General

హైదరాబాద్ రోడ్లకు కొత్త కనెక్టివిటీ.. 

హైదరాబాద్ రోడ్లకు కొత్త కనెక్టివిటీ.. 
  •  మిస్సింగ్ లింక్ రోడ్లతో ట్రాఫిక్‌కు చెక్

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లే పరిష్కారం కాదు.. ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధి కూడా అంతే కీలకం. ఒక ప్రధాన రహదారి నుంచి మరో రహదారికి వెళ్లేందుకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని మార్చేందుకు మిస్సింగ్ లింక్ రోడ్లపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.

నగరంలోని ప్రధాన రహదారులను అనుసంధానిస్తూ కొత్త లింక్ రోడ్ల నిర్మాణానికి తాజాగా అడుగులు పడుతున్నాయి. దీనివల్ల ప్రయాణ దూరం తగ్గడంతో పాటు ప్రధాన జంక్షన్లపై వాహనాల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీకి ప్రధాన కారణాల్లో ఒకటి.. అనుసంధాన రహదారులు లేకపోవడం. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ప్రధాన రహదారులపై ఆధారపడ‌క త‌ప్ప‌దు. దీంతో కీలక జంక్షన్ల వద్ద వాహనాల రద్దీ పెరుగుతోంది.

ఈ సమస్యను గుర్తించిన అధికారులు మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన రహదారులను అనుసంధానించేలా రూపొందించిన ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపినట్లు తాజా నివేదిక వెల్లడిస్తోంది. మొత్తం 13 ప్రతిపాదనలకు ఆమోదం లభించగా.. వీటిలో వివిధ ప్రాంతాల్లో లింక్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన భూసేకరణ, ఇతర అంశాలను పరిశీలించి పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.

శివారు ప్రాంతాల కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ రహదారుల అనుసంధానంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇప్పటికే మిస్సింగ్ లింక్ రోడ్ల ప్రాజెక్టు కింద 133 లింక్ రోడ్లను గుర్తించి, సుమారు 126.20 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలనే ప్రణాళిక రూపొందించారు. తొలి దశలో కొన్ని రోడ్లను పూర్తి చేయగా, మరికొన్ని దశలవారీగా చేపట్టారు. ఇటీవల బైరాగిగూడ-నార్సింగి, బడంగ్‌పేట్-నాదర్‌గుల్, తొండుపల్లి-ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు వంటి ప్రాంతాల్లోనూ కొత్త రహదారులు, మిస్సింగ్ లింక్‌ల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. కొన్ని మార్గాల్లో రోడ్ల వెడల్పు పెంచడంతో పాటు భూసేకరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

ఇదీ చదవండి: విదేశాల్లో సంపాదన..స్వదేశంలో సొంతిల్లు

లింక్ రోడ్లకూ ప్రాధాన్యం

నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం పలు రకాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతోంది. ఒకవైపు ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం కొనసాగుతుండగా.. మరోవైపు లింక్ రోడ్ల ద్వారా అంతర్గత ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించే ప్రయత్నం జరుగుతోంది. \

కేబీఆర్ పార్క్ పరిసరాల్లో హెచ్‌-సిటీ ప్రాజెక్టు కింద సుమారు 4.3 కిలోమీటర్ల ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కూడా ఈ రవాణా మౌలిక సదుపాయాల విస్తరణలో భాగమే.

ప్రయాణ దూరం తగ్గి.. సమయం ఆదా

  • మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం పూర్తయితే వాహనదారులకు పలు ప్రయోజనాలు కలగనున్నాయి.
  • ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది.
  • ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి.
  • ప్రయాణ దూరం, సమయం తగ్గే అవకాశం ఉంటుంది.
  • శివారు ప్రాంతాల నుంచి నగరంలోని ప్రధాన ప్రాంతాలకు కనెక్టివిటీ మెరు గుపడుతుంది.
  • అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు, ఇతర వాహనాల రాకపోకలకు వెసులుబాటు కలుగుతుంది.
  • కొత్త రహదారుల కారణంగా ఆయా ప్రాంతాల్లో వాణిజ్య, నివాస అభివృద్ధికి అవకాశం పెరుగుతుంది.

భవిష్యత్ అవసరాలకు ముందస్తు ప్రణాళిక

హైదరాబాద్ విస్తరణతో పాటు వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. కొత్తగా ఏర్పడుతున్న నివాస సముదాయాలు, వాణిజ్య కేంద్రాలు, ఐటీ సంస్థలకుఅనుగుణంగా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేవలం ప్రధాన రహదారుల విస్తరణపైనే కాకుండా.. వాటిని అనుసంధానించే చిన్న చిన్న రహదారుల అభివృద్ధిపైనా దృష్టి సారించడం కీలకంగా మారింది.

మొత్తానికి హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మిస్సింగ్ లింక్ రోడ్లు కీలకంగా మారనున్నాయి. ప్రతిపాదనల నుంచి క్షేత్రస్థాయి నిర్మాణాల వరకు పనులు ఎంత వేగంగా ముందుకు సాగుతాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

ఇదీ చదవండి: కొల్లూరులో లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ విల్లాలు