General

అందుబాటు ధరల్లో.. రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్

అందుబాటు ధరల్లో.. రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్
సొంతింటి కోసం ఎదురుచూస్తున్న మధ్యతరగతి వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మరోసారి రాజీవ్ స్వగృహ ఇళ్లను అమ్మకానికి పెట్టింది రేవంత్ సర్కార్. రాజీవ్ స్వగృహ ఇళ్లు, టవర్లు, ప్లాట్లను అమ్మకానికి ఏర్పాట్లు చేస్తోంది రాజీవ్ స్వగృహ కార్పొరేషన్. అందుబాటు ధరల్లో అపార్ట్ మెంట్స్ లో ఫ్లాట్లు, టవర్లు లభిస్తుండటంతో చాలామంది రాజీవ్ స్వగృహ ఇళ్ల కోసం ఆసక్తి చూపుతున్నారు. బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ప్లాట్లు, గాజుల రామారం, పోచారంలో రాజీవ్ స్వగృహ టవర్లతో పాటు నగరంలో వివిధ ప్రాంతాల్లోని లేఅవుట్లలో మిగిలిపోయిన ఓపెన్ ప్లాట్లను అమ్మడం ద్వారా భారీగా నిధులను రాబట్టాలని ప్లాన్ చేస్తోంది రాజీవ్ స్వగృహ కార్పొరేషన్. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టింది అప్పటి ప్రభుత్వం. మొత్తం 8,504 కోట్లతో 32 ప్రాజెక్టులు చేపట్టగా తెలంగాణ ప్రాంతంలో 6,301 కోట్లతో 22 ప్రాజెక్టులు చేపట్టారు. ఈ ప్రాజెక్టుల్లో ఇళ్ల నిర్మాణం 90 శాతం మేర పూర్తయ్యాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత 2016 లో ఈ ఇళ్లను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించాలని నిర్ణయించింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్. అయితే అది అమలు కాలేదు. దాంతో ఇప్పుడు పబ్లిక్ కు నేరుగా అమ్మకానికి పెట్టారు. దాదాపు 14 ఏళ్ల క్రితం నిర్మాణం అయిన రాజీవ్ స్వగృహ ఇళ్లను దశలవారీగా అమ్ముతూ వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మొదట్లో స్వగృహ ఇళ్లను బల్క్ పద్ధతిలో ఈ-వేలంలో అమ్మకానికి పెట్టినా ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆ తర్వాత ఒక్కో యూనిట్ గా అమ్మకానికి పెట్టగా పబ్లిక్ నుండి పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో లాటరీ పద్ధతిలో కొనుగోలుదారులను ఎంపిక చేశారు అధికారులు. హైదరాబాద్ లోని నాగోల్ సమీపంలో బండ్లగూడ వద్ద ఉన్న 2246 ప్లాట్స్ ను, పోచారం లోని 1479 ప్లాట్స్ ను గతంలో రెండు మూడు దఫాలుగా అమ్మకానికి పెట్టారు. ఇప్పుడు వాటిలో మిగిలిపోయిన ఇళ్లను మరోసారి అమ్మడానికి సిద్ధమైంది ప్రభుత్వం. బండ్లగూడ సహభావన టౌన్షిప్ లో సింగిల్, డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మకానికి పెట్టారు. మూడు సెగ్మెంట్లలో కలిపి మొత్తం 159 ఇళ్లను అమ్మాలని నిర్ణయించారు. ఇందులో అత్యధికంగా 545 చదరపు అడుగులు కలిగిన 105 సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు, సీనియర్ సిటిజన్స్ కోసం నిర్మించిన 645 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్న 24 సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు, 798 చదరపు అడుగులు కలిగిన 19 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, 1141 చదరపు అడుగుల నుండి 1266 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఎనిమిది త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు, 1487 చదరపు అడుగుల నుండి 1617 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన మూడు త్రిబుల్ బెడ్ రూమ్ డీలక్స్ ఇల్లు, నాగోల్ బండ్లగూడ సమీపంలో అందుబాటులో ఉన్నట్టు స్వగృహ కార్పొరేషన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఫ్లాట్ కేటగిరిని బట్టి చదరపు అడుగు 2750 నుండి 3 వేల రూపాయల వరకు ధరలున్నాయి. మోడల్ ప్లాట్ల ధరలు 2950 నుండి 4 వేల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. పోచారం వద్ద రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులో మొత్తం 601 ఇల్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. పోచారం వద్ద 523 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 255 ఫ్లాట్స్, 761 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 340 అందుబాటులో ఉన్నాయి. 