General

రూ.4.63 లక్షల నెలవారీ అద్దెకు రణ్‌బీర్‌ కపూర్‌ ఫ్లాట్‌..!

రూ.4.63 లక్షల నెలవారీ అద్దెకు రణ్‌బీర్‌ కపూర్‌ ఫ్లాట్‌..!
  • మూడేళ్లలో రూ.1.75 కోట్ల ఆదాయం

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు మరోసారి వార్తల్లో నిలిచాయి. పుణెలోని ప్రముఖ ట్రంప్‌ టవర్స్‌లో ఉన్న తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను మూడేళ్లకు లీజుకు ఇచ్చారు. దీనిపై నెలకు ప్రారంభ అద్దె రూ.4.63 లక్షలుగా నిర్ణయించారు.

మూడేళ్ల ఒప్పందం ద్వారా ఆయనకు మొత్తం సుమారు రూ.1.75 కోట్ల అద్దె ఆదాయం లభించనుంది. ఆస్తి రిజిస్ట్రేషన్‌ పత్రాలను పరిశీలించిన సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ వివరాల ప్రకారం ఈ లావాదేవీ జరిగినట్లు హిందుస్థాన్‌ టైమ్స్‌ వెల్లడించింది.

పుణెలోని కల్యాణి నగర్‌–యెరవాడ ప్రాంతంలో ఉన్న ట్రంప్‌ టవర్స్‌ టవర్‌-ఏలోని పదో అంతస్తులో ఈ అపార్ట్‌మెంట్‌ ఉంది. దీని విస్తీర్ణం సుమారు 6,094 చదరపు అడుగులు. మూడు కవర్డ్‌ కార్‌ పార్కింగ్‌ స్థలాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.

2026 అక్టోబర్‌ 6న లీవ్‌ అండ్‌ లైసెన్స్‌ ఒప్పందం రిజిస్టర్‌ అయింది. 2026 సెప్టెంబర్‌ 20 నుంచి 2029 సెప్టెంబర్‌ 19 వరకు మూడేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఒప్పందం ప్రకారం మొదటి ఏడాది నెలవారీ అద్దె రూ.4,63,050. రెండో ఏడాది నుంచి 5 శాతం పెరిగి నెలకు రూ.4.86 లక్షలకు చేరుతుంది.

మూడో ఏడాది నెలవారీ అద్దె సుమారు రూ.5.11 లక్షలు అవుతుంది. ఈ మూడేళ్ల కాలానికి అద్దెదారు రూ.27.78 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌ కూడా చెల్లించారు. ఇది మొదటి ఏడాది ఆరు నెలల అద్దెకు సమానం.

ఇదీ చదవండి: రూ.3 కోట్లకు కొన్నారు.. రూ.6 కోట్లకు అమ్మారు

రణ్‌బీర్‌ కపూర్‌ పెట్టుబడులు

రణ్‌బీర్‌ కపూర్‌ 2015లో ఈ అపార్ట్‌మెంట్‌ను రూ.11 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసినట్లు ఆస్తి పత్రాలు సూచిస్తున్నాయి. ఆయన తండ్రి, దివంగత నటుడు రిషి కపూర్‌ కూడా అదే సమయంలో ట్రంప్‌ టవర్స్‌లో మరో అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశారు.

ఈ భవన సముదాయంలో రెండు 23 అంతస్తుల టవర్లు ఉండగా, ఒక్కో టవర్‌లో 46 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటిని పంచ్‌షీల్‌ రియాల్టీ, ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశాయి.

ఈ అపార్ట్‌మెంట్‌ను రణ్‌బీర్‌ గతంలోనూ అద్దెకు ఇచ్చారు. 2023లో పుణెకు చెందిన ఆటోమొబైల్‌ విడిభాగాల తయారీ సంస్థ డ్యూరోషాక్స్‌కు లీజుకు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో నెలవారీ అద్దె రూ.4 లక్షలతో ప్రారంభమై, ఏటా 5 శాతం చొప్పున పెరిగేలా ఒప్పందం కుదిరింది.

తాజా ఒప్పందంలో ప్రారంభ అద్దె రూ.4.63 లక్షలకు చేరడం గమనార్హం. కాగా, రణ్‌బీర్‌ ఇటీవల పుణె జిల్లాలోని ముల్షీ తాలూకా పింప్రి గ్రామంలో సుమారు 25.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు భూఖండాలను రూ.16.42 కోట్లకు కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.

అయోధ్యలోని ఓ ప్రీమియం ప్లాటెడ్‌ ప్రాజెక్టులోనూ సుమారు రూ.3.31 కోట్ల విలువైన స్థలాన్ని కొనుగోలు చేశారు. ముంబైలోని పాలీ హిల్‌ ప్రాంతంలో గతంలో ఉపయోగించిన తన అపార్ట్‌మెంట్‌ను కూడా ఐదేళ్లకు నెలకు రూ.11 లక్షల అద్దెకు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

ఇదీ చదవండి: ఫిన్‌టెక్‌ సంస్థకు సైఫ్‌ అలీఖాన్‌ ఆఫీస్‌ స్పేస్‌ లీజు