- నగరాభివృద్ధిపై అపోహలు తొలగించేందుకే వచ్చాను
- విదేశీ సంస్థల్ని ఆకర్షించినట్లే మన రియాల్టీని ప్రోత్సహిస్తాం
- మెరుగైన ప్రభుత్వ పాలసీలపై బిల్డర్ల సూచనల్ని కోరిన సీఎం
- రీజినల్ రింగ్ రోడ్డు, రింగ్ రైల్ ప్రాజెక్టు, మెట్రో రైలు ఫేజ్ 2తో రియల్ గ్రోత్
(కింగ్ జాన్సన్ కొయ్యడ, 9030034591) ఎంతో ఆశతో.. ఆత్రుతతో.. 2023 డిసెంబర్ నుంచి.. ఎదురు చూస్తున్న హైదరాబాద్ నిర్మాణ రంగానికి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ఊపిరిలూదారు. రియల్ రంగంలో నూతనోత్తేజాన్ని నింపారు. భావోద్వేగంతో కూడిన ప్రసంగం చేశారు. సభలో పాల్గొనే ప్రతిఒక్కరినీ హత్తుకునేలా మాట్లాడారు. ఎక్కడెక్కడో బయటి దేశాలకెళ్లి.. తమ భాష, భావం తెలియని వారిని కలిసి.. పెట్టుబడుల్ని పెట్టాలని ఆహ్వానిస్తామని గుర్తు చేశారు. అలాంటిది, ఇక్కడే పుట్టి, పెరిగి, ఈ జాతి కోసమే సంపదను పెట్టేవారిని ఎందుకు వదులుకుంటాం?
మీ పెట్టుబడులకు రక్షణ కల్పిస్తాం. మీకు లాభాలొచ్చేలా ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది. మొట్టమొదటి ప్రాధాన్యత మీకే ఇస్తున్నాను.. పాలసీల కోసం అడగండి.. ఇంప్రూవ్‌మెంట్ ఎలా చేయాలో చెప్పండి.. మీ అనుభవాల్ని మాతో పంచుకోండి. మన నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందాం.. అంటూ రియల్ రంగాన్ని సీఎం ఆహ్వానించారు. శుక్రవారం క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకు విచ్చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలోని సారాంశమిదే..
''అపోహలు, అనుమానాల్ని తొలగించి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుని ముందుకెళుతున్న సమయంలో.. అపోహల్ని సృష్టించి అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్లకు కనువిప్పు కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో.. ప్రపంచానికి తెలియజేసేందుకు క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నాను.
ప్రపంచ దేశాలలో అభివృద్ధి అనేది రెండు విభాగాలుగా ఉంటుంది. ఒకటి పాలసీలు, రెండు కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ అసెట్స్. ఈ రెండే ఏ నగరానికి గ్రోత్ ఇంజిన్లు. ఎప్పుడైనా పాలసీలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అందులో పారదర్శకత ఉండాలి. అవి ప్రజలకు అందుబాటులో ఉండాలి. అప్పుడే పెట్టుబడులు ఆకర్షించినప్పుడు.. అభివృద్ధి అనేది దానంతట అదే వేగంగా పరుగెత్తుతుంది. కుతుబ్‌షా నుంచి మొదలుపెడితే వైఎస్సార్ వరకూ, రాజీవ్‌గాంధీ, నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు వంటివారు ఈ నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. పాలసీల నిర్ణయాల్లో పరాలసీస్ లేకుండా వీరు నిర్ణయాలు తీసుకోవడం వల్లే, పాలకులు మారినా పాలసీ నిర్ణయాలు మారకపోవడం వల్లే ఈ రోజు మనం ప్రపంచ దేశాలతో పోటీపడుతున్నాం. ప్రభుత్వాలు మారినప్పుడు సహజంగానే కొన్ని అనుమానాలు ఉంటాయి.
పారదర్శక పాలసీలను ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ పెట్టుబడులకు రక్షణ కల్పిస్తాం. మీ పెట్టుబడులకు లాభాలొచ్చేలా ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది. నాది అని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు రాజకీయ పార్టీలు సృష్టించే అనుమానాలకు మీరు ఊతమిస్తే.. అంతిమంగా మీ వ్యాపారానికే నష్టమవుతుంది. వారి అపోహలను మీరు వేగంగా వ్యాపింపజేస్తే అది అంతిమంగా మీ అందరికీ, మనందరికీ, దేశ సంపదకూ నష్టాన్ని చేకూరుస్తుంది. అలాంటి అపోహలుంటే తొలగించడానికే ప్రత్యేకంగా ఈ ప్రాపర్టీ షోకు విచ్చేశాను.
