General

చేవెళ్ల వైపు పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్

చేవెళ్ల వైపు పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నగర శివారు ప్రాంతాల వైపు చూస్తోంది. సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూములు, ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో కాస్త దూరం వెళ్తున్నారు నగరవాసులు. ఇదే సమయంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం మొదలవుతుండటంతో చాలా మంది సిటీకి కాస్త దూరమైనా పరవాలేదని సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఇల్లు, ఇంటి స్థలాలు కొంటున్నారు. ఈ క్రమంలోనే చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో భూములు, ఇల్లు, ఇంటి స్థలాలు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ వాసులు మొగ్గు చూపుతున్నారు. దీంతో చేవెళ్ల చుట్టు పక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదించింది. అందులోను గ్రేటర్ సిటీ నిర్మాణరంగం స్లోడౌన్ అయ్యింది. అయినప్పటికీ భాగ్యనగరంలో ఇళ్ల ధరలు, ఇంటి స్థలాల ధరలు మాత్రం తగ్గడం లేదు. దీంతో సామాన్య, మధ్య తరగతి వారు హైదరాబాద్ లో సొంతిల్లు కొనుగోలు చేయలేకపోతున్నారు. అందుకే ఇల్లు లేదా ఇంటి స్థలం వంటి స్థిరాస్తుల కొనుగోలుకు ప్రత్యమ్నాయ ప్రాంతాలపైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు సమీపంలో ఉన్న చేవెళ్ల వైపు చూస్తున్నారు హైదరాబాద్ వాసులు. అందుబాటు ధరల్లో భూములు, ఇళ్ల స్థలాలు లబిస్తుండటంతో అక్కడ రియాల్టీ రంగం జోరందుకుంటోంది. చేవెళ్ల హైదరాబాద్ కు అందులోను ఐటీ హబ్ కు సమీపంలో ఉండటం బాగా కలిసివస్తోంది. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 29 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది చేవెళ్ల. ఇక త్వరలో నిర్మాణం జరుపుకోనున్న రీజినల్ రింగ్ రోడ్డు చేవెళ్ల పక్క నుంచే వెళ్తుంది. అంతే కాదు చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీజాపూర్‌ రహదారి విస్తరణ పనులు ప్రారంభించడంతో ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ పోలీస్‌ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారిని నాలుగేళ్ల క్రితమే కేంద్రం జాతీయ రహదారిగా గుర్తించింది. 2018 లోనే ఈ రోడ్డును నాలుగు వరసలుగా మార్చేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడంతో అవసరమైన భూ సేకరణను అధికార యంత్రాంగం దాదాపు పూర్తి చేసింది. మరో నెల రోజుల్లో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. రెండేళ్లలో రహదారి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు రియల్ ఎస్టేట్ రంగం వారితో పాటు వివిధ రంగాల ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపుతున్నారు. పెద్ద కంపెనీల దృష్టి చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే రియల్ ఎస్టేట రంగం మంచి జోరందుకుంది. చేవెళ్ల పక్కనే ఉన్న శంకర్‌పల్లి మండలంలో అపార్ట్ మెంట్, విల్లాల నిర్మాణం బాగా పెరింది. ఇక్కడ చాలా మంది సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు ఫామ్ హౌజ్ లు ఏర్పాటు చేసుకున్నారు. వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేసుకున్నారు. మొయినాబాద్‌ మండలంలో ఇప్పటికే వందల సంఖ్యలో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారు. శంకర్ పల్లి పరిసరాల్లో భూములు, ఇంటి స్థలాల ధరలు ఆకాశాన్నంటడంతో పక్కనే ఉన్న చేవెళ్ల, షాబాద్‌ మండలాల వైపు చూస్తున్నారు. శంకర్ పల్లితో పోలిస్తే చేవెళ్ల, షాబాద్ లో భూములు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఇప్పటికే చేవెళ్ల మండలంలోని అంతారం పరిసరాల్లో పలు సంస్థలు విల్లాలు, ఫామ్ హౌజ్ లు నిర్మిస్తున్నాయి. కందవాడ, చేవెళ్ల, దామరగిద్ద గ్రామాలు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో రెసిడెన్షియల్‌ జోన్‌లుగా ఉండటంతో ఈ ప్రాంతాల్లో విల్లాల నిర్మాణానికి పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఎనిమిది నిర్మాణ సంస్థలు భూములు సేకరించి పెట్టుకున్నాయి. ఒక్కో విల్లా రూ.1.60 కోట్ల ధర చెబుతున్నారు. ఎకరా విస్తీర్ణంలో నిర్మిస్తున్న విల్లాకు రూ.9 కోట్లు చెబుతున్న