1150 నుంచి 1250 అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు త్రిపుల్ బెడ్ రూమ్ ఇల్లు , త్రిబుల్ బెడ్ రూమ్ డీలక్స్ ఇల్లు రెండు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చదరపు అడుగు ధరను 2250 నుండి 2500 వరకు నిర్ణయించారు. అదే మోడల్ ప్లాట్ల విషయానికి వస్తే చదరపు అడుగు 2950 నుండి 3200 వరకు ధర వసూలు చేస్తుంది రాజీవ్ స్వగృహ కార్పొరేషన్. నాగోల్, బండ్లగూడ వద్ద ఇల్లు కొనుగోలు చేయదలచిన వారు ఈనెల 29వ తేదీ వరకు టోకెన్ అడ్వాన్స్ ఇంటి విస్తీర్ణాన్ని బట్టి లక్ష రూపాయల నుంచి 3 లక్షల వరకు డీడీలను తీసుకొని బండ్లగూడ టౌన్షిప్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. పోచారం టౌన్షిప్ లో ఇల్లు కొనుగోలు చేయదలచిన వారు ఈనెల 31వ తేదీ వరకు టోకెన్ అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రెండు రోజుల్లో లాటరీ ద్వారా ఇళ్లను కేటాయించనున్నారు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు. పోచారం మరియు గాజులరామారం ప్రాంతాల్లో నిర్మాణంలో ఉండి అసంపూర్తిగా ఉన్న పూర్తి టవర్లను సైతం వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించారు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధికారులు. పోచారం సద్భావన టౌన్షిప్ లో ఏ వన్ మరియు బి వన్ టవర్లలో మొత్తం 194 ప్లాట్లు ఉన్నాయి. వీటిని చదరపు అడుగుకు 1650 రూపాయల చొప్పున అమ్మాలని డిసైడ్ చేశారు. ఈ టవర్ల అమ్మకం ద్వారా 43.78 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక సహిరా టౌన్షిప్ పేరుతో గాజుల రామారావు వద్ద ఉన్న టవర్లలో మొత్తం 224 ప్లాట్లు ఉన్నాయి. ఇక్కడ చదరపు అడుగు ధరను 1995 రూపాయలుగా నిర్ణయించారు. ఇక్కడి టవర్ల అమ్మకం ద్వారా 52 కోట్ల రూపాయల ఆదాయాన్ని టార్గెట్ గా పెట్టుకుంది ప్రభుత్వం. వీటిని కొనుగోలు చేయదలచిన వారు ఆగష్టు 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కోటి రూపాయల నుండి రెండు కోట్ల వరకు ధారావత్ సొమ్ము చెల్లించి లాటరీలో పాల్గొనవచ్చు. ప్లాట్లు, టవర్లతో పాటు ఇంటి స్థలాలను సైతం ఈసారి వేలం వేస్తోంది తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్. రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్ గిరి పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 192 స్థలాల విక్రయాలకు సైతం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్ వద్ద వంద ప్లాట్లను వేలం వేయాలని డిసైడ్ చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో 200 నుండి 500 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. చందానగర్ పరిధిలో 1800 నుండి 2716 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన మూడు భారీ ప్లాట్లను సైతం విక్రయించేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఇక మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలో ఉండే బహుదూర్ పల్లి లో 69 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ 200 చదరపు గజాల నుండి 1000 గజాల వరకు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా ప్రాంతాలను బట్టి 20 వేల నుండి 40 వేల రూపాయల వరకు చదరపు గజం ధరను నిర్ణయించారు. వీటిని కొనుగోలు చేయదలచిన వారు ప్రాంతం, విస్తీర్ణాన్ని బట్టి రెండు లక్షల నుండి 10 లక్షల వరకు ధారావత్ చెల్లించి వేలంలో పాల్గొనవచ్చు. ఆగస్టు మొదటి వారం నుండి మూడో వారం వరకు ఈ భూముల వేలం ప్రక్రియను నిర్వహించనున్నారు. బండ్లగూడ, పోచారంలో గతంలో సైతం టవర్లు అమ్మకానికి పెట్టారు. అయితే అప్పుడు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఇళ్లను అమ్మారు. ఇప్పుడు పోచారం గాజులరామారంలో పూర్తిగా టవర్లను అమ్మకానికి పెట్టారు అధికారులు. ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేని క్లియర్ టైటిల్ గల ఫ్లాట్లు, ఇంటి స్థలాలు కావడంతో వీటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదించిన ఇల్లు లేదా భవనాలు, ప్లాట్లు అన్నీ కూడా ప్రధాన ప్రదేశాలలో మంచి కనెక్టివిటీ కలిగి ఉన్నాయి.

Related News

celebrity-homes

No articles available.

No posts available
No posts available