ఇన్వెస్ట్‌మెంట్లు కోసం రోడ్ షోలు పెడుతున్నాం.. యూఎస్ఏ, అమెరికా, సింగ్‌పూర్, జపాన్, సౌత్ కొరియా, దుబాయ్ వంటి నగరాలకు పర్యటన చేస్తున్న మేము.. పెట్టుబడులు పెట్టండని ఆహ్వానిస్తున్నప్పుడు.. మా నగరాన్ని అభివృద్ధి చేయమని ఇతర దేశాల్ని పిలుస్తున్న మేము.. ఈ నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం పాటు పడే మిమ్మల్ని మేమెందుకు ప్రోత్సహించము? భాష రానివారిని, భావం తెలియని వారిని, ఈ రాష్ట్రంతో అనుబంధం లేనివారిని.. మా నగరానికి రండి.. అవకాశాల్ని కల్పిస్తామని చెబుతున్న మేము.. ఇక్కడనే పుట్టి, ఇక్కడ్నే పెరిగి, మీ సంపదను మొత్తం మీ జాతికే అంకితం చేస్తున్న మిమ్మల్ని.. మేమెందుకు మిమ్మల్ని వదులుకుంటాము? అంటే, అపోహల్ని సృష్టించేవారితో మీరు ప్రయాణం చేస్తే ఇలాంటి అపోహలొస్తాయి. అందుకే, మొట్టమొదటి ప్రాధాన్యత మీకే, మీరు పోటీ పడండి. పాలసీల కోసం అడగండి.. ఇంప్రూవ్‌మెంట్ ఎలా చేయాలో చెప్పండి.. మీ అనుభవాల్ని మాతో పంచుకోండి. మన నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుంటాం.
నేను ప్రతి వ్యక్తిని నేను సంతోష పెట్టలేకపోవచ్చు. నేను మధ్యతరగతి మనస్థత్వం ఉన్నవాడిని. సమాజం పట్ల భయం, గౌరవం ఉంటుంది. ఉన్నంతలో సర్దుకుపోదామనే ఆలోచన ఉంటుంది. నేను సగటు ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప.. కొల్లగొట్టి విదేశాలకు తరలించాలనుకునే గొప్ప మనసు, పెద్ద మనసు లేనివాడిని. అందుకే, కొన్ని ప్రతిపాదనలు వచ్చినప్పుడు ఆమోదించకపోవచ్చు. గతంలో సూపర్ లగ్జరీస్ పొందినవారిని, స్పెషల్ ప్రివిలేజ్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నవారికి సహజంగానే కోపం వస్తుంది. అలాంటివారికి నేను నచ్చకపోవచ్చు. వాళ్లకు నేను ఎప్పటికీ సహకరించను. కానీ, పారదర్శకమైన పాలసీలను అందించేందుకు నాకు అభ్యంతరం లేదు.
నేను పాలసీలతో ఇంప్రెస్ చేస్తాను. నేను ఓపెన్ మైండ్‌తో ఉన్నాను. ప్రజలకు ఉపయోగపడేది.. ఈ నగరానికి ప్రయోజనం కలిగించేది.. తద్వారా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే పాలసీలను మీరు సజెస్ట్ చేయండి.. అలాంటి వాటిని రూపొందించడానికి నేనేప్పుడు సిద్ధంగా ఉంటాను. హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే నెంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దడానికి మీ ఆలోచనలను నాతో పంచుకోండి. ఎందుకంటే, మీరు ప్రపంచాన్ని చూస్తున్నారు కాబట్టి.
