్ (సాక్ష్యాధారాల) ఆధారంగా తుది తీర్పు ఇచ్చాక, దానిపై రివ్యూ పిటిషన్ వేసే చట్టపరమైన హక్కు బిల్డర్‌కు లేదని, కేవలం ఆర్డర్‌లో ఏవైనా చిన్నపాటి టైపింగ్ తప్పులు లేదా అంకగణిత లోపాలు ఉంటే మాత్రమే సరిచేసే వీలుంటుందని గుర్తు చేశారు.
ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన మహారెరా.. బిల్డర్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. రెరా చట్టంలోని సెక్షన్ 39 ప్రకారం.. కేవలం రికార్డుల్లో స్పష్టంగా కనిపించే అక్షరదోషాలు, గణిత తప్పులను సరిదిద్దడానికి మాత్రమే అథారిటీకి అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. తమ ఆదేశాలపై బిల్డర్‌కు ఏవైనా అభ్యంతరాలు ఉంటే, రెరా చట్టం సెక్షన్ 43 ప్రకారం నిర్దేశిత గడువులోగా మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాలే తప్ప, అదే ఫోరమ్‌లో తీర్పును మార్చాలని కోరడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.
