- పది నెలల్లో రూ.44,305 కోట్ల లావాదేవీలు
- జనవరి–అక్టోబర్ మధ్య 61,033 ఇళ్ల రిజిస్ట్రేషన్లు
- గతేడాది పోలిస్తే ఒక శాతం తగ్గుదల; లావాదేవీల విలువ మాత్రం 3 శాతం పెరుగుదల
హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇళ్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ, ఆస్తుల లావాదేవీల విలువ మాత్రం పెరుగుతోంది. ముఖ్యంగా కోటి రూపాయలకు పైగా ధర ఉన్న ప్రీమియం ఇళ్లకు కొనుగోలుదారుల నుంచి ఆదరణ పెరుగుతోంది.
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు హైదరాబాద్ పరిధిలో 61,033 నివాస ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. వీటి మొత్తం లావాదేవీల విలువ రూ.44,305 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య ఒక శాతం తగ్గగా, మొత్తం విలువ 3 శాతం పెరిగింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ గణాంకాలు హైదరాబాద్ మార్కెట్‌లో కేవలం ఇళ్ల కొనుగోళ్ల సంఖ్యే కాకుండా, కొనుగోలు చేస్తున్న ఇళ్ల ధరల శ్రేణిలోనూ మార్పు వస్తోందని సూచిస్తున్నాయి. ఖరీదైన ఇళ్ల విక్రయాలు మొత్తం మార్కెట్ విలువ పెరుగుదలకు ప్రధానంగా దోహదపడుతున్నాయి. అంటే రిజిస్ట్రేషన్ల సంఖ్యలో పెద్దగా వృద్ధి లేకపోయినా, అధిక విలువ కలిగిన ప్రాపర్టీల లావాదేవీలు పెరుగుతున్నాయి.
ఇదీ చదవండి: ఇటుకలు, సిమెంట్ దాటి రియల్ పెట్టుబడులు
కోటి రూపాయలకుపైగా ఇళ్లదే ఆధిపత్యం
ధరల విభాగాల వారీగా చూస్తే ప్రీమియం ఇళ్ల మార్కెట్ బలంగా ఉంది. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు జనవరి–అక్టోబర్ మధ్య 1 శాతం పెరిగి 12,322కు చేరాయి. వీటి మొత్తం లావాదేవీల విలువ 6 శాతం వృద్ధితో రూ.22,680 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.21,475 కోట్లుగా ఉంది. మొత్తం ఇళ్ల రిజిస్ట్రేషన్ విలువలో ఈ విభాగం వాటా 51 శాతంగా నమోదైంది. గతేడాది ఇది 50 శాతం మాత్రమే.
అయితే మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 20 శాతంగానే ఉంది. మరోవైపు రూ.50 లక్షలలోపు ధర ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు 2 శాతం తగ్గి 33,420కు చేరాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఒక శాతం తగ్గి 15,289గా నమోదయ్యాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో రూ.50 లక్షలలోపు ఇళ్ల వాటా 55 శాతంగా ఉండగా, రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఇళ్ల వాటా 25 శాతంగా ఉంది. అయితే లావాదేవీల విలువలో మాత్రం ప్రీమియం ఇళ్లదే పైచేయిగా నిలిచింది.
మరోవైపు అక్టోబర్ నెలలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత మందగించింది. ఈ నెలలో 5,318 నివాస ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. గతేడాది అక్టోబర్‌లో నమోదైన 6,194తో పోలిస్తే 14 శాతం తగ్గుదల నమోదైంది. సెప్టెంబర్‌తో పోలిస్తే కూడా రిజిస్ట్రేషన్లు 5 శాతం తగ్గాయి. అక్టోబర్‌లో నమోదైన ఆస్తుల మొత్తం లావాదేవీల విలువ రూ.4,395 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే నెలలో ఇది రూ.4,512 కోట్లుగా నమోదైంది. అంటే వార్షిక ప్రాతిపదికన విలువలోనూ 3 శాతం తగ్గుదల కనిపించింది.
సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు పితృపక్షాలు కొనసాగడం కూడా ఈ మందగమనానికి ఒక కారణమై ఉండొచ్చని నైట్ ఫ్రాంక్ విశ్లేషించింది. ఈ కాలంలో కొంతమంది కొనుగోలుదారులు సంప్రదాయం ప్రకారం కొత్త ఆస్తుల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లను వాయిదా వేస్తుంటారు. అక్టోబర్‌లో అన్ని ధరల విభాగాల్లోనూ రిజిస్ట్రేషన్లు తగ్గాయి. రూ.50 లక్షలలోపు ఇళ్లలో అత్యధికంగా 21 శాతం క్షీణత నమోదైంది.
రూ.కోటి పైన ఉన్న ఇళ్లలో 6 శాతం, రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉన్న ఇళ్లలో 4 శాతం తగ్గుదల కనిపించింది. అయితే అక్టోబర్‌లోనూ ప్రీమియం ఇళ్ల మార్కెట్ కొంత నిలకడను ప్రదర్శించింది. రిజిస్ట్రేషన్లు తగ్గినప్పటికీ, కోటి రూపాయలకు పైగా ధర ఉన్న ఇళ్ల లావాదేవీల విలువ 6 శాతం పెరిగింది. ఆ నెలలో మొత్తం లావాదేవీల విలువలో ప్రీమియం ఇళ్ల వాటా 59 శాతానికి చేరింది. గతేడాది అక్టోబర్‌లో ఇది 54 శాతంగా ఉంది.
ఇదీ చదవండి: సిబిల్ రికార్డుల్లో తప్పు, ఎల్‌ఐసీ కి రూ.2.45 లక్షల జరిమానా
రంగారెడ్డి జిల్లాలోనే అత్యధిక రిజిస్ట్రేషన్లు
జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ముందంజలో ఉంది. అక్టోబర్ లో నమోదైన మొత్తం రిజిస్ట్రేషన్లలో రంగారెడ్డి జిల్లా వాటా 52 శాతంగా ఉంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా 29 శాతం, హైదరాబాద్ జిల్లా 18 శాతం, సంగారెడ్డి జిల్లా 1 శాతం వాటాను నమోదు చేశాయి. నగర శివార్లలో కొత్త నివాస ప్రాజెక్టులు, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతాలు రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్లకు దోహదపడుతున్నాయి.
నగరంలో ఇళ్ల ధరలు కూడా పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ పరిధిలో నివాస ప్రాపర్టీల సగటు వెయిటెడ్ లావాదేవీ ధర చదరపు అడుగుకు రూ.5,184గా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డిలో చదరపు అడుగు సగటు ధర రూ.5,879గా, మేడ్చల్-మల్కాజిగిరిలో రూ.3,807గా నమోదైంది. సంగారెడ్డిలో చదరపు అడుగు ధర రూ.3,005గా ఉంది. అయితే ధరల పెరుగుదల విషయంలో సంగారెడ్డి జిల్లా ముందుంది.
ఇక్కడ వార్షికంగా 25 శాతం వృద్ధి నమోదైంది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోనూ ధరలు 8 శాతం చొప్పున పెరిగాయి. హైదరాబాద్ నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ జనవరి–అక్టోబర్ మధ్య రిజిస్ట్రేషన్ల పరంగా స్థిరంగా కొనసాగిందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ తెలిపారు.
రిజిస్ట్రేషన్ల సంఖ్యలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, లావాదేవీల విలువ పెరగడం మార్కెట్‌లో అధిక ధర కలిగిన ఇళ్ల ప్రాధాన్యం పెరుగుతున్నట్లు సూచిస్తోందని పేర్కొన్నారు. మార్కెట్ వృద్ధిని అంచనా వేయడానికి కేవలం రిజిస్ట్రేషన్ల సంఖ్యనే కాకుండా, వాటి విలువలో వస్తున్న మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వివరించారు.
ఇదీ చదవండి: బిల్డర్ల ఏకపక్ష నిర్ణయాలకు చెక్