నాకు టెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ మీకు వన్ ఫ్యాక్టరే ఉంటుంది. దటీజ్ కన్‌స్ట్రక్షన్, దటీజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మాస్ డెవలప్‌మెంట్, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేయాలి? ఆనాడు చంద్రబాబు నాయుడు కానీ వైఎస్సార్ కానీ హైటెక్ సిటీ, హైదరాబాద్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు వంటివి తీసుకురాకపోయి ఉంటే.. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోయి ఉంటే.. ఈ రోజు మీరు ఇంత గొప్ప ప్రాపర్టీ షో చేసుకునేవారా? ఆ రోజు ఆ విజన్ చేసిన నాయకుల మీద కూడా ఎలిగేషన్స్ వచ్చాయి. ఎక్కడ ఏ డెవలప్‌మెంట్ చేసినా ఎవరికో ఒకరికి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు నేను భారత్ ఫ్యూచర్ సిటీని కాలుష్యరహిత నగరంగా మార్చాలని అనుకుంటున్నప్పుడు.. బ్రహ్మాండమైన నగరంగా నిర్మించాలని ప్రణాళికలు వేసినప్పుడు.. అది ఫోర్త్ సిటీ అని అంటే.. అది ఫోర్ బ్రదర్స్ సిటీ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ సిటీని మీ కోసమే డెవలప్ చేస్తున్నా.. మీరే కదా నా బ్రదర్స్.. మీ కోసమే కదా డిజైన్ చేస్తున్నా.. వై ఐ షుడ్ కేర్ ఆల్ దోస్ కామెంట్స్?
జైపాల్‌రెడ్డి హెల్ప్..
ఆ రోజు జైపాల్‌రెడ్డి హైదరాబాద్ నగరానికి వయాబిలిటీ గ్యాప్ ఫండ్ ద్వారా మెట్రో మంజూరు చేయకపోతే.. దేశంలోనే అభివృద్ధి చెందిన రెండో మెట్రో నగరంగా హైదరాబాద్ ఉంటుండేనా? ఆ రోజు వైఎస్సార్ ప్రతిపాదన ఇస్తే స్టక్ డౌన్ అయిన మెట్రోకు జైపాల్‌రెడ్డి మంజూరు చేశారు. ఆతర్వాత మెట్రోను విస్తరించకపోవడం వల్ల ఈ రోజు తొమ్మిదో ప్లేస్‌కు వెళ్లాం. మనం పదేళ్లను నెగ్లెక్ట్ చేశాం. మెట్రో విస్తరించి ఉంటే.. ఈ ట్రాఫిక్ జామ్‌కు కొంతయినా పరిష్కారం వచ్చి ఉండేది కదా! ఈ రోజు హైటెక్ సిటీ వద్ద ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నియోపోలిస్ వరకూ విస్తరించి ఉంటే.. అభివృద్ధి జరిగి ఉండేది కదా.. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంటే ఎయిర్‌పోర్టుకు మెట్రో కనెక్టివిటీని ఎందుకివ్వలేదు? ఎందుకు డిజైన్ చేయలేదు? డిజైన్ చేసినోళ్లు కూడా ఓఆర్ఆర్ మీదుగా డిజైన్ చేశారు. జూబ్లీహిల్స్‌లో ఉన్నోళ్లు బంజారాహిల్స్‌లో ఉన్నోళ్లు ఎంతమంది మెట్రో ఎక్కుతారు? హైటెక్ సిటీ నుంచి
ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కినా కూడా అదే స్పీడుతో ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
మల్టీమోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది జనసాంధ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండాలి. మనిషి అనేటోడే లేడు.. మనిషి అనే వాడే రాని ప్రాంతాల్లో డిజైన్ చేస్తే ఎలా? ఎందుకంటే హైటెక్‌సిటీకి పక్కన చెరువులో ఫారెస్టో ఉన్నప్పుడు అందులో ఎవరెక్కాలి? అందుకే, నాగోలు నుంచి ఎల్‌బీనగర్, ఓవైసీ హాస్పిటల్, రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రోను రీడిజైన్ చేశాం. అదేవిధంగా, ఎల్‌బీనగర్ నుంచి హయత్ నగర్‌కు మెట్రో వేయమని చెప్పాను. అదొక కొత్త నగరం ఇప్పుడు. కూకట్‌పల్లి దాటిన తర్వాత పటాన్‌చెరు వరకూ విస్తరించమన్నాం. హైటెక్‌సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రక్ట్, కోకాపేట్ నియోపోలిస్ కు మెట్రోను విస్తరించమన్నాం. ఇలా ఎక్కడెక్కడ లాస్ట్ మైల్ కనెక్టివిటీ తక్కువుందో.. అక్కడ మెట్రోను డెవలప్ చేసేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నా.
రెండు వందల ఎకరాలను..
