General

టైగర్‌ ష్రాఫ్‌ : రూ.7.61 కోట్లకు కొన్న ఫ్లాట్‌ రూ.9 కోట్లకు విక్రయం

టైగర్‌ ష్రాఫ్‌ : రూ.7.61 కోట్లకు కొన్న ఫ్లాట్‌ రూ.9 కోట్లకు విక్రయం
  • ఎనిమిదేళ్లలో రూ.1.39 కోట్ల ధర పెరుగుదల
  • ముంబయిలో టైగర్‌ ష్రాఫ్‌ మరో ప్రాపర్టీ విక్రయం

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ ముంబయిలోని తన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను రూ.9 కోట్లకు విక్రయించారు. ఖార్‌ వెస్ట్‌లోని రుస్తోంజీ పారామౌంట్‌ నివాస సముదాయంలో ఉన్న ఈ ఫ్లాట్‌ విక్రయ ఒప్పందం 2026 అక్టోబర్‌ 22న రిజిస్టర్‌ అయింది.

టైగర్‌ ష్రాఫ్‌ 2018లో ఈ ఫ్లాట్‌ను రూ.7.61 కోట్లకు కొనుగోలు చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత విక్రయించడంతో కొనుగోలు ధరతో పోలిస్తే రూ.1.39 కోట్ల పెరుగుదల నమోదైంది.

1,291.14 చదరపు అడుగుల కార్పెట్ వీస్తీర్ణం కలిగిన ఈ ఫ్లాట్ చదరపు అడుగు ధర సుమారు రూ.64,891గా పడినట్టయింది. కొనుగోలుదారు రూ.54 లక్షల స్టాంపు డ్యూటీ చెల్లించారు. ఈ ఫ్లాట్‌ను టైగర్‌ ష్రాఫ్‌ 2018 జులై 17న ప్రాజెక్టు డెవలపర్‌ కీస్టోన్‌ రియల్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి కొనుగోలు చేశారు. 2019 నవంబర్‌ 30న స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం రూ.9 కోట్లకు జరిగిన విక్రయ ఒప్పందంలో రెండు కవర్డ్‌ పార్కింగ్‌ స్థలాలు కూడా ఉన్నాయి.

నిజంగా ఎంత లాభం వచ్చినట్లు?

ముంబయి ఫ్లాట్‌ కొనుగోలు ధర రూ.7.61 కోట్లు కాగా, విక్రయ ధర రూ.9 కోట్లు. ఈ రెండు ధరల మధ్య తేడా రూ.1.39 కోట్లు. కొనుగోలు ధరపై ఇది సుమారు 18.3 శాతం స్థూల ధర పెరుగుదల. అయితే, ఎనిమిదేళ్ల కాలానికి ఈ పెరుగుదలను వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (CAGR)గా లెక్కిస్తే సుమారు 2.1 శాతం మాత్రమే ఉంటుంది. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుములు, నిర్వహణ, ఇతర కొనుగోలు–విక్రయ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ లాభం మరింత తగ్గవచ్చు. అందువల్ల రూ.1.39 కోట్లను నికర లాభంగా పేర్కొనడం సరికాదు.

ఇదీ చదవండి: ఏక్తా క‌పూర్ రియ‌ల్ పాఠాలు

గతంలోనూ పలు విక్రయాలు..

టైగర్‌ ష్రాఫ్‌ గత ఏడాది కూడా ఇదే రుస్తోంజీ పారామౌంట్‌ సముదాయంలోని మరో అపార్ట్‌మెంట్‌ను విక్రయించారు. 22వ అంతస్తులో ఉన్న ఆ ఫ్లాట్‌ను 2018లో రూ.11.62 కోట్లకు కొనుగోలు చేయగా, 2025లో రూ.15.6 కోట్లకు అమ్మారు. దీంతో కొనుగోలు ధరతో పోలిస్తే సుమారు 31 శాతం పెరుగుదల నమోదైంది. ఆ ఫ్లాట్‌ కార్పెట్‌ విస్తీర్ణం 1,989.72 చదరపు అడుగులు కాగా, దానికి మూడు కార్‌ పార్కింగ్‌ స్థలాలు ఉన్నాయి.

2026 మార్చిలో పుణెలోని హడప్సర్‌ ప్రాంతంలో ఉన్న యూ పుణె నివాస సముదాయంలోని తన అపార్ట్‌మెంట్‌ను టైగర్‌ ష్రాఫ్‌ రూ.8.87 కోట్లకు విక్రయించారు. పంచ్‌శీల్‌ రియల్టీ అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టులోని ఫ్లాట్‌ను ఆయన 2024 మార్చిలో రూ.7.5 కోట్లకు కొనుగోలు చేశారు.

విక్రయ ధరతో పోలిస్తే రూ.1.37 కోట్ల పెరుగుదల నమోదైంది. నివేదికల ప్రకారం, ఈ లావాదేవీపై స్థూల పెట్టుబడి రాబడి సుమారు 18.3 శాతం. ఈ ఫ్లాట్‌ విస్తీర్ణం 4,249 చదరపు అడుగులు కాగా, మూడు పార్కింగ్‌ స్థలాలు కూడా విక్రయంలో భాగంగా ఉన్నాయి.

ఇదీ చదవండి: రూ.4.63 లక్షల నెలవారీ అద్దెకు