General

టీడీఆర్.. నో స్టాక్‌!

టీడీఆర్..  నో స్టాక్‌!
టీడీఆర్‌.. అంటే అభివృద్ధి బదలాయింపు హక్కు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ భూ నిర్వాసితులకు అందిస్తున్న ఆర్థిక ప్రయోజనాలతో కూడుకున్న హక్కు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల విస్తరణ, రహదారుల అభివృద్ది, చెరువుల విస్తరణ, ఇతర అభివృద్ది పనులకు ప్రభుత్వం భూసేకరణ చేపడతుంది. ఇలా సేకరించిన భూముల కోసం నిధులను వెచ్చించకుండా.. ప్రభుత్వ విలువ ఆధారంగా రెట్టింపు మొత్తంలో టీడీఆర్‌ను ఇస్తున్నాయి. పట్టా భూములకు 400 శాతం, చెరువుల్లోని శిఖం భూములకు, గ్రామ కంఠం భూములకు 200 శాతం లెక్కన టీడీఆర్‌ అందుతుంది. దీనివల్ల భూమిని కోల్పోయిన యజమానులకు తక్షణమే టీడీఆర్‌ రూపంలో నష్టపరిహారం అందుతుంది. ఈ టీడీఆర్‌ను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో ఎక్కడైనా వినియోగదారులు అదనపు అంతస్తుల నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చు.

టీడీఆర్‌ ఎవరికి అవసరం

బిల్డర్లు, నిర్మాణ సంస్థలకు భూ విస్తీర్ణం తక్కువగా అందుబాటులో ఉండి, అక్కడ ఎక్కువ అంతస్తులు కట్టుకోలేకపోయే అవకాశం లేనప్పుడు టీడీఆర్‌ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 200 గజాల విస్తీర్ణంలో రెండు అంతస్తులే కట్టుకునే అవకాశం ఉంటుంది. పార్కింగ్‌ వసతి ఉంటే.. టీడీఆర్‌ సాయంతో మరో అంతస్తును నిర్మించుకోవచ్చు. 300, 400, 500గజాల్లో టీడీఆర్‌ను ఉపయోగించి నాలుగు లేదా ఐదు అంతస్తులు నిర్మించుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా 300 నుంచి 400 గజాల విస్తీర్ణంలోని భవన సముదాయాలు టీడీఆర్‌ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నాయి. 600 గజాల్లోపు స్థలాల్లో గరిష్ఠంగా ఐదు అంతస్తులు నిర్మించుకోవచ్చు. అంతకు మించి భూ విస్తీర్ణం అందుబాటులో ఉంటే.. ఆరు అంతస్తులకు అనుమతి తీసుకున్న వారు.. అదనపు సెట్‌ బ్యాక్‌ అవసరం లేకుండా, టీడీఆర్‌తో మరో రెండు అంతస్తులు నిర్మించుకోవచ్చు. అలాగే 7 అంతస్తుల అనుమతితో తొమ్మిది, 8 అంతస్తుల అనుమతితో 10, పది అంతస్థుల అనుమతితో 12 అంతస్తులను అధికారికంగా కట్టుకోవచ్చు. నగరంలో ఈ తరహాలో చాలా అపార్ట్‌మెంట్లు అదనపు అంతస్తులు నిర్మిస్తున్నాయి. చిన్న నిర్మాణాలే కాకుండా హైరైజ్ భవనాలు నిర్మిస్తున్న బిల్డర్లు సైతం టీడీఆర్‌ ను ఉపయోగించి మరిన్ని ఎక్కువ అంతస్థులు నిర్మిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

టీడీఆర్‌ విలువను ఎలా లెక్కిస్తారు?

సాధారణంగా ప్రభుత్వ భూ విలువ చదరపు గజం లెక్కన ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూసేకరణ చేస్తే అక్కడ భూమి విలువకు నాలుగు రెట్లు భూ యజమానికి టీడీఆర్‌ను ప్రభుత్వం అందిస్తుంది. ఉదాహరణకు బంజారాహిల్స్ ప్రభుత్వ విలువ ప్రకారం చదరపు గజం 41వేలుగా ఉంది. అక్కడి ఓ వ్యక్తికు సంబందించిన స్థలాన్ని 100 గజాల మేర రోడ్డు విస్తరణకు ప్రభుత్వం తీసుకుంటే.. అతనికి 400 గజాలకు ప్రభుత్వ ధరతో టీడీఆర్‌ ఇస్తుంది. అంటే అతనికి ప్రభుత్వం ఇచ్చిన టీడీఆర్‌ విలువ 1.64 కోట్ల రూపాయలుగా ఉంటుంది. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో ఆ భూమికి సంబంధించి ప్రభుత్వ మార్కెట్ విలువ పెరిగితే టీడీఆర్‌ విలువ కూడా పెరుగుతుంది. బంజారాహిల్స్ లోని వ్యక్తి దగ్గరున్న టీడీఆర్‌ను అత్తాపూర్ లోని 200 గజాల ఇంటి యజమాని కొనాల్సి వస్తే ఏం జరుగుతుందంటే.. అత్తాపూర్ లో 200 గజాల ప్రభుత్వ ధర 32లక్షలు. ఆ విలువకు సమానమైన మొత్తంలో బంజారాహిల్స్ నుంచి టీడీఆర్‌ను కొంటే సరిపోతుంది. అంటే బంజారాహిల్స్ నుంచి 19.51 చదరపు గజాల టీడీఆర్‌ను కొనాల్సి ఉంటుంది. టీడీఆర్‌ లావాదేవీల్లో కొనుగోలుదారుడు అమ్మేవారితో బేరసారాలు అడే అవకాశం ఉంటుంది. ఇరువురి అవసరం, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని టీడీఆర్‌ ధరను నిర్ణయించుకుంటారు.

Related News

celebrity-homes

No articles available.

No posts available
No posts available