ఈ రోజు కంటోన్మెంట్ బాటిల్‌నెక్ ఉంది. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు, మన్మోహన్‌సింగ్ పీఎంగా ఉన్నప్పుడు కూడా ఒక్క అంగుళం డిఫెన్స్ ల్యాండ్స్ కూడా ఇవ్వలేదు. అలాంటిది, ప్యారడైజ్ నుంచి బాటిల్‌నెక్స్‌గా ఉన్న దాదాపు రెండు వందల ఎకరాలను.. అటు శామీర్‌పేట్ వైపు కానీ.. నేను సీఎం అయ్యాక ఢిల్లీకి వెళ్లి.. ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతుల్ని తీసుకొచ్చా. ఇవన్నీ మన నగరం యొక్క ప్రతిష్ఠ పెంచడానికి. శామీర్‌పేట్, మేడ్చల్ వరకూ మెట్రో వేయడానికి ప్రతిపాదనల్ని ఇచ్చాం. శామీర్‌పేట్, మేడ్చల్‌లు కూడా ఒక నగర స్థాయి విస్తరించాయి. వీటన్నింటినీ మనం అభివృద్ధి చేయడానికి ఒక సంకల్పం ఉండాలి. ప్రణాళిక ఉండాలి. దాంతో పాటు ప్రయత్నం ఉండాలి. అనుమతులు ఇచ్చేది ఢిల్లీలోనే కాబట్టి.. నేను ఎక్కడికి వెళ్లాలి? మీరు హైరైజ్ అనుమతుల్ని తెచ్చుకోవడానికి ఎక్కడికెళతారు? మెట్రో, మూసీ, ఎలివేటెడ్ కారిడార్ వంటివాటికి అనుమతి ఇవ్వాలన్నా.. గ్రాంట్స్ ఇవ్వాలన్నా.. లోన్స్‌కి సావరిన్ గ్రాంట్ ఇవ్వాలన్నా.. ఢిల్లీకి వెళ్లాల్సిందే. ఇది తెలియక కొందరు ఢిల్లీ టూర్ల గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు.
మనకు ఎయిర్‌పోర్టులొద్దా?
తెలంగాణలో ఒకే ఒక్క ఎయిర్‌పోర్టు ఉంది. అదే ఏపీలో అయితే ఆరేడు ఉన్నాయి. మహారాష్ట్రలో నలభై ఎయిర్‌పోర్టులున్నాయి. ఏ చిన్న రాష్ట్రానికెళ్లినా ఐదారు ఎయిర్‌పోర్టులున్నాయి. మరి, తెలంగాణకు రెండో ఎయిర్‌పోర్టు ఉండాలన్న ఆలోచన మేధావులకు రాలేదు. రెండు ఎయిర్‌పోర్టు అవసరం లేదా మిత్రులారా.. మీరు చెప్పండి.. అందుకే, నేను వచ్చాక ఢిల్లీకి వెళ్లి ఏవియేషన్ మినిస్టర్‌ను కలిసి వరంగల్, ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టులను తెచ్చాను. ఒకప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు మీ ఇంటికి రైల్వే స్టేషన్ ఎంత దూరం అనేవారు. విదేశీ నగరాల నుంచి వచ్చేవారు మీ ఎయిర్‌పోర్టుకు మీ ఇండస్ట్రీయల్ హబ్‌కు ఎంత దూరముంది? రీచ్ అయ్యేందుకు ఎంత టైమ్ పడుతుందని అడుగుతున్నారు.
మరి, అట్లాంటిది తెలంగాణకు అడిషినల్ ఎయిర్‌పోర్టులు ఉండాల్సిన అవసరం లేదా? అనుమతులు తేవాల్సిన అవసరం లేదా? దానికి అవసరమయ్యే నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తేవాలని లేదా? ఎయిర్‌పోర్టు వస్తే విమనం వచ్చి మా ఇంట్లో ఆగుతుందా? మీకే ఇన్వెస్ట్‌మెంట్లు వస్తాయి.. టైర్2, టైర్ 3 సిటీస్ కూడా డెవలప్ అవుతాయి. ఇండస్ట్రీయల్ గ్రోత్ వస్తే.. ఆటోమెటిగ్గా ఆదాయం రెండింతలు పెరుగుతాయి. అందుకే కదా ఎయిర్‌పోర్టు, మెట్రో, రిజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్ అనుమతుల్ని కేంద్రాన్ని అడిగా. 160 కిలోమీటర్ల ఓఆర్ఆర్ నిర్మాణం జరిగితేనే 3 లక్షల కోట్ల ఆదాయానికి తెలంగాణ రాష్ట్రం పెరిగింది. అందుకే, కేంద్రంతో మాట్లాడి ఆగిపోయిన 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు రింగ్ రైల్ కు అనుమతినిచ్చింది.
