- నిర్వహణ సంస్థలకు ఎంతవరకు అధికారం ఉంది?
- ఫ్లాట్ యజమానుల హక్కులేమిటి?
అపార్ట్‌మెంట్లలో నిర్వహణ ఛార్జీల (మెయింటెనెన్స్) చెల్లింపులపై వివాదాలు తలెత్తినప్పుడు ఫ్లాట్ యజమానులపై ఒత్తిడి తెచ్చేందుకు ఆహార డెలివరీ సిబ్బంది, ఇంటి పనివాళ్లు, అతిథుల ప్రవేశాన్ని అడ్డుకోవచ్చా? బిల్డర్ నియమించిన నిర్వహణ సంస్థకు ఇలాంటి అధికారం ఉంటుందా? ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో చోటుచేసుకున్న ఘటన ఈ ప్రశ్నలను తెరపైకి తెచ్చింది.
నిర్వహణ సరిగా లేదని నాలుగు నెలలుగా మెయింటెనెన్స్ చెల్లింపులు నిలిపివేసిన నివాసితులకు, డెలివరీలు, పనివాళ్లు, సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు విధించారనే ఆరోపణలు రావడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో నిర్వహణ సంస్థల అధికారాలు, నివాసితుల హక్కులు, చట్టపరమైన మార్గాలపై చర్చ జరుగుతోంది.
గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని అజ్నారా హోమ్స్ అపార్ట్‌మెంట్ సముదాయంలో అక్టోబర్ 25న పెద్ద సంఖ్యలో నివాసితులు నిరసనకు దిగారు. నిర్వహణ సరిగా లేకపోవడం, బిల్లుల్లో పారదర్శకత లేకపోవడం, ఫిర్యాదులను పరిష్కరించకపోవడం వంటి కారణాలతో నాలుగు నెలలుగా మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించడం నిలిపివేసినట్లు వారు తెలిపారు.
దీంతో బిల్డర్ నియమించిన నిర్వహణ సంస్థ డెలివరీ సిబ్బంది, ఇంటి పనివాళ్లు, అతిథుల ప్రవేశాన్ని అడ్డుకుందని ఆరోపించారు.
దీంతో నివాసితులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన నిత్యావసర వస్తువులను తీసుకోవడానికి ప్రధాన గేటు వరకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. పాలు, బ్రెడ్, కిరాణా సరుకులు, మందులు తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు.
వృద్ధులు, మహిళలు, ఇతర అవసరాలున్న నివాసితులకు ఈ పరిస్థితి మరింత అసౌకర్యం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణ సంస్థకు చెల్లింపులు నిలిపివేయడానికి కారణం సేవల్లో లోపాలేనని నివాసితులు వాదిస్తుండగా, నిర్వహణ వ్యవస్థను కొనసాగించాలంటే డబ్బు అవసరమని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: దేశంలో రికార్డు స్థాయికి ఆఫీస్ లీజింగ్
చట్టం ఏం చెబుతోంది?
ఈ వివాదంలో కీలకమైన అంశం నిర్వహణ బకాయిల వసూలుకు చట్టబద్ధమైన మార్గాలు ఉండటం, వాటిని వసూలు చేసేందుకు నివాసితులపై ఎలాంటి ఆంక్షలు విధించవచ్చనేది. ఉత్తరప్రదేశ్ అపార్ట్‌మెంట్ చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం, ఉమ్మడి ఖర్చుల బకాయిల కోసం అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్ కొన్ని నిబంధనలకు లోబడి అవసరమైన సేవలను నిలిపివేసే చర్యలు తీసుకోవచ్చు. అయితే, బకాయిలు ఆరు నెలలకు మించి ఉండాలి. కనీసం ఏడు రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి.
అసోసియేషన్ సాధారణ సభలో తీర్మానం ఆమోదించాలి. ఆ తీర్మానం ధ్రువీకరించిన ప్రతిని ఫ్లాట్ యజమానికి, సంబంధిత అధికారికి పంపాలి. అనంతరం ఒక నెల గడిచిన తర్వాత, తీర్మానాన్ని బహిరంగంగా ప్రదర్శించిన నిబంధనను కూడా పాటించాలి. అయితే, ఈ చట్టంలో ఆహార డెలివరీ సిబ్బంది లేదా ఇంటి పనివాళ్ల ప్రవేశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.
అజ్నారా హోమ్స్‌లో బకాయిలు నాలుగు నెలలకే పరిమితమయ్యాయని, ఆంక్షలు కూడా అసోసియేషన్ ద్వారా కాకుండా బిల్డర్ నియమించిన నిర్వహణ సంస్థ విధించిందని నివాసితులు ఆరోపించారు.
ఇదీ చదవండి: భారత రియల్ ఎస్టేట్‌లో విదేశీ పెట్టుబడుల జోరు
ఫ్లాట్ యజమానుల హక్కుల సంగతేంటి?
నిర్వహణ సంస్థకు అపార్ట్‌మెంట్‌ను నిర్వహించే బాధ్యత మాత్రమే ఉంటుంది; ఆస్తిపై యాజమాన్య హక్కులు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఫ్లాట్ల యజమానులు తమ ప్రాపర్టీని ఎలాంటి అనవసర జోక్యం లేకుండా వినియోగించుకునే హక్కు కలిగి ఉంటారని పేర్కొన్నారు. అదే సమయంలో, అపార్ట్‌మెంట్‌లో భద్రత, శుభ్రత, విద్యుత్ పరికరాలు, నీటి సరఫరా వంటి సేవలను నిర్వహించడానికి ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయని అంటున్నారు.
అంటే, నిర్వహణ ఛార్జీలు చెల్లించాల్సిన బాధ్యత నివాసితులపై ఉన్నప్పటికీ, బకాయిల వసూలు పేరుతో ఎలాంటి చర్యనైనా తీసుకోవచ్చని కాదు. మరోవైపు, నిర్వహణ సేవల్లో లోపాలున్నాయనే కారణంతో మెయింటెనెన్స్ చెల్లింపులను నిరవధికంగా నిలిపివేయడం కూడా వివాదాన్ని మరింత పెంచవచ్చు.
అపార్ట్‌మెంట్ నిర్వహణ అనేది కేవలం మెయింటెనెన్స్ బిల్లులు వసూలు చేయడానికే పరిమితం కాదు.
నివాసితులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం కూడా నిర్వహణ సంస్థ బాధ్యతలో భాగం. అదే సమయంలో ఉమ్మడి సేవలను కొనసాగించేందుకు నివాసితులు తమ వాటా చెల్లించాల్సి ఉంటుంది. బకాయిల వసూలు ఒక అంశమైతే, నివాసితుల రోజువారీ జీవనం, భద్రత, ఆస్తి వినియోగ హక్కులు మరో అంశం.
ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటిస్తూ, చట్టబద్ధమైన విధానాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని గ్రేటర్ నోయిడా ఘటన స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి: నియోపోలిస్ భూముల వేలంతో రూ.2,000 కోట్లపై హెచ్‌ఎండీఏ గురి