ప్రాజెక్టులు ఉన్నాయి. భారీ పరిశ్రమలు-ప్రభుత్వ లేఅట్లు చేవెళ్ల సమీపంలోని షాబాద్‌ మండలంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతుండటంతో ప్రభుత్వం 160 ఎకరాల్లో భారీ వెంచర్‌ ఏర్పాటు చేసి ఇంటి స్థలాలను విక్రయించేందుకు సన్నద్దమవుతోంది. ఇప్పటికే కుమ్మరిగూడ, షాబాద్‌ పట్టణ కేంద్రాలకు మధ్య ఉన్న భూములను రైతుల నుంచి సేకరించింది ప్రభుత్వం. త్వరలో అభివృద్ధి పనులు చేపట్టి ప్లాట్‌ లను విక్రయించేందుకు ప్రాణాళికలు సిద్దం చేస్తున్నారు అధికారులు. పంచాయతీ అనుమతులతో వెంచర్‌ లు ఏర్పాటు చేసి ప్లాట్‌లు విక్రయించకుండా ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో రియల్ రంగ ఇన్వెస్టర్లు వ్యవసాయ భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమ దగ్గర ఉన్న తక్కువ బడ్జెట్‌తో 5 నుంచి 10 గుంటల చొప్పున భూములను కొనుగోలు చేస్తున్నారు. కొన్ని నెలలుగా ప్లాట్‌ల క్రయ విక్రయాల్లో స్తబ్ధత నెలకొన్న నేపధ్యంలో తక్కువ విస్తీర్ణంలో భూముల కొనుగోలు పెరిగింది. మరీ ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, మధ్య తరగతి వాళ్లు ఐదారుగురు కలిసి ఎకరం భూమి కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారని స్థానిక రియాల్టీ మార్కెటింగ్ వర్గాలు చెబుబుతున్నాయి. క్రమంగా పెరుగుతున్న భూముల ధరలు చేవెళ్ల, షాబాద్‌ మండలాల్లో ఈ మధ్య కాలంలో భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత సంవత్సరం ఇక్కడ ఎకరా కోటిలోపు ఉన్న భూములు ఇప్పుడు కోటిన్నర రూపాయల నుంచి ఆ పైన ధరలు పకుతున్నాయి. ఇక ప్రధాన రహదారులకు పక్కన ఉన్న భూములకు మరింత డిమాండ్‌ ఉంది. రోడ్ సైడ్ ఉండే భూములకు ఎకరా రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పలుకుతున్నాయి. ప్రధానంగా చేవెళ్ల పట్టణంతో పాటు కందవాడ, ఆలూరు, గుండాల, షాబాద్‌ మండలాల్లో నాగర్‌ గూడ, చందన్‌ వెళ్లి, హైతాబాద్‌ ప్రాంతాల్లో భూములకు డిమాండ్‌ పెరిగింది. కొందరు రియల్టర్లు గుంటల్లో భూమిని కొని గజాల చొప్పున విక్రయిస్తున్నారు. ఎకరా భూమి కొనేంత స్థోమత లేని వారు 5 నుంచి 10 గుంటలు కొనుగోలు చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ అనుమతులు ఉన్న వెంచర్‌ లలో ప్లాట్‌ లకు ఇక్కడ భారీ డిమాండ్‌ ఉంది. వీటిని కొనుగోలు చేసేందుకు మధ్య తరగతి వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ గజం సగటున రూ.12 వేల నుంచి 20 వేల రూపాయల మధ్య ఉంటోంది. గతంలో పంచాయతీ అనుమతులతో చేసిన లే అవుట్‌లలో ప్లాట్‌లు సైతం గజం రూ.10వేల పైనే ధర పలుకుతున్నాయి. నిర్మాణ అనుమతులకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో అనుమతులున్న వెంచర్‌లలోనే ప్లాట్‌లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ వెంచర్లు ప్రభుత్వం రైతుల నుంచి భూసేకరణ చేసి వెంచర్లుగా అభివృద్ది చేసి, ప్లాట్లను విక్రయించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. తక్కువలో తక్కువగా 50 ఎకరాలు ఆపైన భూముల లభ్యత ఉండే ప్రాంతాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే షాబాద్‌ మండలంలోని కుమ్మరిగూడ, శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ ప్రాంతాల్లో లేఅవుట్‌లు చేసేందుకు రైతుల నుంచి భూములు సేకరించింది ప్రభుత్వం. పరిహారానికి బదులు ఎకరా భూమి ఇచ్చే రైతులకు 650 నుంచి 750 గజాల అభివృద్ధి చేసిన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించేలా పధకాన్ని రూపొందించారు. ఇందుకు రైతులు సైతం సమ్మతిని తెలపడంతో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు. చేవెళ్ల కు 10 నుంచి 12 కిలో మీటర్ల దూరంలో షాబాద్‌ మండలంలోని చందన్‌ వెళ్లిలో సుమారు 1650 ఎకరాలను ప్రభుత్వం పలు కంపెనీలకు కేటాయించింది. ఇప్పటికే పదికి పైగా కంపెనీలు మొదలయ్యాయి. సీతారాంపూర్‌లో 1100 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం ఆ భూములను కంపెనీలకు కేటాయించింది. రాబోయే నాలుగైదేళ్లలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. సుమారు 50వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చేవెళ్ల, షాబాద్‌ మండలాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నారు.