పదకొండు రింగ్ రోడ్లు..
విజయవాడ, బెంగళూరు, ఇతర హైవేలు కాకుండా.. ప్యారలల్‌గా లెవెన్ రింగ్ రోడ్స్ ప్లాన్ చేస్తున్నాం. కొత్త ఏరియా డెవలప్‌మెంట్ కోసం, కొత్త ల్యాండ్స్ ను అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం, శాటిలైట్ సిటీలను కట్టాలనే ప్రణాళికలతో ముందుకెళుతున్నాం. మంచినీటి కొరతను అధిగమించేందుకు రింగ్ బండ్‌ను కడుతున్నం. కొత్తగా 800 కేవీ సబ్ స్టేషన్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం.
ఫ్యూచరిస్టిక్ ప్లాన్ ఇదే..
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కోసం రూపొందించిన డిసెంబర్ 9న డెడికేట్ చేస్తున్నాం. తెలంగాణను మూడు వర్టికల్స్‌గా విభజించాం. కోర్ అర్బన్‌లో సర్వీస్ సెక్టార్, సెమీ అర్బన్ రీజియన్‌లో ఇండస్ట్రీయల్ సెక్టార్, ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చేది అగ్రికల్చర్ సెక్టార్‌లుగా డెవలప్ చేస్తున్నాం. దేశంలోనే మొదటిసారి రాష్ట్రానికి మొత్తం కలిపి ఒక పాలసీని తీసుకొస్తున్నాం. ఇందుకోం ఒక మెగా మాస్టర్ ప్లాన్‌ను తీసుకొస్తున్నాం. ఇవన్నీ అమలు చేసే క్రమంలో డీవియేషన్లను నియంత్రించడానికి కొన్ని కొత్త సంస్థలను తీసుకొచ్చాం. అందులో భాగమే హైడ్రా. రోడ్డు మీద నీళ్లు ఎందుకొస్తున్నాయ్? ఒకసారి ఆలోచించండి.
ఆ బాధ్యత మీదే..
తెలంగాణ అభివృద్ధి కోసం వేస్తున్న ప్రణాళికల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ప్రణాళికల్ని సిద్ధం చేయాల్సింది మేము. ప్రమోట్ చేయాల్సింది మీరు. మీకు ఇందులో ఏదైనా ఇబ్బంది ఉన్నా.. మరింత మెరుగ్గా ప్రభుత్వ పాలసీని చేయాలన్నా మీరు సజెస్ట్ చేయండి. టోని బ్లెయిర్ నుంచి హెచ్‌పీఎస్‌లో చదువుకున్న నలుగురు గ్లోబల్ సంస్థల హెడ్‌లు మనకు నాలెడ్జిని షేర్ చేస్తున్నారు. నాకు వేరే కోరికలు ఏమీ లేవు. ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు వైఎస్సార్ తీసుకెళ్లలేదు. సంపాదించింది తీసుకెళతారేమో కానీ సమాజం కోసం చేసింది ఎవ్వరూ తీసుకెళ్లరు. అది ఇక్కడే ఉంటుంది. ఆ మాత్రం జ్ఞానం, అవగాహన, పరిజ్ఞానం తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకుంది.
నాకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంది, పట్టుదల ఉంది, తెలియకపోతే అడిగి తెలుసుకునే సహనం ఉంది. రోజు పద్దెనిమిది గంటలు పని చేసే ఓపిక ఉంది. ఓపిక ఉంది. వయసు ఉంది. మీతో నాకు అనుబంధం ఉంది. మనందరం కలిసి నగరాన్ని గొప్పగా నిర్మించుకుందాం. ఏమైనా అపోహలుంటే తొలగించుకోండి. ప్రోయాక్టివ్‌గా రియాక్ట్ అవ్వండి. పాజిటివ్ నెరేషన్‌ను బిల్డ్ చేయండి. రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్. మీరేవిధంగా సెంటిమెంట్‌ను డ్రైవ్ చేస్తే ఆ విధంగా ఉంటుంది. కోకాపేట్‌లో నేను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ చేసినా. 8 లక్షల్నుంచి 12 లక్షలకు ఎకరా కొనుక్కున్న భూములున్నాయి. కానీ, అదే కోకాపేట్‌లో తర్వాత ఒక రోజు పద్నాలుగు కోట్లు అయ్యింది. ఇప్పుడు వంద కోట్లు అయ్యింది. రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్. దాన్ని మీరు ఎంత పాజిటివ్గా ముందుకు తీసుకెళితే.. మీకు అంత ప్రయోజనకరంగా ఉంటుంది. తెలంగాణను ఒక డెవలప్‌మెంట్ హబ్‌గా కావాలి. ఇక్కడ ఎవ్వరైనా రావొచ్చు. మీ పెట్టుబడులకు భద్రత ఉంది. అనుమతులతో కూడిన లాభాల్ని ఇప్పించే బాధ్యత నాది. రండి.. మనందరం కలిసి మన తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం.''
ఫ్యూచర్ సిటీ.. గొప్ప నగరంగా..
నేను నిర్మించాలని అనుకుంటున్న ఫ్యూచర్‌సిటీ.. వెయ్యేళ్లు అయినా గొప్ప ఆదర్శంగా ఉండేలా.. ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా. పునరుత్పాదక శక్తితో అల్ట్రా మోడ్రన్ సిటీని డిజైన్ చేస్తా. రిజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్, డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే, డెడికేటెడ్ రైల్వే కారిడార్ టు పోర్టు.. ఇలాంటివి భవిష్యత్తులో వందేళ్లు వెయ్యేళ్లు అయినా.. నేను నచ్చనోళ్లకు, నచ్చినోళ్లకు ఉపయోగపడేలా చేస్తాను. తెలంగాణకు యంగెస్ట్ సీఎంగా, రూల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు.. పెద్దపెద్ద చదువులు చదవకపోయినా నాకు కామన్ సెన్స్ ఉంది. తెలివితేటలకు, చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు.
చెరువులు, నాలాల దురాక్రమణ
నీళ్లు నిలవాల్సిన చెరువులను మనమే గుంజుకుంటిమి. నీళ్లు ప్రవహించాల్సిన నాలాలను మనమే ఆక్రమించుకుంటిమి. మరి, నీళ్లుండాల్సిన ప్లేస్‌కు మనం పోతే.. మన ప్లేస్‌లోకి నీళ్లొచ్చినయ్. మన కాలనీలకు, ఇళ్లకు నీళ్లు వస్తున్నయంటే.. మనమే కారణం. రెండు వేల చెరువులు ఇప్పుడు 450కి పడిపోయాయి. వాటిని పునరుద్ధరించాలని అనుకుంటున్నాం. ఆ క్రమంలో తెలిసీ తెలియక కొన్ని ఇబ్బందులు వస్తాయి. యుద్ధం చేసేటప్పుడు కొందరు అమాయకులు చనిపోతారు. బాటిల్‌నెక్స్‌ను తొలగించినప్పుడు కొందరు పెద్ద మనుష్యులు ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు. అలాంటివి మీకే ఇబ్బందులు ఎదురవుతాయి.
పోర్టులు లేకపోవడం వల్ల కష్టాలు
మనకు పోర్టులు లేకపోవడంతో పారిశ్రామికాభివృద్ధి జరగట్లేదు. పోర్టు ఎంత దూరంలో ఉందని అడుగుతున్నరు. జపాన్‌లో ఏ టయోటా, హ్యుందయ్ వంటి కంపెనీలతో మాట్లాడినా పోర్టు కనెక్టివిటినీ అడుగుతున్నరు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, అక్కడ్నుంచి బందర్ పోర్టుకు 8 లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవేతో పాటు రైల్వే లైన్ కనెక్టివిటీ చేసి.. రెండు వైపులా పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయడానికి ప్లాన్ చేసి అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలిచ్చాం. త్వరలోనే వాటికి అనుమతులు వస్తాయి. సో, పోర్టు సమస్యను శాశ్వతంగా తగ్గించేందుకు ప్లాన్ చేశాం. హైదరాబాద్ నుంచి విజయవాడ 300 కిలోమీటర్లు ఉంది. కానీ, ఇప్పుడు డెడికేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ హై వే వేస్తే అది 220 కిలోమీటర్లు అవుతుంది.
